ఆదిలాబాద్: కాంగ్రెస్ కంటే పెద్ద మోసగాళ్ళు బీజేపీ వాళ్ళని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఆదిలాబాద్ రైతు పోరుబాటలో కేటీఆర్ మాట్లాడుతూ.. గుజరాత్కో నీతి, తెలంగాణకో నీతా అని నిలదీశారు. పత్తి ధర గుజరాత్ కంటే ఇక్కడ ఎందుకు తక్కువ ఇస్తారని ప్రశ్నించారు. పత్తి క్వింటాల్కు రూ.8800లు గుజరాత్ తరహాలో ఇక్కడి రైతులకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ తోడు దొంగలు అని, పైన తిడుతారని.. ఇక్కడ దోస్తాన్ చేస్తారని కేటీఆర్ విమర్శించారు. అక్కడి రాహుల్ గాంధీ ఓ మాట, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఓ మాట మాట్లాడతారని చెప్పుకొచ్చారు.
ఆదానీ కన్ను దేవాపూర్ సిమెంట్ పరిశ్రమ మీద పడ్డదని, సింగరేణి బొగ్గు గనులును కూడా ఖతం పట్టిస్తారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో పనులు ఆగిపోయాయని, కాంగ్రెస్ పాలనలో పోలీసుల భార్యలు రోడ్డు ఎక్కారని చెప్పారు. వంద రోజుల్లో అన్నీ ఇస్తామని చెప్పిన లుచ్చాలను జైల్లో పెట్టాలని కేటీఆర్ మండిపడ్డారు. రైతుల మీద, పేదల మీద కేసు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ALSO READ | పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి
మహారాష్ట్రలో ఎన్నికలు ఉన్నాయని, కాంగ్రెస్ మోసాలను అక్కడి ప్రజలకు చెప్పండని ఆదిలాబాద్ రైతులకు కేటీఆర్ సూచించారు. పోరాటం ఆగిపోదని, ఆదిలాబాద్లో అగ్గి అంటుకుందని మాజీ మంత్రి కేటీఆర్ నినదించారు. ముఖ్రా రైతులు రాహుల్ గాంధీకి లెటర్ పెట్టారని, రైతు రుణ మాఫీ, భరోసా ఏదీ అని లెటర్ పెట్టారని, పోస్ట్ కార్డు ఉద్యమం చేశారని చెప్పారు. దిష్టి బొమ్మ కాలబెడితే రైతుల మీద కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం ఎలా చేశామో అలా మీ కోసం పోరాటం చేస్తామని రైతులకు మాజీ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. రుణ మాఫీ జరిగే వరకూ పోరాటం అపబోమని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం సాగిస్తామని ఆదిలాబాద్ రైతు పోరుబాటలో మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు.