టౌన్​ప్లానింగ్ ఉండగా..కొత్తగా హైడ్రా ఎందుకు?

టౌన్​ప్లానింగ్ ఉండగా..కొత్తగా హైడ్రా ఎందుకు?
  • బల్దియా ఇన్​ఫ్రాస్ట్రక్చర్, సిబ్బందిని ఎలా వాడుకుంటుంది?
  • స్టాండింగ్ కమిటీలో లేవనెత్తిన ఎంఐఎం, బీఆర్ఎస్​ కార్పొరేటర్లు
  • చర్చకు చాన్స్ లేకపోవడంతో మేయర్​కు వినతిపత్రం అందజేత

 హైదరాబాద్, వెలుగు : జీహెచ్ఎంసీలో అక్రమ కట్టడాలను తొలగించేందుకు ప్రత్యేకంగా టౌన్ ప్లానింగ్ విభాగం ఉండగా.. కొత్తగా హైడ్రా ఎందుకు..? అని ఎంఐఎం, బీఆర్ఎస్  కార్పొరేటర్ల ప్రశ్నించారు. బల్దియా హెడ్డాఫీసులో గురువారం నిర్వహించిన స్టాండింగ్ కమిటీలో హైడ్రాపై చర్చ జరిగింది. ఇప్పటికే బల్దియాకు మేయర్, కమిషనర్ ఉండగా మరొక వ్యవస్థ హైడ్రాను ఎందుకు ఏర్పాటు చేశారని ఎంఐఎం, బీఆర్ఎస్​కార్పొరేటర్లు లేవనెత్తారు. బల్దియా నుంచి ఇన్ ఫ్రాస్ర్టక్చర్, సిబ్బంది, జీతాలు అన్ని ఇస్తున్నప్పుడు సంస్థ కిందనే పని చేయాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. స్టాండింగ్ కమిటీలో చర్చకు చాన్స్ లేకపోగా మేయర్ కు మెమోరాండం అందజేశారు. దీనిపై కమిటీ ముందు పెట్టాలని కోరినా.. అలా ఎందుకు చేయలేదని మేయర్ ను కోరారు. కొన్నేండ్లుగా ఇండ్లు కట్టుకొని ఉన్నవారిని హైడ్రా పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని, దీంతో జీవనోపాధిపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. డీఆర్ఎఫ్  టీమ్ లు  పనిచేయడం లేదని కార్పొరేటర్లు ఫోన్ చేసినా వినడం లేదని,  వానలతో వచ్చే సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేసినా స్పందించలేదని మేయర్ కు సూచించారు. 

కార్పొరేటర్ల స్డడీ టూర్

మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన 4వ స్టాండింగ్ కమిటీ భేటీలో 7 అంశాలకు ఆమోదం తెలిపారు. వచ్చే నెలలో కార్పొరేటర్లను మూడు విడతల్లో 50 మంది చొప్పున స్టడీ టూర్ కు తీసుకెళ్లేందుకు ట్రావెల్ ఏజెన్సీల నుంచి కొటేషన్లు ఆహ్వానించుటకు ఆమోదించారు.  మేయర్ మాట్లాడుతూ సిటీ అభివృద్ధికి,  ప్రజలకు అవసరమైన పనులు చేపట్టడంలో కమిటీ సభ్యులు సహకరించాలని కోరారు. కమిషనర్ ఆమ్రపాలి, స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులు  పాల్గొన్నారు.