ఆశాలపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోండి

ఆశాలపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోండి
  • మహిళా కమిషన్​కు బీఆర్​ఎస్​ ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు: ఆశా వర్కర్లతో పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని, మహిళల గౌరవానికి భంగం కలిగించారని మహిళా కమిషన్​కు బీఆర్​ఎస్​ మహిళా విభాగం ఫిర్యాదు చేసింది. ఆశావర్కర్లు శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే  పోలీసులు దాడి చేశారని పేర్కొంది. మంగళవారం మహిళా కమిషన్​ చైర్​పర్సన్​ నేరెళ్ల శారదను తుల ఉమ నేతృత్వంలోని బీఆర్​ఎస్​ మహిళా నేతలు కలిసి ఫిర్యాదును సమర్పించారు. 

ఎన్నికల సందర్భంగా ఆశా వర్కర్ల జీతాన్ని నెలకు రూ.18 వేలకు పెంచుతామని సీఎం రేవంత్​ రెడ్డి హామీ ఇచ్చారని, దానిని డిమాండ్​ చేస్తూ నిరసన చేపట్టిన ఆశా వర్కర్లపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏసీపీ శంకర్, సీఐ శ్రీనివాస చారి నేతృత్వంలోని పోలీసులు.. ఆశా వర్కర్లను లాక్కెళ్లారని, నిర్దయగా పోలీస్​ వ్యాన్లలో కుక్కి కొట్టారని చెప్పారు. ఓ ఆశా వర్కర్​చీరను పట్టుకుని లాగారని, చాలా మంది ఆశావర్కర్లను మగ పోలీసులు చెంప దెబ్బలు కొట్టారని ఫిర్యాదు కాపీలో పేర్కొన్నారు.