- పార్లమెంట్ ఎన్నికల క్యాంపెయిన్‌కు కారుపార్టీకి తప్పని తిప్పలు!
ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ లీడర్ల వలసలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే స్థానిక సంస్థల లీడర్లు పార్టీ కండువా కప్పుకోగా.. తాజాగా ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీలో చేరడం ప్రారంభించారు. త్వరలోనే బీఆర్ఎస్ ను వీడి పది నుంచి 12 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ లోకి చేరుతారన్న చర్చ జోరుగా జరుగుతోంది. ఇదే జరిగితే బీఆర్ఎస్ కు ఉన్న ఒక్క బల్దియా పీఠం సైతం చేజారుతోంది.
సర్పంచులు మొదలు కొని జిల్లా స్థాయి ప్రజాప్రతినిధి వరకు బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరు పార్టీ వీడుతున్నారు. దీంతో మొన్నటి వరకూ జోరు మీదున్న కారు ఇప్పుడు ఖాళీ అవుతోంది. ఇటీవలే డీసీసీబీ చైర్మెన్, డైరెక్టర్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఇలా అన్ని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్ లోకి చేరారు. మరోవైపు జడ్పీ చైర్మన్ సైతం బీజేపీలో చేరడంతో ఏ స్థాయిలోనూ బీఆర్ఎస్ లీడర్లు కనిపించడం లేదు.
కాంగ్రెస్ వైపు కార్పొరేటర్ల చూపు.!
2020లో జరిగిన బల్దియా ఎన్నికల్లో పట్టణంలోని 49 వార్డుల్లో 24 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. ఇండిపెండెంట్లు ముగ్గురిని కలుపుకొని మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ఆతర్వాత బీజేపీ, కాంగ్రెస్ నుంచి పలువురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ లో కి చేరారు. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో.. బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో బీఆర్ఎస్ కు చెందిన ఓ కౌన్సిలర్ బీజేపీలో చేరగా తాజాగా మరో ఇద్దరు కౌన్సిలర్లు మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. మరోకౌన్సిలర్ కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిసి ముందుగానే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది.
కాపాడుకునేందుకు అష్టకష్టాలు..
గ్రామ స్థాయి నుంచి శ్రేణులు పార్టీ మారుతున్నా.. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ క్యాడర్ మొన్నటి వరకూ స్థిరంగా ఉన్నారు. ప్రస్తుతం కౌన్సిలర్లు పార్టీ మారుతుండడంతో జిల్లా నాయకులు ఆందోళన చెందుతున్నారు. దీనివల్ల పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ లో పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. కౌన్సిలర్లను కాపాడుకునేందుకు హైకమాండ్ శతవిధాలుగా యత్నిస్తోంది.
పార్టీ అధ్యక్షుడుగా ఉన్న జోగురామన్నకు అత్యంత విధేయులుగా ఉన్న కౌన్సిలర్లు కూడా బీఆర్ఎస్ను వీడుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారం మొదలు పెట్టకముందే పార్టీ క్యాడర్ ఇతర పార్టీలోకి వలసలు వెల్లడంతో క్యాంపెయిన్ చేయడానికి కూడా బీఆర్ఎస్ కష్టాలు తప్పేటట్లు లేదు. ఒక వైపు కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టగా..బీఆర్ఎస్ మాత్రం లీడర్లు పార్టీ మారకుండా కాపాడుకునేందుకే సమయం కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్‌లో చేరికలు
పట్టణానికి చెందిన ఇద్దరు కౌన్సిర్లు సాయి ప్రణవ్, అంజు పారిక్ రావు మంత్రి సీతక్క సమక్షంలో సోమవారం కాంగ్రెస్ లో చేరారు. వీరితో పాటు పలువురు బీఆర్ఎస్, బీజేపీ లీడర్ల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీజేపీ ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ ఆదివాసీ లీడర్ శ్రీలేఖ తన భర్త ప్రశాంత్ కలిసి కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో పెద్ద ఎత్తున చేరుతున్నారని పేర్కొన్నారు.