కొత్తగూడెం మున్సిపల్ చైర్​పర్సన్ ..సీతాలక్ష్మిపై అవిశ్వాసం

  • కలెక్టర్​కు నోటీసు ఇచ్చిన 22 మంది బీఆర్ఎస్ ​కౌన్సిలర్లు
  • మరో నలుగురు మద్దతు తెలిపే అవకాశం
  • సీతాలక్ష్మి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు
  • మొన్నటి దాకా సాగిన గ్రూపు రాజకీయాలు బట్టబయలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం మున్సిపాలిటీలో అవిశ్వాసం సెగ రాజుకుంది. చైర్​పర్సన్ సీతాలక్ష్మిని దించేసేందుకు బీఆర్ఎస్ ​కౌన్సిలర్లు రెడీ అయ్యారు. మంగళవారం కలెక్టరేట్​లో కలెక్టర్​ ప్రియాంక అలను కలిసి 22 మంది కౌన్సిలర్లు అవిశ్వాస నోటీస్​ అందజేశారు. మరో నలుగురు మద్దతు తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొన్నటి దాకా అంతర్గతంగా సాగిన గ్రూపు రాజకీయాలు, విభేదాలు అవిశ్వాస నోటీసుతో బట్టబయలయ్యాయి.

కొత్తగూడెం మున్సిపాలిటీలో మొత్తం 36 మంది కౌన్సిలర్లు ఉండగా, వీరిలో ఒక ఇండిపెండెంట్, 25 మంది బీఆర్ఎస్, 8 మంది సీపీఐ, ఒకరు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీపీఐకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు బీఆర్ఎస్​లో చేరారు. దీంతో మున్సిపాలిటీలో బీఆర్ఎస్​ కౌన్సిలర్ల సంఖ్య 30కి పెరిగింది. అయితే తాజాగా 22 మంది బీఆర్ఎస్​ కౌన్సిలర్లు సొంత పార్టీకి చెందిన సీతాలక్ష్మిని చైర్​పర్సన్ ​పీఠం నుంచి దించేసేందుకు సిద్ధమయ్యారు. 

గతేడాది కుదరలే..

సీతాలక్ష్మి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ.. ఆమెను పదవి నుంచి తప్పించాలని గతేడాది మెజారిటీ బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాసానికి రంగం సిద్ధం చేశారు. మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రంగంలోకి దిగి వారికి సర్దిచెప్పడంతో అసమ్మతి సద్దుమణిగింది. అంతర్గతంగా గ్రూపు రాజకీయాలు నడుస్తున్నా.. బయటపడకుండా కవర్​చేస్తూ వచ్చారు.

అసమ్మతి కౌన్సిలర్లు మాత్రం సమయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో  అవిశ్వాసం మళ్లీ తెరపైకి వచ్చింది. లోక్​సభ ఎన్నికలకు ముందు సొంత పార్టీ కౌన్సిలర్లే తిరుగుబాటుకు దిగడం జిల్లాలోని గులాబీ నేతలకు మింగుడుపడడం లేదు.

శత్రువులే.. మిత్రులయ్యారు

సీతాలక్ష్మికి వ్యతిరేకంగా మొట్టమొదట గళం విప్పిన బీఆర్ఎస్​నేతలు సుందర్​రాజ్, యూసుఫ్ అవిశ్వాసం వేళ చైర్​పర్సన్​తో చేతులు కలపడం చర్చానీయాంశమైంది. గతంలో అవిశ్వాసం పెట్టేందుకు పావులు కదిపిన వీరిద్దరూ ఇప్పుడు ఆమెకు మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం అవిశ్వాసం పెట్టడంలో బీఆర్ఎస్ ​నేతలు బీమా శ్రీధర్, రావి రాంబాబు, దుర్గాప్రసాద్​ కీలకంగా వ్యవహరిస్తున్నారు.

నిన్న మొన్నటి వరకు వీరంతా ఒకటిగా ఉన్నప్పటికీ.. చైర్​పర్సన్​పదవి విషయంలో విభేదాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కౌన్సిలర్ల నోటీసు ఇచ్చిన వెంటనే రహస్య మంతనాలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ నేతలు బేరసారాలు సాగిస్తున్నారు. ఒక్కో కౌన్సిలర్​కు రూ.3 లక్షలు నుంచి రూ.4 లక్షలు ఆఫర్​చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సీపీఐ, కాంగ్రెస్, ఇండిపెండెంట్​కౌన్సిలర్ల మద్దతును అసమ్మతి కౌన్సిలర్లు కోరుతున్నారు.

కమీషన్ల దందా  అవిశ్వాస నోటీసుపై సంతకాలు చేసిన కౌన్సిలర్లు దామోదర్, శ్రీవల్లి, శ్రీనివాస్​రెడ్డితోపాటు పలువురు మీడియాతో మాట్లాడారు. కౌన్సిల్​ మీటింగ్​ఎజెండా తయారీలో సీతాలక్ష్మి ఎవరితోనూ చర్చించరని, తనకు అనుకూలంగా ఉన్న వార్డులకు ఫండ్స్ ఎక్కువగా కేటాయిస్తుంటారని ఆరోపించారు. పట్టణ సమస్యలను పూర్తిగా గాలికి వదిలేశారంటూ మండిపడ్డారు. పనుల్లో కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. తాము బీఆర్ఎస్ ను వీడడం లేదని, చైర్ పర్సన్​తీరుపైనే తమ పోరాటమని స్పష్టం చేశారు.

మొదట్నుంచి అసమ్మతినే

మొదటి నుంచి చైర్​పర్సన్​ సీతాలక్ష్మిపై సొంత పార్టీ కౌన్సిలర్లు అసమ్మతి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తమను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, పలువురు ఆరోపిస్తూ వచ్చారు. కౌన్సిల్​సమావేశాల్లో బీఆర్ఎస్​కౌన్సిలర్లే ఆమెను నిలదీసిన సందర్భాలు ఉన్నాయి. సమస్యలను పరిష్కరించడం లేదని గతంలో మున్సిపాలిటీ ఆఫీసు ముందు ధర్నాలు కూడా చేశారు.