- పెండింగ్ బిల్లులతో కలిపి 7.11 లక్షల కోట్లు మా నెత్తిన పెట్టారు: భట్టి
- అప్పులు చేయడం బీఆర్ఎస్కు తీరని దాహం
- ఈ అప్పులకుతోడు ప్రభుత్వ భూములను, చివరికి ఓఆర్ఆర్ ను సైతం అమ్మేశారు
- రైతు బీమా, డ్రిప్ ఇరిగేషన్, పాలీ హౌస్‌లు, వ్యవసాయ యాంత్రీకరణకూ పైసా ఇయ్యలే
- పదేండ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని డిప్యూటీ సీఎం ఫైర్
- మేం చేసిన అప్పులు రూ.4.17 లక్షల కోట్లే: హరీశ్‌రావు
- వ్యవసాయ స్కీమ్స్‌కు పైసలియ్యలేదని నిరూపిస్తే రాజీనామా చేస్త
- ఉమ్మడి ఏపీ అప్పులనూ తమపై రుద్దారని కామెంట్
- రాష్ట్ర అప్పులపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ
హైదరాబాద్, వెలుగు : గత బీఆర్ఎస్ సర్కారు చేసిన అప్పులు అక్షరాలా రూ.6 లక్షల71 వేల757 కోట్లు అని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అసెంబ్లీలో పెట్టిన వైట్‌పేపర్‌లో ఈ విషయం స్పష్టంగా పేర్కొన్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రూ.40,154 కోట్ల పెండింగ్ బిల్లులను కూడా కలుపుకొంటే మొత్తం రూ.7.11 లక్షల కోట్ల అప్పును బీఆర్ఎస్ వాళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తిన పెట్టిపోయారని పేర్కొన్నారు. అసెంబ్లీలో రాష్ట్ర అప్పులపై గురువారం స్వల్పకాలిక చర్చను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించగా, ఒకదశలో ఆయనకు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు మధ్య వాడీవేడి చర్చ జరిగింది.
బీఆర్ఎస్ చేసిన అప్పు రూ.4.17 లక్షల కోట్లు మాత్రమేనని హరీశ్‌రావు వాదించగా, ఆయనవి పచ్చి అబద్ధాలని, బీఆర్ఎస్ చేసిన అప్పులు రూ.7.11 లక్షల కోట్లని భట్టి వివరించారు. చర్చలో భాగంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి తీరని అప్పుల దాహం ఉండేదన్నారు. ఎడాపెడా లక్షల కోట్ల అప్పులు చేసి, అవి చాలదన్నట్టు భూములను, ఆఖరికి ఓఆర్ఆర్ ను సైతం అమ్మేసుకున్నారని ఆరోపించారు. ‘అప్పులు తేవడం.. తినడం చేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం పట్టించారు. ఇప్పుడేమో అసలు అప్పులే చేయలేదని, పైగా తప్పుడు లెక్కలతో సభను , రాష్ట్ర ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు.
రైతు బీమా, డ్రిప్ ఇరిగేషన్, పాలీ హౌస్, వ్యవసాయ యాంత్రీకరణకూ పైసా నిధులు ఇవ్వలేదు” అని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తాము పెట్టిన శ్వేతపత్రంలో రాష్ట్ర అప్పులను రూ.6,71,757 కోట్లుగా నిర్ధారించి సభ ముందు ఉంచామని చెప్పారు. గత సర్కారు నేరుగా చేసిన అప్పులు రూ.3 లక్షల 89 వేల 673 కోట్లు కాగా, వివిధ కార్పొరేషన్లకు ఇచ్చిన గ్యారంటీ అప్పులు రూ.2 లక్షల 82 వేల 84 కోట్లుగా శ్వేత పత్రంలో పొందుపరిచినట్టు చెప్పారు. పోతూపోతూ పెట్టిన పెండింగ్ బిల్స్ రూ.40,154 కోట్లు కూడా కలుపుకుంటే ఈ మొత్తం రూ.7 లక్షల11 వేల 911 కోట్లు అవుతుందని వివరించారు.
మేము తెచ్చేదంతా అప్పుల కిస్తీలకే పోతున్నది: భట్టి
ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎఫ్ఆర్బీఎం లోన్స్ రూ.52, 118 కోట్లు అని, ఇక గత ప్రభుత్వ అప్పుల్లో ప్రిన్సిపల్ అమౌంట్ కింద రూ.17,019 కోట్లు, వడ్డీలకు రూ.26,298 కోట్లు మొత్తంగా రూ.43,317 కోట్లు రీపేమెంట్స్ కింద చెల్లించినట్టు భట్టి విక్రమార్క చెప్పారు. గత ప్రభుత్వం రూ.40 వేల కోట్ల పెండింగ్ బిల్లులు పెడితే.. వాటిలో ఇప్పటివరకూ రూ.12 వేల కోట్లు క్లియర్ చేశామని తెలిపారు. అలాగే 3,69,200 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్‌కు, 2.86 లక్షల మంది పెన్షనర్లకు మొదటి తేదీనే శాలరీలు వేస్తున్నామని చెప్పారు. వాటితోపాటు రైతు భరోసాకు రూ.7,628 కోట్లు ఇచ్చామని తెలిపారు.
రైతు రుణమాఫీకి సంబంధించి రూ. 20,615 కోట్లు చెల్లించినట్టు చెప్పారు. రుణమాఫీ కోసం రాష్ట్ర ఆస్తులు అమ్మ లేదని, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్నో లేదా ఓఆర్ఆర్ ను ఎవరికో లీజుకి ఇవ్వలేదని అన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ నిధులను గత బీఆర్ఎస్ సర్కారు పెండింగ్‌లో పెడితే.. తాము రూ.890 కోట్లు క్లియర్ చేశామని చెప్పారు. ప్రతి కుటుంబానికి రూ.500కే గ్యాస్ సిలిండర్ కింద రూ.442 కోట్లు, గృహజ్యోతి కింద డిస్కంలకు అప్పు పెట్టకుండా రూ.1,234 కోట్లు ప్రభుత్వం నుంచి ప్రతి నెలా కడుతున్నట్టు తెలిపారు. రైతులకు పవర్ సబ్సీడీకి రూ.11 వేల 141 కోట్లు చెల్లించినట్టు చెప్పారు. గత సర్కారు హయాంలో రైతుల ఇన్సూరెన్స్‌కు పైసలు ఇవ్వలేదని, పంట నష్టపరిహారం బంద్ చేశారని, డ్రిప్ ఇరిగేషన్, పాలీ హౌస్ కు, ఫామ్ మెకానైజేషన్కు పైసా ఇవ్వలేదని పేర్కొన్నారు.
రైతు బీమాకు తమ పభుత్వం రూ.1,514 కోట్లు చెల్లించిందని చెప్పారు. రైస్ సబ్సిడీ రూ. 1,647 కోట్లు చెల్లించామని తెలిపారు. ఆర్టీసీ మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి, దాని కోసం రూ.1,376 కోట్లు ఆర్టీసీకి చెల్లించామని చెప్పారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కు సంబంధించి రూ.231 కోట్లు, జీతాలకు సంబంధించి రూ.61,194 కోట్లు 10, 11 నెలల్లో ప్రభుత్వం ఖర్చు పెట్టిందన్నారు. ఒకవైపు ఇవన్నీ చేసుకుంటూ గత ప్రభుత్వం చేసిన అప్పులకు రీపేమెంట్స్, వడ్డీలు చెల్లించుకుంటూ పోతున్నామని వివరించారు.
స్పీకర్ఫార్మాట్లో రాజీనామా చేస్త : హరీశ్‌రావు
పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.4.17 లక్షల కోట్లేనని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీ నుంచి వచ్చిన అప్పులను, మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలల కాంగ్రెస్ అప్పులను కూడా బీఆర్ఎస్ ఖాతాలో కలిపేశారని మండిపడ్డారు. తమకు వారసత్వంగా వచ్చిన అప్పు రూ. 72,658 కోట్లని, 2023 డిసెంబర్ 7 నుంచి 2024 మార్చి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.15,118 కోట్ల అప్పు చేసిందని తెలిపారు. దీంతోపాటు ఉమ్మడి ఏపీ నుంచి వచ్చిన గ్యారంటీ అప్పులు రూ.11,609 కోట్లు అని పేర్కొన్నారు. ఈ మొత్తం కలిపితే రూ.99,385 కోట్లు అని, ఈ అప్పుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధమే లేదని చెప్పారు.
శ్వేతపత్రంలో చెప్పిన దాని ప్రకారం 6,71,757 కోట్ల నుంచి తాము తీసుకోని అప్పు 99,385 కోట్లు, ప్రభుత్వం కట్టాల్సిన అవసరం లేని అప్పు రూ. 1,54,876 కోట్లు తీసేస్తే రూ.4,17,496 కోట్లు మిగులుతుందని, ఇది మాత్రమే తమ ప్రభుత్వం చేసిన అప్పు అని చెప్పారు. ఇక వ్యవసాయ యంత్రాలకు, డ్రిప్ ఇరిగేషన్‌కు నిధులు ఇవ్వలేదని, మెస్ చార్జీలు పెంచలేదని భట్టి విక్రమార్క అన్నారని, ఒకవేళ అవి నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్లో తాను రాజీనామా చేస్తానని సవాల్ చేశారు.
భట్టి విక్రమార్క మాటలు చూస్తుంటే నేతి బీరకాయలో నెయ్యి ఎంతనో ఆయన మాటల్లో నీతి అంత ఉందని ఎద్దేవా చేశారు. ఇక మీద ఎవరైనా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసిందని అంటే కోర్టుకు వెళ్తామని, లీగల్ నోటీసులు ఇవ్వడమే కాకుండా.. ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని హెచ్చరించారు. అన్ని అబద్ధాలు, తప్పులు భట్టి విక్రమార్కనే చెబుతున్నారని అన్నారు.
తొలి ఏడాదే రూ.1.27 లక్షల కోట్ల అప్పు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే రూ. 1.27 లక్షల కోట్ల అప్పు చేసిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ లెక్కన అప్పులు చేస్తే ఐదేండ్లలోనే గత ప్రభుత్వ అప్పును మించిపోతుందని అన్నారు. రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం పరంగా చూస్తే.. తాము కూడా మిగులు బడ్జెట్ రాష్ట్రాన్నే అప్పగించామని, రూ.2.93 లక్షల కోట్ల బడ్జెట్‌తో రాష్ట్రాన్ని కాంగ్రెస్‌కు అప్పగించామని చెప్పారు. రాష్ట్ర సొంత ఆదాయం రూ. 35 వేల కోట్ల నుంచి రూ. 1.50 లక్షల కోట్లకు పెంచామని వివరించారు. కరోనా, కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల రాష్ట్రానికి ఆదాయం తగ్గిందని
దీంతో రాష్ట్రంపై కొంత అప్పుల భారం పడింది కానీ కొన్ని పాత అప్పులను కూడా ఈ ప్రభుత్వం తమ ఖాతాలో వేసిందని ఆరోపించారు. భూములు కుదువపెట్టి అప్పులు తీసుకునేందుకు బ్యాంకుల చుట్టూ కాంగ్రెస్ ప్రభుత్వం తిరుగుతున్నదని చెప్పారు. రూ. 75 కోట్లకు ఎకరం చొప్పున ప్రభుత్వ భూమిని టీజీఐఐసీకి కేటాయించి, అమ్ముతున్నారని ఆరోపించారు.
టెన్టేటివ్రిస్క్ వెయిటెడ్ ఔట్ స్టాడింగ్ గ్యారంటీ..ఇది హరీశ్‌రావు టెక్నిక్
హరీశ్‌రావు కంటే ముందు ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్, కేసీఆర్ చేశారని భట్టి విక్రమార్క అన్నారు. ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా తాను ఉన్నానన్నారు. హరీశ్ రావు ఆర్థిక మంత్రిగా ఉన్న టైంలో తెలివిగా గ్యారంటీలను రూ.38,807 కోట్లుగా చూపించారని చెప్పారు. అంతకంటే ముందు కేసీఆర్ ఆర్థిక మంత్రిగా ఉన్న టైంలో రూ.1.35 లక్షల కోట్లుగా ఉందని వివరించారు. ఒకటే ఏడాదిలో ఇవన్నీ తీర్చేశారా? అని చూస్తే అసలు కథ బయటపడిందని చెప్పారు. కొత్తగా టెన్టేటివ్ రిస్క్ వెయిటెడ్ ఔట్‌స్టాండింగ్ గ్యారంటీ అని కొత్త పదం పెట్టారని, దీంతో గ్యారంటీలతో తీసుకున్న అప్పుల్లో అసలు మొత్తాన్ని చూపించకుండా రిస్క్ గ్యాప్ పేరుతో అప్పులను తగ్గించి చూపించారని తెలిపారు.
అయితే అవేమీ సొంతంగా ఆయా కార్పొరేషన్ల ఆదాయంతో తిరిగి చెల్లించడం లేదని, ప్రభుత్వ ఖజానా నుంచే కడుతున్నట్టు చెప్పారు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద తీసుకొచ్చిన అప్పు రూ.64,651 కోట్లు అని పేర్కొన్నారు. కానీ దానిని రిస్క్ పేరుతో రూ.16 వేల కోట్లకే చూపించారని తెలిపారు. కానీ ప్రభుత్వమే అప్పులు చెల్లిస్తుందని వివరించారు. కాళేశ్వరంలోని నీళ్ళన్నింటికీ మీటర్లు పెట్టి వసూలు చేసి కట్టారా అంటే అదీ లేదన్నారు.
మిషన్ భగీరథ విషయంలోనూ అలానే చేశారని చెప్పారు. ఇలా ప్రభుత్వం కట్టనవసరం లేదంటూ రూ.1.29 లక్షల కోట్లను తగ్గించి.. గ్యారంటీలను కేవలం రూ.38 వేల కోట్లుగా చూపించారని భట్టి వివరించారు. ఇది హరీశ్ రావు టెక్నిక్ అని, సభను, రాష్ట్ర ప్రజల్ని తప్పు దోవ పట్టించడానికి ఈ లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు.
ఏడాదిలో వివిధ స్కీమ్స్‌కు కాంగ్రెస్సర్కారు చేసిన ఖర్చు
స్కీమ్స్ ఖర్చు (రూ.కోట్లలో)
రైతు భరోసా 7,628
500 గ్యాస్ సిలిండర్ 442
రైతులకు పవర్ సబ్సిడీ 11,141
మహాలక్ష్మి 1,376
కల్యాణలక్ష్మి 231
జీతాలు, పెన్షన్లు 61,194
రుణమాఫీ 20,615
పెండింగ్ బిల్లుల చెల్లింపులు 12,000
అప్పుల కిస్తీలు, వడ్డీలకు 43,317
గృహజ్యోతి 1,234