- కేటీఆర్ మీటింగ్‌కు డుమ్మా కొట్టి క్యాంపునకు వెళ్లిన 12 మంది
- మున్సిపల్ చైర్ పర్సన్ కళను దింపేసేందుకు ప్రయత్నాలు
రాజన్న సిరిసిల్ల, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. సిరిసిల్ల మున్సిపాలిటీలో అవిశ్వాసం దిశగా అడుగులు పడుతున్నాయి. బీఆర్ఎస్‌కు చెందిన చైర్ పర్సన్ జిందం కళను దింపేసేందుకు 12 మంది కౌన్సిలర్లు క్యాంపునకు వెళ్లినట్లు సమాచారం. ఆదివారం కేటీఆర్ ఆధ్వర్యంలో సిరిసిల్లలో నిర్వహించిన లోక్‌సభ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి ఈ 12 మంది కౌన్సిలర్లు డుమ్మా కొట్టారు. ఆయన సిరిసిల్ల పర్యటనలో ఉన్నప్పుడే సదరు కౌన్సిలర్లంతా క్యాంపునకు వెళ్లడం హాట్‌టాపిక్‌గా మారింది.
రాష్ట్రంలో బీఆర్ఎస్ప్రభుత్వం పడిపోయి, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అనేక మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు ఊపందుకున్నాయి. సిరిసిల్లలో అలాంటిదేమీ ఉండదని, ఇక్కడ బీఆర్ఎస్ బలంగా ఉందని, ఆ పార్టీ నేతలు చెబుతూ వస్తున్నారు. కానీ ఆదివారం అనూహ్యంగా 12 మంది కౌన్సిలర్లు క్యాంపునకు తరలడం రాజకీయ వేడి రాజేసింది. ‘‘కష్టకాలంలో మనతో ఉన్నోళ్లే మనోళ్లు. ప్రతిపక్షంలో ఉన్నా పార్టీని పట్టుకుని ఉన్నోళ్లే.. మనోళ్లు. అక్కడక్కడ పార్టీలు మారే వాళ్లు ఉంటారు. వారిని పెద్దగా పట్టించుకోవద్దు’’ అని లోక్‌సభ నియోజకవర్గ స్థాయి సమావేశంలో కేటీఆర్చెప్పడం గమనార్హం.
మొదటి నుంచీ రెబల్ కౌన్సిలర్లు
సిరిసిల్ల మున్సిపాలిటీలో మొత్తం 39 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 2018 మున్సిపల్ ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన 12 మంది.. రెబల్స్ గా పోటీ చేసి గెలిచారు. బీఆర్ఎస్ నుంచి 22 మంది, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ముగ్గురు కౌన్సిలర్లుగా నెగ్గారు. ఎన్నికల తర్వాత 12 రెబల్కౌన్సిలర్లు బీఆర్ఎస్ లోకి వచ్చారు. అయితే చైర్పర్సన్ జిందం కళ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, తమ వార్డులకు నిధులు కేటాయించడం లేదని 12 మంది కౌన్సిలర్లు చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారంతా క్యాంపునకు వెళ్లడంతో అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధం అవుతున్నారని తెలుస్తున్నది.