మల్లన్నసాగర్‌‌ నిర్వాసితుల రుణగోస

మల్లన్నసాగర్‌‌  నిర్వాసితుల రుణగోస
  • ఎనిమిదేళ్లుగా పెండింగ్‌‌లో క్రాప్‌‌లోన్లు
  • భూమి తీసుకున్నందున ప్రభుత్వమే మాఫీ చేస్తుందని హామీ
  • ఆ తర్వాత పట్టించుకోని బీఆర్‌‌ఎస్‌‌ సర్కార్‌‌
  • పాత లోన్లు మాఫీ కాకపోవడంతో కొత్త లోన్లు ఇవ్వని బ్యాంకర్లు
  • ఇబ్బందుల్లో వెయ్యి మందికిపైగా నిర్వాసితులు
  • సమస్య పరిష్కరించాలని సీఎం సలహాదారు వేంనరేందర్‌‌రెడ్డికి వినతి

సిద్దిపేట, వెలుగు :  మల్లన్నసాగర్‌‌ ప్రాజెక్ట్‌‌ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల క్రాప్‌‌లోన్లు ఎనిమిదేండ్లుగా పెండింగ్‌‌లోనే ఉన్నాయి. భూ సేకరణకు ముందు తీసుకున్న లోన్లను ప్రభుత్వమే చెల్లిస్తుందని 2016లో భూసేకరణ టైంలో ఆఫీసర్లు మౌఖికంగా హామీ ఇవ్వడంతో రైతులు చెల్లింపులను నిలిపివేశారు. భూమికి సంబంధించిన పరిహారం చెల్లించే టైంలో క్రాప్‌‌లోన్లను వసూలు చేసేందుకు బ్యాంకర్లు ప్రయత్నించినా జిల్లా అధికారుల ఆదేశాలతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. కానీ తర్వాత ప్రభుత్వం మల్లన్నసాగర్‌‌ నిర్వాసితుల లోన్లను మాఫీ చేయకపోవడంతో అవి పెండింగ్‌‌లో పడి కొత్త సమస్యలు తెచ్చి పెడుతున్నాయి. 

14 వేల ఎకరాల సేకరణ

కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌లో భాగంగా సిద్దిపేట జిల్లా తొగుట, కొండపాక మండలాల పరిధిలో 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్‌‌ రిజర్వాయర్‌‌ను నిర్మించారు. ఈ రిజర్వాయర్ కోసం తొగుట మండలంలోని వేములఘట్, పల్లెపహాడ్, లక్ష్మాపూర్, ఏటిగడ్డ కిష్టాపూర్, బంజేరుపల్లి, రాంపూర్, కొండపాక మండలంలోని సింగారం, ఎర్రవల్లితో పాటు మరో ఏడు మధిర గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఆయా గ్రామాలకు చెందిన దాదాపు 14 వేల ఎకరాల భూములను రిజర్వాయర్‌‌ కోసం ప్రభుత్వం 2016లో సేకరించింది. ముంపు గ్రామాల్లోని రైతులు భూ సేకరణకు ముందే వివిధ బ్యాంకుల్లో తమ భూములను తనఖా పెట్టి క్రాప్‌‌ లోన్లు తీసుకున్నారు. ప్రభుత్వమే భూములు సేకరిస్తున్నందున క్రాప్‌‌లోన్లు మాఫీ అవుతాయని అధికారుల మౌఖిక హామీని నమ్మిన రైతులు భూములు అప్పగించారు. 

లోన్లు చెల్లించాలంటూ నోటీసులు

భూ సేకరణ, పరిహారాల చెల్లింపు మొత్తం ముగిసిన తర్వాత క్రాప్‌‌లోన్లు చెల్లించాలంటూ బ్యాంకర్లు రైతులకు నోటీసులు జారీ చేయడం ప్రారంభించారు. అప్పటికే గ్రామాలను ఖాళీ చేసి వెళ్లిపోయిన రైతుల్లో కొందరు రెన్యూవల్‌‌ చేసుకుంటామని ముందుకు వచ్చినా భూమి ప్రభుత్వం పేరిట మారడంతో బ్యాంకర్లు అంగీకరించలేదు. దీంతో వడ్డీలు చెల్లిస్తూ వచ్చారు. బ్యాంకర్లు వన్‌‌టైం సెటిల్‌‌మెంట్‌‌కు అవకాశం ఇవ్వడంతో కొందరు రైతులు క్రాప్‌‌లోన్లు చెల్లించినా ఇంకా వెయ్యి మందికి పైగానే భూనిర్వాసితుల క్రాప్‌‌లోన్లు వారి పేరిటే కొనసాగుతున్నాయి. రైతులు ఇతర అవసరాల కోసం బ్యాంకు లోన్‌‌ తీసుకునేందుకు వెళ్తే మీ పేరిట ఇప్పటికే క్రాప్‌‌ లోన్‌‌ ఉన్నందున కొత్త లోన్లు దొరకవని ఆఫీసర్లు చెబుతుండడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తుండడంతో మల్లన్న సాగర్‌‌ భూనిర్వాసితుల లోన్లు సైతం మాఫీ చేయాలని డిమాండ్‌‌ చేస్తున్నారు. ఈ విషయంపై డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డితో కలసి సీఎం సలహాదారు వేంనరేందర్‌‌రెడ్డికి వినతిపత్రం అందజేసి సమస్యను వివరించారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌‌రెడ్డితో పాటు రుణమాఫీ చైర్మన్‌‌ కోదండరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ప్రత్యేక జీవోతోనే సమస్యకు పరిష్కారం

మల్లన్న సాగర్‌‌ భూ నిర్వాసితుల పెండింగ్‌‌ రుణాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో జారీ చేస్తేనే సమస్య పరిష్కారమయ్యే పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వ హయాంలో రుణమాఫీ జరిగినా అది కొద్ది మొత్తంలోనే జరగడంతో చాలా మంది భూ నిర్వాసితులకు అవకాశం దక్కలేదు. ప్రస్తుతం ప్రభుత్వం 2018 నుంచి 2023 డిసెంబర్‌‌ వరకు రుణాలకు సంబంధించి కటాఫ్‌‌ తేదీని ప్రకటించడం వల్ల 2016లో తీసుకున్న మల్లన్న సాగర్‌‌ భూ నిర్వాసితుల పెండింగ్‌‌ లోన్లు మాఫీ అయ్యే పరిస్థితి లేదు. ఈ సమస్యను ఎదుర్కొంటున్న రైతుల కోసం ప్రత్యేకంగా జీవో విడుదల చేస్తే సుమారు వెయ్యి మంది రైతులకు సంబంధించిన రూ. 10 కోట్ల లోన్లు మాఫీ అయ్యే ఛాన్స్‌‌ ఉంది. ప్రాజెక్ట్‌‌ల కోసం సర్వం కోల్పోయామని, ప్రభుత్వం స్పందించి రుణాలను మాఫీ చేయాలని నిర్వాసితులు కోరుతున్నారు.

రుణ విముక్తులను చేయాలి 

మల్లన్నసాగర్ ప్రాజెక్ట్‌‌ నిర్మాణంతో సర్వం కోల్పోయిన భూ నిర్వాసితులను రుణవిముక్తులను చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. భూములు పోయి బ్యాంకు రికార్డుల్లో అప్పులున్న రైతులుగా కొనసాగడం వల్ల మరో బ్యాంకులో అప్పు దొరకడం లేదు. భూమి లేక రెన్యూవల్‌‌ చేసుకోలేక వడ్డీలు కడుతూ అష్టకష్టాలు పడుతున్నాం. ప్రభుత్వం కటాఫ్‌‌ డేట్‌‌తో సంబంధం లేకుండా భూనిర్వాసితుల పేరిట ఉన్న లోన్లను మాఫీ చేయాలి.
-  శేరుపల్లి ఉపేందర్‌‌రెడ్డి, నిర్వాసితుడు, వేములఘట్

కొండపాక మండలం ఎర్రవల్లికి చెందిన రైతు మన్నెం లక్ష్మారెడ్డికి గ్రామంలో 3.18 ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది. ఈ భూమిపై 2016లో స్థానిక బ్యాంక్‌‌ నుంచి రూ. 50 వేల క్రాప్‌‌లోన్‌‌ తీసుకున్నాడు. మల్లన్నసాగర్‌‌ ప్రాజెక్ట్‌‌ కోసం లక్ష్మారెడ్డికి చెందిన భూమిని తీసుకున్న ప్రభుత్వం రుణాన్ని మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. పరిహారం డ్రా చేసుకునే టైంలో నిర్వాసితుల నుంచి క్రాప్‌‌లోన్లను రికవరీ చేయవద్దని బ్యాంకర్లను ఆదేశించడంతో లోన్‌‌ అలాగే ఉండిపోయింది. తర్వాత బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం రుణమాఫీ చేసినప్పటికీ లక్ష్మారెడ్డి లోన్‌‌ రూ. 50 వేలు దాటడంతో ఆయనకు మాఫీ కాలేదు. బ్యాంకు రికార్డుల ప్రకారం లక్ష్మారెడ్డి లోన్‌‌ రూ. 90 వేలకు చేరడంతో ఆయనకు ఇతర బ్యాంకులు సైతం లోన్‌‌ ఇవ్వడం లేదు. ఇది ఒక్క మన్నెం లక్ష్మారెడ్డి ఎదుర్కొంటున్న  పరిస్థితే కాదు.. మల్లన్న సాగర్‌‌లో భూములు కోల్పోయి క్రాప్‌‌ లోన్లు పెండింగ్‌‌లో ఉన్న వెయ్యి మంది పైచిలుకు రైతులు ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు.- 

మన్నెం లక్ష్మారెడ్డి