- ఎమ్మెల్యే కందాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ దళిత లీడర్ల సమావేశం
- వైఖరి మార్చుకోకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి
ఖమ్మం రూరల్, వెలుగు: పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి నియోజకవర్గంలోని దళితులకు సముచిత స్థానం కల్పించడం లేదని బీఆర్ఎస్ పార్టీకి దళిత లీడర్లు ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఖమ్మం రూరల్ మండలంలోని మారెమ్మగుడి వద్ద ఉన్న ఫంక్షన్ హాలులో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాలకు చెందిన దళిత నాయకులు మాట్లాడుతూ.. గతంలో పాలేరు ఎమ్మెల్యేలు గెలిచిన రాంరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు దళితులకు తగిన గౌరవం ఇచ్చారని గుర్తుచేశారు. కందాల ఉపేందర్ మాదిరిగా వివక్ష చూపలేదని, కక్ష పూరితంగా వ్వవహరించలేదని మండిపడ్డారు. పార్టీ, నామినేటెడ్ పదవుల్లో దళితులకు ఏ మాత్రం అవకాశం కల్పించడం లేదన్నారు. ఎవరికైనా పదవి ఇచ్చినా కొద్ది రోజులకే ఏదో ఒక సాకుతో ఇబ్బందులకు గురిచేస్తూ తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నియోజకవర్గంలోని దళిత ప్రభుత్వ అధికారులను ఎలాంటి కారణాలు లేకుండా ట్రాన్స్ఫర్ చేయించారని ఆరోపించారు. ఒక వర్గానికి చెందిన వాళ్లు మాత్రమే పెత్తనం చెలాయిస్తున్నారని, ఇదే విషయాన్ని గతంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకుంటే త్వరలో తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు. అధికార పార్టీఎమ్మెల్యేపై ధిక్కార సమావేశం నిర్వహించడంతో పాలేరు కారు పార్టీలో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. సమావేశంలో లీడర్లు అంబేద్కర్, నాగేశ్వరరావు, శ్రీను, వినేశ్, గ్రామ పార్టీ కార్యదర్శులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.