రాష్ట్రంలో హాట్ టాపిక్‎గా దీక్షా దివస్.. సెంటి ‘మంట’ ఫలించేనా..?

హైదరాబాద్: దీక్షా దివస్.. నవంబర్ 29న మాజీ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ వేదికగా తెలంగాణ కోసం దీక్ష ప్రారంభించిన రోజు.. హైదరాబాద్ ను ఫ్రీజోన్ గా పరిగణిస్తూ జారీ అయిన 14 ఎఫ్ ఉత్తర్వులకు వ్యతిరేకంగా కేసీఆర్ దీక్షకు దిగారు. కరీంనగర్ నుంచి సిద్ధిపేటలోని దీక్షా స్థలికి వెళ్తున్న కేసీఆర్ ను అల్గునూరు చౌరస్తా వద్ద పోలీసులు అరెస్టు చేశారు. దీంతో నిరుద్యోగులు, తెలంగాణ ఉద్యమకారులు ఉవ్వెత్తున్న ఎగిసిపడ్డారు. అడుగడుగునా అడ్డు తగిలారు. ఈ ఘటన జరిగి.. ఇవాళ్టికి పదిహేనేళ్లు పూర్తయింది. 

పదేండ్లు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ దీక్షా దివస్ ను ఈ స్థాయిలో ఎప్పుడూ నిర్వహించలేదు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ నిర్వహిస్తోందీ బీఆర్ఎస్.. కేసీఆర్ లేకుండానే ఈ కార్యక్రమాలను చేస్తోంది. సరిగ్గా ఏడాది క్రితం అధికారంలో కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మళ్లీ మూలాలను వెతక్కుంటోంది. ఎక్కడి నుంచి ప్రయాణం ప్రారంభించిందో మళ్లీ అక్కడికి చేరడమే సేఫ్​ అనే భావనతో ఉన్నట్టు కనిపిస్తోంది. 

ALSO READ | మాలల సింహ గర్జన.. ఐక్యత కోసం.. హక్కుల కోసం: ఎమ్మెల్యే వివేక్

సమితిగా ఆవిర్భవించిన గులాబీ పార్టీ తర్వాత జాతీయ రాజకీయాలపై మక్కువతో బీఆర్ఎస్ గా మారింది. తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. కేవలం 39 సీట్లు సాధించింది. పార్లమెంటు ఎన్నికల్లో ఉనికి కోల్పోయింది. ఎక్కువ మంది అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. పునరాలోచనలో పడిన బీఆర్ఎస్.. మళ్లీ యూటర్న్ తీసుకోబోతోందనే సంకేతాలు వచ్చాయి. ముఖ్య నేతలు కూడా ధ్రువీకరించారు. ఇదే సమయంలో పూర్వవైభవం కోసం మళ్లీ సెంటిమెంట్ ను రగిలించే పనిలో పడిందనే వాదన బలంగా వినిపిస్తోంది. 

హాట్ టాపిక్‎గా దీక్షా దివస్


కేసీఆర్ దీక్ష చేసి ఇప్పటికీ 15 ఏండ్లు పూర్తవుతోంది. నిజానికి కేసీఆర్ చేసింది 14ఎఫ్​ రద్దు కోసం.. అది కాస్తా తెలంగాణ టర్న్ తీసుకుంది. డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్టు అప్పటి యూపీఏ ప్రభుత్వం తొలి ప్రకటన చేసింది. తర్వాత ఆ ప్రకటన వెనక్కి వెళ్లింది. దీంతో ఊరూరా జేఏసీలు ఏర్పడ్డాయి.. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడింది. స్వరాష్ట్ర సాధనకు బాటలు పడ్డాయి. సబ్బండ వర్ణాలు సమరనాదం వినిపించడం.. ఊరూరా జేఏసీలు ఏర్పడటంతో, పల్లె, పట్టణం ఒక్కటయ్యాయి. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి బీఆర్ఎస్ దీక్షా దివస్ ను నిర్వహిస్తోంది. పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఒక్క  సారి కూడా దీక్షా దివస్ లో పాల్గొన లేదు. ఎప్పటి లాగే ఈ సారి కూడా కేసీఆర్ లేకుండానే ప్రోగ్రామ్స్ కు కారు పార్టీ శ్రీకారం చుట్టడం గమనార్హం. 

వర్కవుట్ అవుతుందా..?

రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్.. తిరిగి పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. కేసీఆర్ ఫాంహౌస్ కే పరిమితమయ్యారు. కనీసం అసెంబ్లీకి కూడా రావడం లేదు. కేటీఆర్, హరీశ్ రావు అధికార పక్షంపై పోటాపోటీగా దాడి చేస్తున్నారు. ఎవరికి వారుగా ప్రోగ్రామ్స్ చేస్తూ.. పార్టీని లైమ్ లైట్ లో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. బీసీ ఎజెండాతో ఇటీవలే కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత కూడా కార్యాచరణ ప్రారంభించారు. ఈ తరుణంలోనే దీక్షా దివస్ రావడంతో దానిని ఉపయోగించుకొని సెంటిమెంట్ రగిలించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా కరీంనగర్ లో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు బయల్దేరడం విశేషం. ఈ తరుణంలో తెలంగాణ ఉద్యమం నాటి సెంటిమెంట్ రగులుకుంటుందా..? వాడిన గులాబీ మళ్లీ వికసిస్తుందా..? అనేది చర్చనీయాంశంగా మారింది.