
గడిచిన ఎన్నికల్లో ఓటమిపాలైన భారత రాష్ట్ర సమితి, తన ఓటమికి ప్రధాన కారణాలను వెతుక్కోవడంలో ఇప్పటికీ విఫలం అవుతోంది. అధికారం ఉన్నప్పుడు అవలంబించిన తప్పుడు ఎత్తుగడలనే ఇప్పటికీ ఆచరించడం ఆ పార్టీకి సంబంధించినంతవరకు భావదారిద్య్రమే. రాజకీయాలను తారుమారు చేయడం ద్వారా తాను బలపడవచ్చు అన్న పాత వ్యూహాలనే కేసీఆర్ ఇంకా నమ్ముకోవడం దురదృష్టకరం. ఆర్కుట్ కాలం నాటి ఎత్తుగడలను ఇన్స్టాగ్రామ్ కాలంలో ఉపయోగించడం ఆయనకు వరుస అప జయాలను తెచ్చిపెడుతోంది.
ఎన్నికలంటేనే ఒక యుద్ధంలా తీసుకునే కేసీఆర్‌కు మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం పోటీ చేసే పరిస్థితి లేదంటే.. భారత రాష్ట్ర సమితి పతారా తెలంగాణ ప్రజల్లో ఏ మేరకు పడిపోయిందో అంచనా వేసుకోగలగాలి. ఘోర ఓటమికంటే పలాయనం చిత్తగించడమే ఉత్తమమైన మార్గమని గ్రహించాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటి నుంచి కుయుక్తులకు ప్రాధాన్యమిస్తున్నారు తప్ప, ప్రజల్లోకి వెళ్లడం లేదు సరికదా, ఓడించిన ప్రజలనే నిందించడం ఇప్పటికీ మానుకోలేదు.
భా రతదేశంలోనే బాధ్యతలేని ప్రతిపక్షంగా భారత రాష్ట్ర సమితి రికార్డు సృష్టించింది. అనేక మౌలికమైన అంశాలను చట్టసభల్లో వినిపించడం ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేయాల్సిన ప్రధాన ప్రతిపక్షం ఇలా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం చూస్తే అహం తగ్గలేదని తెలుస్తోంది. ఈ ఘనత దేశ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితికి మాత్రమే దక్కుతుంది.
సోషల్ మీడియా ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తప్పుడు ప్రచారాలు, ట్రోలింగులు చేయిస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలను కులాలుగా, మతాలుగా వివిధ వర్గాలుగా విభజించి పాలించడం అనేది తెలంగాణ దొరల సంస్కృతిలో అంతర్భాగం. అధికారం ఉన్నా.. అధికారం లేకున్నా అదే ఫార్ములాను ప్రజలపై పదేపదే ప్రయోగిస్తూ రాక్షసానందాన్ని పొందడం కేసీఆర్ కుటుంబానికే చెల్లుతుంది.
సోషల్ మీడియాలో అబద్ధాల ప్రచారం
అద్దె మైకులతో, రాజకీయ విశ్లేషకుల పేరుతో ఉద్దెర మాటలను ప్రచారంలో పెడుతూ కాలం వెళ్లదీయడం వారి దయనీయ పరిస్థితికి అద్దంపడుతోంది . టీవీ విశ్లేషణల పేరుతో ప్రచార మాధ్యమాల ద్వారా, వాట్సాప్, యూట్యూబ్‌లలో అబద్ధాలను ప్రచారం చేయించడంలో అందెవేసిన చేయి అని నిరూపించుకుంటున్నారు. ఒక అబద్ధాన్ని పదేపదే ప్రచారంలో పెట్టడం ద్వారా దాన్ని నిజమని నమ్మే పరిస్థితి ఉంటుందన్న గోబెల్స్ థియరీని తెలంగాణ ప్రజలపై ప్రయోగిస్తున్నారు. కేసీఆర్ 10 ఏళ్ల అసమర్థ పాలనలో పదవులతో ఊరేగిన మేధావి ముసుగుదారులు మళ్లీ ప్రజల వైపు ఉన్నట్టుగా ఉద్దెర మాటలతో ఊరేగుతున్నారు .
కేసీఆర్ మొసలి కన్నీరు
తాము అధికారంలో ఉన్నంత కాలం బీసీలను ఏమాత్రం పట్టించుకోని కేసీఆర్ ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడం విడ్డూరం. కేసీఆర్‌ను నమ్మిన దేశిని చిన్న మల్లయ్య గౌడ్, ఆలే నరేంద్ర, విజయశాంతి, రాములు గౌడ్, చెరుకు సుధాకర్ లాంటివారిని రాజకీయంగా ఎంతటి పతనావస్థకు దిగజార్చాడో చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖితమై ఉంది.
బీసీ ఉద్యమాన్ని, మాదిగ ఉద్యమాన్ని చీల్చి బలహీన వర్గాల ఉద్యమాలకు తీవ్రద్రోహం జేసిన కేసీఆర్‌ను మించిన సామాజిక విధ్వంసకారుడు లేడు అంటే అతిశయోక్తి కాదేమో! బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు బలిపెట్టిన ఘనుడు కేసీఆర్. బీసీ, ఎంబీసీల పేరుతో ఎవరు బీసీ? ఎవరు ఎంబీసీ? అన్న వివరణ లేకుండా డి.ఎన్.టీల అస్తిత్వాన్ని ధ్వంసం చేసిన అభినవ మనువు కేసీఆర్.
ఇప్పుడు అణగారిన కులాల గురించి ఆయన మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించడమే. కొందరిని కొంతకాలం మోసం చేయవచ్చు. అందరనీ ఎంతోకాలం మోసం చేయలేమన్న చారిత్రక సత్యాన్ని 80 వేల పుస్తకాలు చదివిన పెద్దమనిషి ఏ పేజీలోనూచదవకపోవడం దురదృష్టకరం.
- దొమ్మాట వెంకటేశ్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్-