- ఎన్నికల వేళ బీఆర్ఎస్ లో హైటెన్షన్
- పోలింగ్ కు ముందే పార్టీ వీడే యోచనలో మరికొందరు లీడర్లు
- గులాబీలో కనిపించని అసెంబ్లీ ఎన్నికల నాటి జోష్
- కరీంనగర్ లో వినోద్ కుమార్ కు ఎదురుగాలి
- బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారుతున్న ఎన్నికల పోరు
కరీంనగర్, వెలుగు: లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు ఊహించని షాక్‌లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కార్పొరేటర్లు, కీలకమైన లీడర్ల కబ్జా బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూడడం, వారిలో కొందరు జైలుకు వెళ్లడంతో ఆ పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. రోజూ ఎన్నికల ప్రచారంలో వెంట తిరుగుతున్న లీడర్లే.. మరుసటి రోజే కండువా మార్చేస్తుండడం ఆ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ ను డిప్రెషన్ లోకి నెడుతోంది.
మరో 9 నెలల్లో కార్పొరేషన్ ఎన్నికలు ఉండడంతో కాంగ్రెస్ నుంచి బరిలో దిగాలనే ఆలోచనతో లీడర్లు పార్టీ వీడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అంతేగాక రాష్ట్రంలో ఇప్పటికే వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లను తమ ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ పార్టీ.. కరీంనగర్ పైనా జెండా ఎగరవేసేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 11మంది బీఆర్ఎస్ ను వీడగా.. మరో 15 మంది క్యూ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఆనాటి హడావుడి లేదు..
కరీంనగర్ లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల నాటి హడావుడి కనిపించడం లేదు. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీలు నిర్వహించడం సర్వసాధారణం. కరీంనగర్ లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు తమ నామినేషన్ల సందర్భంగా భారీ ర్యాలీలు నిర్వహించగా వినోద్ కుమార్ మాత్రం ఎలాంటి ర్యాలీ చేపట్టలేదు.
నామినేషన్ తర్వాత భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించలేదు. దీంతో సొంత పార్టీ క్యాడర్ లోనే రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యేలు కూడా లోక్ సభ స్థానం పరిధిలో పెద్దగా ప్రచారం నిర్వహించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ తమ నియోజకవర్గానికి వస్తే తప్పా ఆయా లీడర్లు ప్రచారానికి వెళ్లడం లేదనే విమర్శ ఉంది. బీఆర్ఎస్ ఎన్నికల నియోజకవర్గ ఇన్ చార్జిలు, హోటల్ రూమ్ లకే పరిమితమవుతున్నారనే చర్చ నడుస్తోంది.
నైరాశ్యంలో వినోద్ కుమార్
బీఆర్ఎస్ గ్రాఫ్ రోజురోజుకు పడిపోవడంతో కరీంనగర్ లో త్రిముఖ పోటీ కాస్తా ద్విముఖ పోటీగా మారుతుందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. ఎన్నికల పోరు క్రమంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారుతుండడం బీఆర్ఎస్ శ్రేణులకు రుచించడం లేదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర అవకాశాల కోసం ఇప్పటికే గ్రామస్థాయిలో చాలా మంది బీఆర్ఎస్ లోకల్ లీడర్లు కాంగ్రెస్ లో చేరుతున్నారు. కరీంనగర్ సిటీలోనూ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరడం వినోద్ ను నైరాశ్యంలోకి నెట్టేసింది. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు వెళ్లిపోవడం తన బాధించిందని, ఈ టైంలో ఇలా చేయడం భావ్యం కాదని బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేయడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.