కర్నాటకలో మా పథకాలు అమలు కాకుంటే.. తెలంగాణలో ఓట్లు అడగం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  •    సీఎం కేసీఆర్​ వస్తే హెలికాప్టర్​లో తీసుకెళ్లి చూపిస్తం 
  •     కాంగ్రెస్​ స్టార్​ క్యాంపెయినర్​ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  •     అక్కడ తమ ప్రభుత్వం హామీలు నెరవేర్చడం లేదని కన్నడిగులు చెప్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్

నల్గొండ అర్బన్, వెలుగు : కర్నాటకలో కాంగ్రెస్  పార్టీ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని బీఆర్ఎస్  నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని, వారు చేస్తున్న ఆరోపణలు నిజమైతే రాష్ట్రంలో ఓట్లు అడగబోమని కాంగ్రెస్  స్టార్  క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తమపై అసత్య ఆరోపణలు చేసిన సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీశ్  వస్తామంటే తామే వారిని కర్నాటకకు హెలికాప్టర్​లో తీసుకెళ్లి, అక్కడ తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చూపుతామని చెప్పారు. 

ఆ రాష్ట్రంలో తమ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని అక్కడి ప్రజలు చెబితే తాను రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్​ విసిరారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని శివాజీ నగర్ లో ఆయన ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. కాంగ్రెస్  ఆరు గ్యారంటీ స్కీముల కరపత్రాలను పంపిణీ చేసి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో నల్గొండ కాంగ్రెస్  అభ్యర్థిగా పోటీచేస్తున్న తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. సీఎం కేసీఆర్  నియంతలా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నల్గొండను దత్తత తీసుకుంటానని చెప్పి ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. 

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్  పార్టీ అధికారంలోకి రావాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడం పూర్తిగా ప్రభుత్వ లోపమేనని విమర్శించారు. ఉద్యోగాలను భర్తీ చేయడంలో కేసీఆర్  సర్కారు పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. ‘‘టీఎస్ పీఎస్సీ ఎగ్జామ్  పేపర్లు లీక్  కావడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. ఇంటర్​ మూల్యాంకనం చేయడంలోనూ ప్రభుత్వం విఫలం కావడంతో 36 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. డబుల్  బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పి నిరుపేదలను బీఆర్ఎస్  నేతలు మోసం చేశారు. 

కాంగ్రెస్  అధికారంలోకి వచ్చిన 100 రోజులలోనే ఆరు గ్యారంటీ స్కీంలను కచ్చితంగా అమలు చేస్తం” అని కోమటిరెడ్డి పేర్కొన్నారు.తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సీఎం కావచ్చని, దీనిపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు.