
- అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన చోట కృతజ్ఞత సభలు
- క్యాడర్‌కు మాజీ మంత్రి హరీశ్ రావు దిశానిర్దేశం
- అసంతృప్తి దూరం చేసేందుకు ప్రయత్నం
మెదక్/సిద్దిపేట/సంగారెడ్డి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు ముగియగా... రానున్న పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు వచ్చి రాష్ట్రంలో అధికారం కోల్పోగా, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపొంది పరువు నిలుపుకోవాలని ఆశిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టినప్పటికీ.. మెదక్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని మెజారిటీ అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందటం ఆ పార్టీకి కొంత ఊరటనిచ్చింది.
రానున్న లోకసభ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బరిలో నిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటినుంచే పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడంపై ఆ పార్టీ హైకమాండ్ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో కృతజ్ఞత సభల పేరుతో నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతలు మీటింగ్ లు పెడుతున్నారు. వీటికి మాజీ మంత్రి హరీశ్ రావు హాజరై వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.
ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2014లో జరిగిన లోక్‌సభ జనరల్ ఎలక్షన్స్, అదే ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన లోక్ సభ బైఎలక్షన్, ఆ తర్వాత 2019లో జరిగిన జనరల్ ఎలక్షన్లలో మెదక్ లోక్‌సభ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో 6 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందారు. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా, ఒక్క మెదక్ అసెంబ్లీ స్థానంలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు.
క్యాడర్ కు బూస్టింగ్ ఇచ్చేందుకు...
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలోని మెజారిటీ అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందినప్పటికీ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో వారిలో ధైర్యాన్ని నింపి రానున్న పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయడంపై మాజీ మంత్రి హరీశ్ రావు దృష్టి సారించారు. ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించిన చోట కృతజ్ఞత సభలు నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి, నర్సాపూర్‌లో సభలు పూర్తికాగా, సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గంలో, సిద్దిపేట జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సైతం కృతజ్ఞత సభల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఇక్కడ సభలు ఉండే అవకాశం ఉంది. నారాజ్‌లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు దిగులు చెందొద్దని హరీశ్ రావు ధైర్యం చెప్తున్నారు. 'అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమే, పరీక్షలో విద్యార్థి ఫెయిల్ అయినట్లే మొన్నటి ఎన్నికల్లో మనము ఫెయిలయ్యాం, అధైర్య పడొద్దు భవిష్యత్తు మనదే' అని చెబుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో కేవలం రెండు శాతం ఓట్ల తేడాతోనే మనం ఓడిపోయాం, లోటు పాట్లను సరిదిద్దుకుని రానున్న ఎన్నికలకు సిద్ధం కావాలని క్యాడర్ కు హరీశ్‌రావు దిశానిర్దేశం చేస్తున్నారు.