- బీజేపీ, కాంగ్రెస్ తోకలిసి అవిశ్వాసం
- తీర్మానంపై 31 మంది సంతకాలు
- అడిషనల్ కలెక్టర్ కు అందజేత
యాదాద్రి వెలుగు : భువనగిరిలో బీఆర్ఎస్‌కు సొంత పార్టీ కౌన్సిలర్లు షాక్ ఇచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ తో కలిసి చైర్మన్, వైస్ చైర్మన్‌పై మరోసారి అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. భువనగిరి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నుంచి 15 మంది కౌన్సిలర్లు గెలిచారు. ఇండిపెండెంట్, కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్ల చేరికతో ఆ పార్టీ బలం 20కి చేరింది. వీరిలో కొందరు కౌన్సిలర్లు, కాంగ్రెస్, బీజేపీ సభ్యులతో కలిసి 19 మంది ఈ ఏడాది ఫిబ్రవరి 7న అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. అయితే గత ప్రభుత్వం ఈ అంశాన్ని పెండింగ్‌లో పెట్టింది.
కౌన్సిలర్లు మళ్లీ ప్రయత్నాలు చేసినా అక్టోబర్‌లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో అవిశ్వాసం అంశం పక్కకు పోయింది. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో అవిశ్వాసం మళ్లీ తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ అసంతృప్త కౌన్సిలర్లు 16 మంది, బీజేపీ 6, కాంగ్రెస్ కు చెందిన 9 మంది కలిసి చైర్మన్, వైస్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు , చింతల కిష్టయ్య పై అవిశ్వాసం పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా అవిశ్వాసం నోటీసుపై 31 మంది కౌన్సిలర్లు సంతకాలు చేసి శనివారం అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డికి అందించారు.
ఏకపక్షంగా వ్యవహరిస్తున్నందునే...
చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్మన్ కిష్టయ్య ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా అవిశ్వాసం పెడుతున్నట్లు కాంగ్రెస్ కౌన్సిలర్ పొత్నాక్ ప్రమోద్ కుమార్ తెలిపారు. వారు అనుసరిస్తున్న విధానాలు భువనగిరి కౌన్సిలర్ల ఆత్మ గౌరవానికి భంగం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలోనే 19 మంది కౌన్సిలర్లతో సంతకాలతో అవిశ్వాసం నోటీసు ఇచ్చామని, ఇప్పుడు 31 మంది సంతకాలతో అడిషనల్ కలెక్టర్‌కు నోటీస్ ఇచ్చామని చెప్పారు. దాని ఆధారంగా కౌన్సిల్‌లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు తేదీని ప్రకటించాలని కోరామన్నారు.