- సీతారాంపూర్‌లో టీచర్స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయాలని బెదిరింపు
- లేదంటే రూ.40 లక్షలు ఇవ్వాలని డిమాండ్
- రూ. 10 లక్షలు చెల్లించిన బాధితుడు
- సీపీకి ఫిర్యాదుతో జైలుకు..
కరీంనగర్ క్రైం, వెలుగు : ఇంటి స్థలం రిజిస్ట్రేషన్చేయాలని, లేదంటే డబ్బులివ్వాలని బెదిరిస్తున్న ఓ బీఆర్ఎస్ కార్పొరేటర్‌ను బుధవారం కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ సిటీలోని సీతారాంపూర్‌కు చెందిన లింగారెడ్డి(టీచర్)కి పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమి విషయంలో ఇబ్బందులు ఉండకూడదనుకుంటే రూ.40 లక్షలు ఇవ్వాలని 21వ డివిజన్బీఆర్ఎస్ కార్పొరేటర్ జంగిలి సాగర్ డిమాండ్ చేశాడు. లేకపోతే 4 గుంటలు తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని కోరాడు. తన వల్ల కాదని లింగారెడ్డి కాళ్లా వేళ్లా పడ్డా సాగర్ వినిపించుకోలేదు. లింగారెడ్డికి సంబంధించిన భూమిలో నుంచి రోడ్డు వేయించాడు. వినకపోతే మొత్తం స్థలం ఉండకుండా చేస్తానని బెదిరించాడు. కనీసం రూ.10 లక్షలైనా ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
దీంతో సాగర్ కూతురి అకౌంట్‌కు రూ.2 లక్షలు ఫోన్ పే చేసి, మిగతా డబ్బును క్యాష్ రూపంలో ఇచ్చాడు. అయినా వేధింపులు ఆపకపోవడంతో ఈ నెల 18న సీపీ అభిషేక్ మహంతికి బాధితుడు లింగారెడ్డి ఫిర్యాదు చేశాడు. ఇబ్బందులకు గురి చేస్తున్నట్టుగా ఉన్న వీడియో ఆధారాలు సమర్పించాడు. దీంతో విచారణ చేయాలని సీపీ.. ఏసీపీని ఆదేశించారు. విషయం తెలుసుకున్న జంగిలి సాగర్ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్నారు. బుధవారం అతడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. సాగర్ పై గతంలోనూ భూములు లాక్కోవడం, ఇండ్లు కూల్చడం, ఇండ్లు కట్టుకునే వారి నుంచి లంచాలు డిమాండ్ చేయడం వంటి ఆరోపణలున్నాయి.