బరాబర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా : పిల్లి రామరాజు

 నల్గొండ అర్బన్/కనగల్​, వెలుగు: బెదిరింపులకు భయపడేది లేదని, బరాబర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని బీఆర్ఎస్  అసమ్మతి నేత పిల్లి రామరాజు యాదవ్ స్పష్టం చేశారు. ఆదివారం కనగల్  మండల కేంద్రంలోని ప్రైవేట్‌ ఫంక్షన్ హాల్‌లో  2 వేల మంది కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు చెందిన నేతలు తనపై  అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, వాటిని ఎవరూ నమ్మవద్దని సూచించారు.

నల్గొండ నియోజకవర్గం 70 ఏళ్లుగా ఒకే సామాజిక వర్గం గుప్పిట్లో ఉందని,  సామాజిక మార్పునకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందన్నారు.  ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఎన్ని ఆటంకాలు సృష్టించినా బడుగు, బలహీన వర్గాల తరఫున పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ఎన్ని వేధింపులకు పాల్పడినా  జైలుకు పంపినా వెనక్కి తగ్గేది లేదని.. పోటీ చేసి తీరుతానని ప్రకటించారు.  ఈ కార్యక్రమంలో కనగల్లు మండలానికి సంబంధించిన వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచ్ లు,  వార్డు మెంబర్లు, వివిధ గ్రామాల బాధ్యులు పాల్గొన్నారు.