- నల్గొండ, మునుగోడు, నకిరేకల్‌లో బీఆర్ఎస్కు భారీ షాక్
- పార్టీ పదవులకు గుడ్‌బై చెప్తున్న స్థానిక ప్రజాప్రతినిధులు
- మునుగోడు సెగ్మెంట్లో ముఖ్యనేతల మూకుమ్మడి రాజీనామా
నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ చేపట్టిన ఆపరేషన్ఆకర్ష్తో బీఆర్ఎస్ ఖాళీ అవుతోంది. నల్గొండ, మునుగోడు, నకిరేకల్ ని యోజకర్గాల్లో రూలింగ్పార్టీ ఎంపీపీ, జడ్పీటీసీలు, మండల అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్లు సహా అనేక మంది ముఖ్యనాయకులు పార్టీకి గుడ్‌బై చెపుతున్నారు. మూడు నియోజకవర్గాల్లో రెండు రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు. ఒక వైపు ఎన్నికల ప్రచారం చేస్తూనే మరోవైపు చేజారిపోతున్న లీడర్లను కాపాడుకునేందుకు కిందామీదా పడుతున్నారు.
పక్కావ్యూహంతో..
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. గత ఎన్నికల్లో కోల్పోయిన తమ స్థానాలను తిరిగి చేజిక్కించుకునేందుకు బ్రదర్స్ వ్యూహాత్మంగా పావులు కదుపుతున్నారు. గత ఎన్నికలకు భిన్నంగా ప్రత్యర్థుల ఎత్తులకు చిక్కకుండా సైలెంట్ఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన చేరికలను పరిశీలిస్తే బీఆర్ఎస్ అసమ్మతి నేతలు ఎప్పటి నుంచో బ్రదర్స్‌కు టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.
కాకపోతే అదును చూసి దెబ్బకొట్టాలనే వ్యూహాంతో ఎన్నికల సమయం వరకు ఓపికతో ఉన్నట్టు కనిపిస్తోంది. మూడు నియోజకవర్గాల్లో బ్రదర్స్ సపోర్ట్‌తో ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఎన్నికై బీఆర్ఎస్లో చేరిన స్థానిక ప్రజాప్రతినిధులు దాదాపు తిరిగి సొంతగూటికి చేరారు.
రామన్నపేట టు మునుగోడు...
నకిరేకల్సెగ్మెంట్పరిధిలోని రామన్నపేట మండలం నుంచి నల్గొండ మీదుగా మునుగోడు వరకు చేరికల పర్వం కొనసాగుతోంది. సోమవారం మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైఖరికి నిరసనగా చౌటుప్పల్ మున్సి పల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, నాంపల్లి జడ్పీటీసీ ఏలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి, మునుగోడు జడ్పీటీసీ నారబోయిన స్వరూప రవి, మునుగోడు, నాంపల్లి వైఎస్ ఎంపీపీలు అనంత వీణా లింగస్వామిగౌడ్, పానుగంటి రజని వెంక న్నగౌడ్ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు.
వీరంతా త్వరలో రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఆదివారం నారాయాణ పూరం ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్‌చందర్‌రెడ్డి రిజైన్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మునుగోడు నియోజకవర్గంలో బీఆర్ఎస్ దాదాపు ఖాళీ అయినట్టే. ఇక రామన్నపేట జడ్పీటీసీ పున్నా లక్ష్మీ జగన్మోహన్, పార్టీ మండల అధ్య క్షుడు మందడి ఉదయ్ రెడ్డి, నార్మాక్స్ డైరెక్టర్ మందడి రవీందర్ రెడ్డి, నా ర్కట్‌పల్లి సర్పంచ్ దూదిమెట్ల స్రవంతి, మాజీ ఎంపీపీ మందడి రవీందర్ రెడ్డి.. రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం నేతృత్వంలో కాంగ్రెస్‌లో చేరారు.
ఆదివారం చిట్యాల మున్సిపల్‌చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకటరెడ్డి ఎంపీ కోమటిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. నల్గొండలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్యనాయకులు, కార్యకర్తలు పార్టీకి రిజైన్ చేశారు. త్వరలో బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్‌తో సహా, కనగల్ మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలిసింది.
మంత్రి జగదీశ్ రెడ్డి టార్గెట్..
సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డిని దెబ్బతీసేందుకు బ్రదర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నార్కట్‌పల్లి మండలం బ్రహ్మణ వెల్లంల ప్రాజె క్టు నిర్మాణాన్ని అడ్డుకున్న మంత్రిని ఈ ఎన్నికల్లో ఓడించి మూడోస్థానానికి పంపిస్తామని ఆదివారం రాత్రి నల్గొండలో ఎంపీ కోమటిరెడ్డి కామెంట్ చేశారు. సైకిల్ మీద తిరిగిన జగదీశ్ రెడ్డికి 5వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. మంత్రిని ఓడించేందుకు తానే సూర్యాపేట ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానన్నారు.
సోమవారం నకిరేకల్‌లో పర్యటించిన రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నకిరేకల్‌లో ఒక దొంగ పులి పోయిందని, నిజమైన పులి వచ్చిందని ఎమ్మెల్యేపై ఫైర్ అయ్యారు. నమ్మకద్రోహం చేసిన లింగయ్య గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ను మోసం చేసి వెళ్లిపోయిన రోజే బొంద తీసుకున్నావని విమర్శించారు. ఒక్క రామన్నపేట మండలంలోనే కాంగ్రెస్‌కు 10 వేల మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.