మల్యాల, వెలుగు: బీజేపీకి ఎంపీటీసీ ఫొటో ఎడిటింగ్ చేసి బీఆర్ఎస్ నాయకునిగా మార్చి ప్రభుత్వ ప్రోగ్రాంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో వాటిని చింపివేసిన సంఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి... మల్యాల మండలం బల్వంతాపూర్ గ్రామంలో సీసీ రోడ్డు ప్రారంభోత్సవానికి శుక్రవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్లీడర్లు గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో బీజేపీ ఎంపీటీసీ సంగడి రవి ఫొటోను ఎడిటింగ్చేసి బీఆర్ఎస్ కండువాతో ముద్రించారు. ఆగ్రహించిన ఎంపీటీసీ రవి ఎమ్మెల్యే రాక ముందే ఫ్లెక్సీల నుంచి తన ఫొటో తీసివేయాలని బీఆర్ఎస్ నాయకులకు, ఎస్ఐ అశోక్ కు సమాచారం ఇచ్చాడు.
ప్రోగ్రాం ప్రారంభమైనా ఫ్లెక్సీలు అలాగే ఉండటంతో ఎంపీటీసీ వాటిని చింపివేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ ఫ్లెక్సీలు తొలగించాలని ఎస్సైకు సమాచారం ఇచ్చానని అయినా చర్యలు తీసుకోకపోవడంతోనే తానే ఫ్లెక్సీలు చింపివేశానని తెలిపాడు. తనను వ్యక్తిగతంగా ఇబ్బందులకు గురిచేయడానికి బీఆర్ఎస్ లీడర్లు ప్రయత్నిస్తున్నారని, మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
స్వరాష్ట్రంలోనే రోడ్లకు మహర్దశ
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలంగాణ ఏర్పడిన తర్వాతనే రోడ్లకు మహర్దశ వచ్చిందని ఎమ్మెల్యే రవిశంకర్ అన్నారు . శుక్రవారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పూడూరు నుంచి నర్సింహులపల్లి వరకు పంచాయతీరాజ్ రోడ్డుకు రూ.2.19కోట్లతో రిపేర్, చెప్యాల, కొడిమ్యాల గ్రామాల్లో పల్లె దవాఖానాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ స్వర్ణలత, జడ్పీటీసీ ప్రశాంతి, సర్పంచ్ మమత, ప్యాక్స్ చైర్మన్లు మేనేని రాజనర్సింగారావు, బండ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.