చిట్టీల పేరుతో మోసం చేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్‌ అరెస్ట్‌

చిట్టీల పేరుతో మోసం చేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్‌ అరెస్ట్‌

కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు : చిట్టీల పేరుతో ప్రజలను మోసం చేసిన గ్రేటర్  వరంగల్​ మున్సిపల్  కార్పొరేషన్​లోని 26వ డివిజన్​ బీఆర్ఎస్​ కార్పొరేటర్​ బాలిన సురేశ్ ​ను ఇంతెజార్​గంజ్​ పోలీసులు అరెస్టు​ చేశారు. అతని వద్ద నుంచి రూ.1.15 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంతెజార్​గంజ్​ సీఐ పవన్​ కుమార్​ తెలిపిన వివరాల ప్రకారం.. కమిట్ మెంట్​ చిట్టీల పేరుతో వరంగల్​, హన్మకొండకు చెందిన వంద మంది సభ్యుల నుంచి బీఆర్ఎస్  కార్పొరేటర్  సురేశ్ రూ.6 కోట్లు  వసూలు చేశాడు.

సభ్యులకు చిట్టీ డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడని ఈనెల 10న అతనిపై గాళిపల్లి శ్రవణ్​ కుమార్, తైలం గౌతమ్​ సాగర్​ అనే వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు చేశారు. శనివారం తిలక్​ నగర్​లో కిరాయి ఇంట్లో ఉన్న అతనిని పోలీసులు అరెస్టు​ చేసి రూ.1.15 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా,  ఎక్కువ వడ్డీలకు ఆశపడి చిట్టీల పేరుతో పెట్టుబడి పెట్టి మోసపోవద్దని డిపాజిటర్లకు పోలీసులు సూచించారు. సురేశ్ ​ బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే ఇంతెజార్​గంజ్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయాలన్నారు.