నాగార్జునసాగర్  నియోజకవర్గంలో కారు ఖాళీ 

  •     బీఆర్ఎస్ కు పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు, నాయకులు మూకుమ్మడి రాజీనామా
  •     త్వరలోనే కాంగ్రెస్​లో చేరుతామని ప్రకటన 

హాలియా, వెలుగు : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్​ఖాళీ అవుతోంది. ఒక్కొక్కరూ  కారు దిగుతూ హస్తం పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ మాజీ సభ్యులు, మున్సిపాలిటీ చైర్​పర్సన్, బీఆర్​ఎస్​ మండల అధ్యక్షులు, ముఖ్యనాయకులు వారి పదవులతోపాటు బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

శుక్రవారం నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీలోని రెడ్డి సంక్షేమ సంఘం ఫంక్షన్ హాల్ లో ఆయా మండలాలకు చెందిన ముఖ్యనాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నల్గొండ జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, పెద్దవూర జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, గుర్రంపూడ్ ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు, పెద్దవూర వైస్​ఎంపీపీ గోన వివేక్​రావు, ఎంపీటీసీ రమావత్​శ్రీరాములు, నిడమనూరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి, త్రిపురారం మండల అధ్యక్షుడు బి.నరేందర్, సాగర్ మున్సిపాలిటీ మాజీ చైర్ పర్సన్ కర్ణ అనూషాశరత్ రెడ్డి, వైస్ చైర్మన్ మంద రఘువీర్ బిన్నీ, నాయకులు కర్ణ బ్రహ్మానందరెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ బత్తుల సతీశ్​తోపాటు సుమారు 2 వేల మంది బీఆర్ఎస్​కు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ చేరబోతున్నట్టు ప్రకటించారు. త్వరలో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరుతామని తెలిపారు.