- అప్పట్లో సన్నిహితులకు కట్టబెట్టి.. ఇప్పుడు గగ్గోలు
- 2015లోనే తాడిచెర్ల బ్లాక్‌ను ప్రైవేట్
- కంపెనీకి ఇచ్చిన నాటి కేసీఆర్ సర్కారు
- సింగరేణిని కాదని ఆంధ్రా కంపెనీ ఏఎంఆర్‌కు 30 ఏండ్లపాటు లీజు
- అదే ఏడాది మినరల్స్ అండ్ మైన్స్చట్ట సవరణకు బీఆర్ఎస్ మద్దతు
- నాడు తెలంగాణలోని బొగ్గు బ్లాకులను కేంద్రం వేలం వేస్తే చోద్యం
- నిరుడు వేలంలో పాల్గొనొద్దని సింగరేణికి ఆర్డర్స్.. ఫలితంగా కోయగూడెం, సత్తుపల్లి గనులు రెండు ప్రైవేట్ కంపెనీలకు
హైదరాబాద్ / కోల్‌బెల్ట్, వెలుగు: బొగ్గు గనుల వేలం విషయంలో బీఆర్ఎస్ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2014లో అధికారంలోకి వచ్చీరాగానే 80 మిలియన్‌టన్నుల నిక్షేపాలున్న అతి పెద్ద తాడిచెర్ల బొగ్గు గనిని ఏఎంఆర్ అనే ఆంధ్రా కంపెనీకి 30 ఏండ్లపాటు లీజుకు ఇచ్చిన నాటి కేసీఆర్ సర్కారు.. సింగరేణి ఆయువుపట్టుమీద మొట్టమొదటి దెబ్బకొట్టింది.
అంతేకాదు 2015లో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన మినరల్స్ అండ్ మైన్స్ చట్ట సవరణకు పార్లమెంట్లో బీఆర్ఎస్ మద్దతిచ్చింది. నిరుడు రాష్ట్రంలోని కోయగూడెం, సత్తుపల్లి ఓసీపీలకు వేలం పెడ్తే సింగరేణిని నాటి బీఆర్ఎస్ సర్కార్ పాల్గొనకుండా చేయడంతో రెండు ప్రైవేట్కంపెనీలు వాటిని దక్కించుకున్నాయి. ఆ రెండు సంస్థలు కూడా బీఆర్ఎస్ పెద్దలకు కావాల్సినవాళ్లవేననే వార్తలు వస్తున్నాయి.
వాస్తవాలు ఇలా ఉండగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం.. కొత్తగా ఇప్పుడే బొగ్గు గనులను వేలం వేస్తున్నట్లు, అందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తున్నట్లు చేస్తున్న ట్వీట్లపై కార్మికులతో పాటుకార్మిక సంఘాల నేతలు మండిపడ్తున్నారు. బొగ్గు గనులపై బీఆర్ఎస్ది డబుల్ గేమ్ అని ఫైర్ అవుతున్నారు.
2015లోనే తాడిచర్ల గని ప్రైవేట్‌కు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథని డివిజన్ లో 1989-2000 మధ్య సింగరేణి, మినిరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్(ఎంఈసీఎల్) ఆరు చోట్ల బొగ్గు నిక్షేపాలు గుర్తించగా.. అందు లో తాడిచెర్ల ఓపెన్‌కాస్ట్ మైన్ ఒకటి. 2005లో నాటి కేంద్ర ప్రభుత్వం క్యాప్టివ్ మైన్ కింద తాడిచెర్ల గనిని జెన్కోకు కేటాయించింది. ఈ గనిలో బొగ్గు ఉత్పత్తి చేసి జెన్కోకు సప్లై చేయడానికి నాటి సీఎం వైఎస్ ఆర్..పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డికి చెందిన కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు.
వైఎస్ మరణానంతరం రోశయ్య సీఎం అయ్యాక కాంట్రాక్ట్ విషయం వెలుగుచూసింది. దీంతో 2011లో తాడిచర్లను ప్రైవేట్కంపెనీకి ఇవ్వడాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపట్టడంతో ఈ ఇష్యూ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దిగివచ్చిన నాటి సీఎం రోశయ్య తాడిచర్ల బొగ్గు బ్లాక్‌లో తవ్వకాల కాంట్రాక్ట్‌ను తిరిగి సింగరేణికే అప్పగించాలని నాటి సీఎండీ నర్సింగారావుకు లెటర్ రాశారు. అప్పటికే తెలంగాణ ఉద్యమం ఉధృతమైంది.
ఈ క్రమంలోనే 2014లో తెలంగాణ ఏర్పడడం, అప్పటికే సింగరేణిలో టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఉండడంతో టీఆర్ఎస్ ప్రభుత్వం చక్రం తిప్పింది. రోశయ్య సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా ఆంధ్రాకు చెందిన ఏఎంఆర్ కంపెనీకి 30 ఏండ్ల కాలపరిమితితో బొగ్గు తవ్వే కాంట్రాక్ట్‌ను అప్పగించింది. ఈ గనిని ప్రైవేట్‌కు లీజ్‌కు ఇవ్వడం వెనుక పెద్ద కుట్ర జరిగినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. మొదట్లో తాడిచర్ల మైన్‌లో కేవలం 47.93 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్లు చెప్పారు.
ఎక్కువ లోతులో తక్కువ బొగ్గు నిక్షేపాలున్నాయని, స్ట్రిపింగ్ రేషియా 1:8 గా ఉందని, లో గ్రేడ్ బొగ్గు అని, ఇక్కడ బొగ్గు వెలికితీస్తే సింగరేణి నష్టపోతుందని తప్పుడు రిపోర్టులు ఇచ్చారు. కానీ, ఆ తర్వాత గనిలో 80 మిలియన్ టన్నుల నిక్షేపాలున్నాయని, మంచి గ్రేడ్ బొగ్గు ఉందనే విషయాలు వెలుగుచూశాయి. కొందరు పెద్దల ఒత్తిళ్లతోనే ఆఫీసర్లు ఇలా తప్పుడు రిపోర్టులు ఇచ్చి తాడిచర్ల బ్లాక్‌ను ప్రైవేట్ పరం చేశారని అప్పట్లో కార్మిక సంఘాల నేతలు ఆరోపించినా ఎవరూ పట్టించుకోలేదు.
గతేడాదే రెండు గనులు ప్రైవేటుకు..!
కేంద్ర ప్రభుత్వం 2015లోనే గనులు, ఖనిజాల సవరణ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ఆ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. అదే సమయంలో ఆ బిల్లును తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక బీఆర్ఎస్ అధికారంలో ఉండగానే గతేడాది తొమ్మిది దఫాల్లో దేశవ్యాప్తంగా 101 బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం వేలం వేసింది. ఈ నెల 21న వేసిన వేలం పదో విడతది. 2021 నుంచి 2023 మధ్యకాలంలో తెలంగాణకు చెందిన కల్యాణిఖని, కోయగూడెం, సత్తుపల్లి బొగ్గు గనులను వేలం వేసింది.
వాటిని సింగరేణికే కేటాయించాలని కోల్బెల్ట్వ్యాప్తంగా కార్మిక సంఘాలు ఆందోళన చేయడంతో నాటి సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి మొక్కుబడిగా లేఖ రాసి వదిలేశారు. కానీ, కేసీఆర్లెటర్ను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం వేలం ప్రక్రియ కొనసాగించింది. నిజానికి వేలం పాటలో పాల్గొని ఆ మూడు గనులు దక్కించుకోవాలని సింగరేణి బోర్డు ఆఫ్ డైరెక్టర్ల మీటింగులో ఆఫీసర్లు నిర్ణయించారు. కానీ, నాటి కేసీఆర్ సర్కారు వద్దని వారించడంతో కోయగూడెం, సత్తుపల్లి గనులను నిరుడు వేలంలో రెండు ప్రైవేటు కంపెనీలు చేజిక్కించుకున్నాయి.
రెండు చోట్ల మైనింగ్‌కు బ్రేక్
కొత్తగూడెం జిల్లాలోని కోయగూడెం ఓసీపీ–3 ప్రాజెక్టుకు కేంద్రం వేలం వేయగా.. ‘ఆరో కోల్ ప్రైవేట్ లిమిడెట్’ అనే సంస్థ దక్కించుకుంది. ఈ మైన్‌లో 83 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉండగా, 29 ఏండ్లలో వెలికితీయాలని సింగరేణి భావించగా.. ఆ గనిని ప్రైవేట్ కంపెనీ దక్కించుకుంది. ఇదిలా ఉంటే, కోయగూడెం గనికి నిబంధనల ప్రకారం డబ్బు చెల్లించలేదని కంపెనీకి కేంద్ర ప్రభుత్వం రద్దు నోటీసులివ్వగా ఆ కంపెనీ కోర్టులో కేసు వేసింది. దానిపై విచారణ కొనసాగుతున్నది. మరోవైపు ఈ మైన్ ఉన్న ప్రాంతం 1/70 ఏజెన్సీ యాక్టు పరిధిలో ఉంది.
దీంతో ప్రైవేటు సంస్థలు బొగ్గును వెలికితీసే చాన్స్ లేదు. దీనిపై ఇప్పటికే గిరిజన సంఘాలు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు లేఖలు రాశాయి. ఇక ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి జేవీఆర్ ఓసీపీ–3 బొగ్గు బ్లాక్‌లో 76 మిలియన్ టన్నుల కోల్ నిక్షేపాలున్నాయి. పది నెలల కింద ‘అవంతిక కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థ సింగిల్ టెండర్ ద్వారా ఈ బ్లాక్‌ను దక్కించుకుంది. ఈ బొగ్గు బ్లాక్ చుట్టూ సింగరేణి గనులున్నాయి.
కంపెనీ బొగ్గు, మట్టి వెలికితీతకు అవసరమైన డంప్ యార్డులు, రహదారుల ఏర్పాటు సాధ్యం కావడం లేదు. దీంతో సదరు కంపెనీ తట్టెడు బొగ్గు కూడా ఎత్తిపోయలేదు. కారణాలు ఇలా ఉంటే బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం తమ వల్లే ప్రైవేట్కంపెనీలు బొగ్గు వెలికితీయలేకపోయాయని మాట్లాడడం విడ్డూరంగా ఉందని కార్మిక సంఘాల నేతలు అంటున్నారు.