ఆదిలాబాద్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్​పై అవిశ్వాసం

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఈ మేరకు బుధవారం ఆ పార్టీ కౌన్సిలర్లు కలెక్టర్ రాజర్షి షాను కలిసి అవిశ్వాసం కోసం వినతిపత్రం అందజేశారు. రంజానీ ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్​లో చేరడంతోనే ఈ అవిశ్వాసం పెట్టినట్లు తెలుస్తోంది. 

కౌన్సిలర్ అజయ్ మాట్లాడుతూ.. వైస్ చైర్మన్​పై అవిశ్వాసం కోసం 34 మంది కౌన్సిలర్లు సంతకాలు చేశారని, అవిశ్వాసం నెగ్గాలంటే 25 మంది కౌన్సలర్లు అవసరం ఉండగా.. కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు సైతం సంతకాలు పెట్టి మద్దతు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, త్వరలో అవిశ్వాసానికి సంబంధించి తేదీ ఖరారు చేస్తామని కలెక్టర్ చెప్పినట్లు వెల్లడించారు.