నిజామాబాద్ లో మేయర్ పీఠంపై బీజేపీ కన్ను

నిజామాబాద్ లో మేయర్ పీఠంపై బీజేపీ కన్ను
  • నిజామాబాద్​ బల్దియాలో అవిశ్వాస తీర్మానానికి కార్పొరేటర్ల కసరత్తు
  • నోటీస్​ ఇచ్చేందుకు రెడీ అవుతున్న బీజేపీ కార్పొరేటర్లు
  • లోక్​సభ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ కు రిటర్న్​గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్
  • సంఖ్యా బలం ఉన్నా గతంలో బీజేపీకి దక్కని మేయర్ కుర్చీ
  • బీఆర్ఎస్​పవర్​పాలిటిక్స్​లో చేజారిన పదవి

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్​మేయర్​ పీఠంపై బీజేపీ కన్నేసింది. ప్రస్తుతం మేయర్​గా కొనసాగుతున్న బీఆర్ఎస్​ కార్పొరేటర్ దండు నీతూకిరణ్ ను దింపేసేందుకు గ్రౌండ్​వర్క్​ప్రిపేర్​చేస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లంతా ఏకమై త్వరలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్లాన్​చేస్తున్నారు. గత బల్దియా ఎన్నికల్లో 28 మంది బీజేపీ నుంచి కార్పొరేటర్లుగా గెలిచినప్పటికీ, బీఆర్ఎస్​పవర్ పాలిటిక్స్ కారణంగా మేయర్ కుర్చీ దక్కుండా పోయింది. 

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మారడంతో బల్దియాలో రాజకీయం వేడెక్కింది. అర్బన్ అసెంబ్లీ సెగ్మెంట్​లో బీజేపీ అభ్యర్థి గెలుపుతో మరింత జోష్​నింపినట్లు అయింది. దీంతో అవిశ్వాసం పెట్టి, మేయర్​కుర్చీని దక్కించుకోవాలని కమలం నేతలు చూస్తున్నారు. మొన్నటి దాకా బీఆర్ఎస్ కు మద్దతు తెలిపిన నలుగురు బీజేపీ కార్పొరేటర్లు, తిరిగి బీజేపీ క్యాంపుకు వచ్చేశారు. మరో ముగ్గురితో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే వాళ్లు కూడా వచ్చేస్తారని చెబుతున్నారు.

ఇదే సరైన టైమ్..

బీఆర్ఎస్ ఎత్తుగడతో గతంలో చేజారిన పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ నాలుగేండ్లుగా ఎదురుచూస్తోంది. ఏడుగురు బీజేపీ కార్పొరేటర్లను గులాబీ నేతలు లాక్కొని చేసిన రాజకీయాలను బీజేపీ లీడర్లు ఇన్నాళ్లూ దింగమింగుతూ వచ్చారు. ఇటీవల బీఆర్ఎస్​ప్రభుత్వం పడిపోవడంతో ఇదే కరెక్ట్ టైం అని భావిస్తున్నారు. రిటర్న్ గిఫ్ట్​ఇవ్వాలని ప్లాన్​చేస్తున్నారు. త్వరలోనే మేయర్​ దండు నీతూకిరణ్​పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని చూస్తున్నారు. 

లోక్​సభ ఎన్నికలకు ముందే ఇది జరిగిపోవాలని రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లా హెడ్​క్వార్టర్​లో పాగా వేస్తే పవర్ సెంటర్ అవుతుందని, అలాగే బీఆర్ఎస్​పై పంతం నెగ్గుతుందనే యోచనతో ఉన్నారు. అర్బన్​ఎమ్యెల్యేగా ధన్​పాల్ సూర్యనారాయణ గెలిచినందున బల్దియాలోనూ కాషాయ జెండా ఎగరవేయడం బీజేపీకి అవసరమని చెబుతున్నారు. సొంత బలానికి తోడు మేయర్​నీతూకిరణ్ పై అసంతృప్తిగా బీఆర్ఎస్​కార్పొరేటర్లను తమ వైపు తిప్పేకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు ఇద్దరే కావడంతో ఆ పార్టీ నేతలు ప్రస్తుత రాజకీయ పరిణామాలను గమనిస్తున్నారు. 

60 కార్పొరేటర్లలో 28 మంది బీజేపీనే

నిజామాబాద్ సిటీలో రెండు దశాబ్దాలుగా బీజేపీ హవా కొనసాగుతోంది. 1995లో ఆ పార్టీకి చెందిన ముక్తా దేవేందర్​గుప్తా, 2000లో డాక్టర్​భారతీరాణి మున్సిపల్​చైర్మన్లుగా గెలిచారు. 2005 తరువాత నిజామాబాద్​మున్సిపాలిటీ కార్పొరేషన్​గా మారింది. మేయర్​పదవి దక్కకున్నా అధిక సంఖ్యలో బీజేపీ కార్పొరేటర్లు గెలుస్తూనే ఉన్నారు. 2019లో అర్వింద్​ఎంపీగా గెలిచాక బల్దియాపై స్పెషల్ ఫోకస్​పెట్టారు. 

అభ్యర్థుల ఎంపికలో తీసుకున్న జాగ్రత్తలతో 60 డివిజన్లు ఉన్న కార్పొరేషన్​లో 28 మంది బీజేపీ నుంచి గెలిచారు. ఎంఐఎం నుంచి 16,  బీఆర్ఎస్ నుంచి 13 మంది, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, ఇండిపెండెంట్​ ఒకరు గెలిచారు. బీఆర్ఎస్​పవర్​పాలిటిక్స్​కారణంగా అత్యధిక డివిజన్లు గెలుచుకున్న బీజేపీకి మేయర్​పీఠం దక్కకుండా పోయింది. ఎంపీ అర్వింద్ ఎక్స్అఫిషియో ఓటు ఉన్నప్పటికీ మేయర్​కుర్చీ దక్కలేదు. మిత్రపక్షమైన ఎంఐఎం సపోర్టుతోపాటు బీజేపీలో చీలిక తెచ్చి బీఆర్ఎస్​కార్పొరేటర్​మేయర్​అయ్యారు.