- కాంపౌండ్ వాల్స్ కూల్చేసి దౌర్జన్యం
- కొన్నిచోట్ల ఇంటి నెంబర్లు తీసుకుని దందా
- పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న బాధితులు
- బయటకు రాని ఘటనలు కోకొల్లలు
హనుమకొండ, వెలుగు: వరంగల్ సిటీలో రూలింగ్ పార్టీ లీడర్ల ఆగడాలు ఎక్కువయ్యాయి. భూదందాలు, సెటిల్ మెంట్లతో సామాన్యులను భయభ్రాంతులకు గురి చేయడమే గాక కనిపించిన ఖాళీ జాగలను కబ్జా చేస్తున్నారు. ఎలాంటి డాక్యుమెంట్స్లేకున్నా భూముల మీదకు వెళ్లి దౌర్జన్యం చేస్తున్నారు. కొన్నిచోట్ల అధికార పార్టీ నేతలు, కార్పొరేటర్లపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. కొంతమంది కార్పొరేటర్లు భూదందాలపైనే ఆధారపడి వ్యవస్థ నడిపిస్తుండగా.. నియోజకవర్గ పెద్ద లీడర్లే తెరవెనుక ఉండి అంతా నడిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కుదిరితే బేరసారాలు.. లేదంటే బెదిరింపులు
వరంగల్ సిటీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది. దీంతో సిటీలో భూదందాలు పెరిగాయి. వీటి కోసం రూలింగ్ పార్టీ లీడర్లు, కార్పొరేటర్లు సెపరేట్ గ్యాంగులు మెయింటేన్ చేస్తున్నారు. ఖాళీ జాగ కనిపిస్తే అక్కడికి వెళ్లిపోయి.. ఓనర్లతో బేరసారాలకు దిగుతున్నారు. వారు ఒప్పుకోకపోతే దౌర్జన్యం చేస్తున్నారు. కొద్దిరోజుల కిందట ఖిలా వరంగల్ ఏరియాలోని ఓ ల్యాండ్‌లో కూడా ఇదే తరహా బాగోతం వెలుగు చూసింది. ఓ కార్పొరేటర్ కబ్జాకు పాల్పడటంతో సదరు ల్యాండ్ ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోకపోవడంతో బాధితులు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. గీసుగొండ మండలం గొర్రెకుంట సమీపంలో కూడా అధికార పార్టీకి చెందిన నేతలు ఓ ముస్లిం కుటుంబానికి చెందిన భూమిని ఆక్రమించే ప్రయత్నం చేశారు. ల్యాండ్ కు నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి ఆక్రమించే ప్రయత్నం చేశారు. వరంగల్ రంగశాయిపేటలో ఓ వృద్ధుడికి సంబంధించిన భూమిని అధికార పార్టీ నేతల సపోర్ట్ తో ఓ బిల్డర్కబ్జా చేశాడు. ఆ తరువాత వృద్ధుడితో బేరసారాలకు దిగగా.. ఆయన ఒప్పుకోలేదు. అదేమీ పట్టించుకోకుండానే ఏకంగా ఇండ్లు కట్టి అమ్మేశాడు. దీంతో బాధితుడు పోలీస్ కేసు పెట్టగా.. సివిల్డిస్ప్యూట్ అని పట్టించుకోకపోవడంతో ఆ వృద్ధుడు కాస్త కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. న్యూశాయంపేటలో అధికార పార్టీకి చెందిన ఓ మాజీ కార్పొరేటర్ కూడా ఖాళీ స్థలాలకు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి, ల్యాండ్ ఓనర్లపై బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితులు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. కేవలం ఇవే కాదు.. అధికార పార్టీ నేతలు, కార్పొరేటర్ల చేతిలో మోసపోయిన బాధితులు ఎంతోమంది ఉన్నారు.
పెద్ద లీడర్ల సపోర్ట్ తోనే..
సిటీలో అధికార పార్టీ పెద్ద లీడర్ల సపోర్ట్ తోనే కొంతమంది కార్పొరేటర్లు, కింది స్థాయి నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. కొద్దిరోజుల కిందట దేశాయిపేట సమీపంలో పార్కు కోసం కేటాయించిన లేఅవుట్ స్థలాన్ని ఓ కార్పొరేటర్ కబ్జా చేసి, అందులో ఓ గదిని కూడా నిర్మించాడు. మున్సిపల్ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందగా.. దానిని కూల్చేశారు. జక్కలొద్ది ప్రాంతంలోనూ అధికార పార్టీకి చెందిన ఓ నేత, వరంగల్పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి సోదరుడు కబ్జాలకు పాల్పడుతున్న ఆరోపణలు వెల్లువెత్తడంతో ఇదివరకు మావోయిస్టులు లేఖలు కూడా రిలీజ్ చేశారు. కాగా అధికార పార్టీ కార్పొరేటర్లు, నేతల కబ్జాల వెనుక పెద్ద లీడర్ల హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గ ప్రజాప్రతినిధులు పర్సంటేజీలకు అలవాటు పడి.. కబ్జాలు, భూదందాలను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలున్నాయి.
లిస్ట్ రెడీ చేయించిన సీపీ..
భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో బాధితులు పోలీస్ స్టేషన్లకు వెళ్లగా.. పెద్ద లీడర్ల నుంచి ప్రెజర్ రావడంతో సివిల్ వివాదాల బూచి చూపి, పోలీసులు కేసు నమోదు చేయడం లేదు. కాగా, సిటీలో తరచూ కబ్జాలకు పాల్పడుతున్న కార్పొరేటర్లు, అధికార పార్టీకి చెందిన లీడర్ల తో పాటు ల్యాండ్ గ్రాబర్స్ లిస్ట్ సీపీ తయారు చేసినట్లు తెలిసింది. స్టేషన్ల వారీగా వారివారి వివరాలు సేకరించి, సందర్భాన్ని బట్టి వారిపై యాక్షన్ తీసుకునేందుకు రెడీ అయినట్లు సమాచారం. ఇదివరకు ఎన్నడూ కార్పొరేటర్లపై కేసుల విషయాలు బయటకు రాకపోగా.. తాజాగా కార్పొరేటర్ పై కేసు నమోదు కావడమే ఇందుకు నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ నేతలపై చాలాచోట్ల కబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతుండగా.. బాధితులకు న్యాయం చేసేందుకు పోలీసులు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. కబ్జాలకు పాల్పడుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.
హనుమకొండ కాకతీయ కాలనీ ఫేజ్–2లోని 200 గజాల స్థలంపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడో డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ కన్నేశాడు. డెవలప్మెంట్ పేరుతో ఆ స్థలాన్ని తమకు అప్పగించాల్సిందిగా ల్యాండ్ ఓనర్ సునీత దంపతులను హెచ్చరించాడు. వాళ్లు నో చెప్పడంతో.. తన అనుచరులతో కలిసి ల్యాండ్మీదకు వెళ్లాడు. అక్కడున్న కాంపౌండ్‌వాల్‌ను కూల్చేశాడు. దీంతో మంగళవారం రాత్రి బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
వరంగల్ ఎస్ఆర్ఆర్ తోట ఏరియాలో ఓ లేడీ కార్పొరేటర్ భర్త కబ్జాలకు తెరలేపుతున్నాడు. 689/1, 690/1 సర్వే నెంబర్లలో దాదాపు 318 గజాల స్థలం ఉండగా.. ఈ ల్యాండ్ ను కబ్జా చేసేందుకు ప్రయత్నించాడు. కొద్దిరోజుల కింద గ్రేటర్ ఆఫీసర్లను మేనేజ్ చేసుకుని ఆ ల్యాండ్‌కు కొత్తగా ఇంటి నెంబర్ కూడా తీసుకున్నాడు. అనంతరం అదే జాగలో నిర్మాణం మొదలుపెట్టాడు. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.