బీసీలకు ఆర్థిక సాయంలో అక్రమాలు జరిగాయంటూ.. కలెక్టర్ కి కంప్లెంట్​ చేసిన బీఆర్ఎస్​ కార్పొరేటర్

ప్రభుత్వ పథకాల్లో అవినీతి గురించి మాట్లాడితే ప్రతిపక్షాలవి వితండ వాదన అంటూ బీఆర్ఎస్​ లీడర్లు కొట్టిపడేస్తారు. అలాంటిది ఓ బీఆర్ఎస్​ కార్పొరేటర్​ అవినీతి జరుగుతోందని విచారించాలంటూ కలెక్టర్​ని కలవడం ఆ పార్టీలో చర్చనీయాంశం అయింది. 

కరీంనగర్​ మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలో బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం పంపిణీలో అక్రమాలు జరిగాయంటూ బీఆర్​ఎస్​ కార్పొరేటర్ కమల్జిత్​ కౌర్, ఆమె భర్త సోహెన్​సింగ్​ ఆరోపించారు. 

వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ ని కలెక్టరేట్ కార్యాలయంలో కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ధనవంతులకే ఆర్థిక సాయం ఇస్తున్నారని పేదలు మోసపోతున్నారని కార్పొరేటర్ ఆరోపించారు. 

అధికార పార్టీ కార్పొరేటర్లు అయినా తమపై వివక్ష చూపిస్తూ కాలనీ వాసులకు లబ్ధి జరగకుండా చూస్తున్నారని అన్నారు. రూ.లక్ష ఆర్థిక సాయం లబ్ధిదారుల ఎంపికపై విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. 

తాము చెప్పిన విషయాలు నిజం కాకపోతే రాజీనామాకు సైతం సిద్ధమని కమల్జిత్ కౌర్ దంపతులు స్పష్టం చేశారు. అధికార పార్టీ నేతల పరిస్థితే ఇలా ఉంటే ప్రతిపక్షాలు పాలిస్తున్న నియోజకవర్గాలు, బస్తీలు, కాలనీలు, గ్రామాల పరిస్థితి ఏంటని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.