మానుకోట ఎస్పీ ఆఫీస్‌‌ ఎదుట బీఆర్‌‌ఎస్‌‌ ధర్నా

  • మహబూబాబాద్‌‌లో కేటీఆర్‌‌ ధర్నాకు పర్మిషన్‌‌ ఇవ్వాలని డిమాండ్‌‌

మహబూబాబాద్, వెలుగు : బీఆర్‌‌ఎస్‌‌ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించనున్న ధర్నాకు పర్మిషన్‌‌ ఇవ్వాలంటూ బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు ఎస్పీ ఆఫీస్‌‌ ఎదుట ధర్నాకు దిగారు. మహబూబాబాద్‌‌లో కేటీఆర్‌‌ నిర్వహించనున్న ధర్నాకు అనుమతి ఇవ్వాలని బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు పోలీసులను కోరారు. అయితే కేటీఆర్‌‌ పర్యటనను అడ్డుకుంటామని కొన్ని గిరిజన సంఘాలు ప్రకటించడంతో లా అండ్‌‌ ఆర్డర్‌‌ సమస్య తలెత్తే అవకాశం ఉందంటూ ధర్నాకు పోలీసులు పర్మిషన్‌‌ ఇవ్వలేదు. దీంతో బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు ఎస్పీ ఆఫీస్‌‌ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. 

కేటీఆర్‌‌ పాల్గొననున్న ధర్నాకు పర్మిషన్‌‌ ఇచ్చే వరకు తాము కదిలేది లేదంటూ అక్కడే బైఠాయించారు. ఈ టైంలో కొందరు లీడర్లు ఖాళీ వాటర్‌‌ బాటిల్స్‌‌ను ఎస్పీ క్యాంప్‌‌ ఆఫీస్‌‌ వైపు విసరడంతో అలర్ట్‌‌ అయిన పోలీసులు భారీగా సిబ్బందిని మోహరించారు. ధర్నాకు పర్మిషన్‌‌ ఇవ్వకపోవడానికి కారణమేంటో రాతపూర్వకంగా చెప్పే వరకు ధర్నా కొనసాగిస్తామని పట్టుబట్టారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్‌‌రావు, పోచంపల్లి  శ్రీనివాస్‌‌రెడ్డి, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్‌‌నాయక్‌‌ పాల్గొన్నారు.