- మెదక్ పార్లమెంట్ స్థానంలో డబుల్ హ్యాట్రిక్‌పై బీఆర్ఎస్ ఫోకస్
- చెదరని ఓటు బ్యాంకుపై కారు పార్టీ ధీమా
- అధికారం కోల్పోవడం, క్యాడర్ చెదరడం మైనస్
- బలమైన క్యాండిడేట్లను బరిలో దింపే ఆలోచనలో కాంగ్రెస్, బీజేపీ
మెదక్, వెలుగు: 2004 నుంచి ఐదు వరుస విజయాలతో బీఆర్ఎస్కంచుకోటలా మారిన మెదక్ పార్లమెంట్ సీటుపై ఈసారి కాంగ్రెస్, బీజేపీ కన్నేశాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు సెంగ్మెంట్లకుగాను ఆరుచోట్ల గెలిచిన బీఆర్ఎస్ ఈసారి కూడా ఈ సీటును తన ఖాతాలో వేసుకునే ప్రయత్నాల్లో ఉంది. అదే సమయంలో కారు పార్టీకి గుండెకాయలాంటి ఈ సెగ్మెంట్లో ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్, బీజేపీ ఉవ్విళ్లూరుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తాము 4 లక్షలకు పైగా ఓట్లు సాధించడంతో పాటు రాష్ట్రంలో అధికారంలోకి రావడం కలిసివస్తుందని కాంగ్రెస్ నేతలు ధీమాతో ఉన్నారు. బలమైన క్యాండిడేట్, మోదీ చరిష్మా, రామాలయ నిర్మాణం తమకు కలిసివస్తాయని బీజేపీ నేతలు నమ్మకంతో ఉన్నారు. ఈ మూడు ప్రధాన పార్టీలు బరిలో నిలపబోయే అభ్యర్థులే ఆయా పార్టీల గెలుపోటములను నిర్ణయిస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్తున్నారు.
కేసీఆర్ ఫ్యామిలీ నుంచా? బయటి నుంచా?
మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, సిద్దిపేట సెగ్మెంట్లతో కూడిన మెదక్ లోక్‌సభ సీటుపై అందరి దృష్టి నెలకొంది. 2004 నుంచి 2019 వరకు జరిగిన ఐదు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే ఎంపీలుగా గెలిచారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా కాంగ్రెస్ హవా వీస్తే ఈ సెగ్మెంట్ పరిధిలో మాత్రం బీఆర్ఎస్ పైచేయి సాధించింది. ఏడింట ఆరు సెగ్మెంట్లలో విజయం సాధించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ కన్నా 2.40 లక్షల ఓట్ల ఆధిక్యత చాటింది.
ఈ ఓట్లే పార్లమెంట్ ఎన్నికల్లో తమకు కలిసి వస్తాయని బీఆర్ఎస్ నమ్ముతోంది. కానీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో క్యాడర్ చేజారుతుండడం, కాంగ్రెస్, బీజేపీ నుంచి బలమైన అభ్యర్థులను బరిలో దింపే అవకాశం ఉండడంతో కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు పోటీలో నిలబడితే తప్ప గెలిచే పరిస్థితి కనిపించడం లేదు. ఓటమి తర్వాత ఇప్పటివరకు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లని కేసీఆర్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఈ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. మెదక్ సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో మాజీ ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, పద్మా దేవేందర్‌రెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డి, గాలి అనిల్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ తదితరులు కూడా టికెట్ ఆశిస్తున్నారు. కానీ, హైకమాండ్ మాత్రం ఎమ్మెల్సీ వెంకట్రామ్రెడ్డి, కవిత పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలిసింది.
చేరికలపై కాంగ్రెస్ ఫోకస్
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. ఫుల్‌జోష్‌లో ఉంది. బీఆర్ఎస్కు కీలకమైన మెదక్ సీటును గెలుచుకోవడం ద్వారా ఆ పార్టీని చావుదెబ్బతీయాలని చూస్తోంది. నియోజకవర్గంపై పట్టుపెంచుకోవడంలో భాగంగా గజ్వేల్, దుబ్బాక, మెదక్, పటాన్చెరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నుంచి చేరికలపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పెద్దసంఖ్యలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, లీడర్లు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరికొందరు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓవరాల్‌గా 30 శాతానికి పైగా ఓట్‌షేర్ సాధించడం, ఆ పార్టీ అధికారంలో ఉండడంతో పార్టీ టికెట్ కోసం చాలా మంది ప్రయత్నిస్తున్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి, మద్దుల సోమేశ్వర్‌రెడ్డి, చెరుకు శ్రీనివాస్ రెడ్డి తదితరులు 11 మంది దరఖాస్తు చేసుకోగా, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నీలం మధు ముదిరాజ్ సైతం కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మైనంపల్లి హన్మంతరావు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ బీఆర్ఎస్ నుంచి చేరికలను స్పీడప్ చేశారు. టికెట్‌పై హామీ ఉన్నందునే ఆయన నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారనే టాక్ నడుస్తోంది.
Also Read: మూసీ నిరాశ్రయులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు
మోదీ చరిష్మాపైనే బీజేపీ ఆశలు..
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓవరాల్‌గా 2 లక్షలకు పైగా ఓట్లు సాధించిన బీజేపీ మెదక్ sssలోక్‌సభ స్థానంపై కన్నేసింది. మోదీ చరిష్మా, అయోధ్య రామాలయ నిర్మాణం కలిసి వస్తాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈక్రమంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మీటింగులు పెట్టి క్యాడర్‌ను ఎన్నికలకు సమాయాత్తం చేస్తోంది. మరోవైపు విజయ్ సంకల్ప్ యాత్ర పేరుతో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ముఖ్య లీడర్లు పర్యటిస్తూ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. బీజేపీ టికెట్ రేసులో దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీచేసి ఓడిన ఆకుల రాజయ్య, సిద్దిపేటకు చెందిన దారం గురువారెడ్డి ఉన్నారు. హైకమాండ్ సర్వేలు నిర్వహించి, క్యాడర్ అభిప్రాయాలు సేకరించాకే అభ్యర్థిని ఎంపిక చేయనున్నట్టు తెలిసింది. ప్రస్తుతానికి రఘునందన్‌రావుకే టికెట్ వచ్చే అవకాశాలు కనిపిస్తుండడంతో ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తూ, క్యాడర్‌ను సమాయత్తం చేస్తున్నారు.