కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ మున్సిపల్కార్పొరేషన్ కౌన్సిల్ ఆత్మీయ వీడ్కోలు సమావేశం రసాభాసగా జరిగింది. ఆఫీస్ ప్రాంగణంలో పోలీసు బందోబస్తు మధ్య వీడ్కోలు మీటింగ్ జరగగా, కాషాయ కండువా కప్పుకుని మేయర్ పాల్గొన్నారు. కమిషనర్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించకపోవడాన్ని నిరసిస్తూ మేయర్ సునీల్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు మీటింగ్ ను బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు.
మిగిలిన కార్పొరేటర్లకు కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, మేయర్ సునీల్ రావుతో కలిసి సన్మానం చేసి, వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీ ద్వారా రూ.1000 కోట్లు, 14,15వ ఫైనాన్స్, పట్టణ ప్రగతి, సాధారణ నిధులతో పాటు వివిధ గ్రాంట్ల ద్వారా వచ్చిన నిధులతో నగరాన్ని డెవలప్ చేశామన్నారు. డిప్యూటీ కమిషనర్ స్వరూప రాణి, ఎస్ఈ రాజ్ కుమార్ పాల్గొన్నారు.