కొడంగల్, వెలుగు : సీఎం రేవంత్‌రెడ్డిపై కక్షతో కొడంగల్‌లో విధ్వంసానికి బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్ కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తిరుపతిరెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన లగచర్లలో పర్యటించి మీడియాతో మాట్లాడారు. 70 ఏండ్ల నుంచి అభివృద్ధిలో వెనకబడిన కొడంగల్‌ను సిరిసిల్ల, సిద్దిపేట్, గజ్వేల్ మాదిరిగా తీర్చిదిద్దేందుకు సీఎం కృషి చేస్తుంటే ఇక్కడి ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. నిరుద్యోగ, అమాయక యువతకు డబ్బు, మద్యం ఆశ చూపి కలెక్టర్, ఇతర అధికారులపై దాడికి ప్రోత్సహించారని ఆరోపించారు.
రూ. వేల కోట్లతో తమ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకున్న కేటీఆర్, హరీశ్‌లకు కొడంగల్‌పై చిన్నచూపెందుకని ప్రశ్నించారు. లగచర్లలో అధికారులపై జరిగిన దాడి ముమ్మాటికీ కేటీఆర్, హరీశ్ కుట్రేనని స్పష్టం చేశారు. ఆందోళనకారులకు వారు ఇచ్చిన నోట్ల కట్టలను పంచేందుకు మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిని పావుగా వాడుకున్నారని విమర్శించారు. అలాగే లగచర్ల, పోలేపల్లి, హకీంపేట్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా విలేజ్ కాదని, ఇండస్ట్రియల్హబ్ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే సీఎం ఉద్దేశమని స్పష్టం చేశారు.
సెల్ ఫోన్లు, బ్యాటరీల తయారీ యూనిట్లను స్థాపించేందుకు ఇప్పటికే పలు కంపెనీలు ముందుకు వచ్చాయని తెలిపారు. రైతులపై ఎలాంటి కేసులు ఉండవని ఆయన భరోసా ఇచ్చారు. అధికారులపై జరిగిన దాడిలో నిందితులకు ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాంతంలో సెంటు భూమి కూడా లేదన్నారు. తప్పు చేసిన వారు చట్టప్రకారం శిక్ష అనుభవించక తప్పదన్నారు.