వీఆర్ఎస్ కోసమే బీఆర్ఎస్?

సీఎం పదవి తన ఎడమకాలి చెప్పుతో సమానమని వ్యాఖ్యానించి, ప్రజల అభిప్రాయాన్ని అపహాస్యం చేసిన  కేసీఆర్ కు సీఎం పదవిపై మోజు తగ్గిందో ఏమోకానీ ఇప్పుడు దేశ్ కీ నేతగా పేరొందాలని ఆరాటపడుతున్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేశానని, ఇప్పుడు మార్చాల్సింది దేశాన్ని అంటూ బీఆర్ఎస్ పేరిట జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు ప్రజా ధనాన్ని దుబారా చేస్తున్నారు. రాష్ట్రం ఒకవైపు అప్పుల్లో కూరుకుపోతుండగా.. మరోవైపు వందల కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి దేశ వ్యాప్తంగా అన్ని భాషల పత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో ‘కేసీఆర్​ దేశ్ కీ నేత’ అంటూ ప్రకటనలు ఇప్పించుకున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం సహా.. రాష్ట్రంలో పాలన సరిగా లేక టీఆర్ఎస్​ ప్రభుత్వానికి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇదే విషయం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సర్వే రిపోర్టుల్లో బయటపడింది. గతంలో 30 మంది ఎమ్మెల్యేలపై భారీగా వ్యతిరేకత ఉందని తేల్చిన పీకే టీం..  తాజా సర్వేలో ఆ సంఖ్య 40కి చేరినట్లు చెప్పింది. ఇది టీఆర్ఎస్ పతనానికి సంకేతం. నిజానికి, కేసీఆర్ తనకో రాజకీయ వ్యూహకర్త కావాలనుకున్నప్పుడే ఆయన చరిష్మా తెలంగాణలో పని చేయడం లేదని పరోక్షంగా అంగీకరించినట్లు అయింది. 

కొడుకును సీఎం చేసేందుకేనా?

కేటీఆర్... తనే సీఎం అన్నట్టుగా ఊహించుకుంటున్నారు. నిజానికి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటే తండ్రి స్థానంలో కేటీఆరే ఆయా శాఖలను మానిటరింగ్ చేస్తుండటం తెలిసిందే. గతంలో  కేసీఆర్ లేకుండానే కొంతమంది మంత్రులను ప్రగతి భవన్ కు రప్పించుకొని సమావేశం నిర్వహించారు. కేటీఆర్​తనను తాను యాక్టింగ్ సీఎంగా ప్రమోట్ చేసుకుంటున్నారు. తనకు ముఖ్యమంత్రి బాధ్యతలను కట్టబెట్టాలని ఎప్పటి నుంచో కేటీఆర్ ఒత్తిడి తెస్తున్నారని, ఇందులో భాగంగా ఆయన వర్గం నేతలు ‘భవిష్యత్ తెలంగాణ కేటీఆర్’, ‘కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్’ అనే నినాదాలు ఇస్తున్నారని టీఆర్ఎస్ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. సచివాలయమే అవసరం లేదని మాట్లాడిన కేసీఆర్.. కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం వాస్తు దోషాలు లేకుండా కొత్త సెక్రటేరియట్ నిర్మాణం చేయిస్తున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే కేసీఆర్ బీఆర్ఎస్ పేరిట వీఆర్ఎస్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారని స్పష్టమైంది.
బీఆర్ఎస్​ మరో ఫెడరల్​ ఫ్రంటేనా?
గతంలో కేసీఆర్ విఫల రాజకీయ ప్రయత్నానికి కొనసాగింపే ఈ బీఆర్ఎస్. గతంలో ఫెడరల్ ఫ్రంట్ అంటూ 2018లో శాసన సభ ఎన్నికలు ముగిసిన వెంటనే వెస్ట్ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లి మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ తో మంతనాలు జరిపారు. హైదరాబాద్ నుంచి వచ్చిండని ఆ నేతలు కేసీఆర్ కు అతిథి మర్యాదలు చేసి పంపించారు. కానీ ఆ తరువాత తాను ప్రకటించిన ఫెడరల్ ఫ్రంట్ ఊసే లేకుండా పోయింది. ఇక మోడీ పని అయిపోయిందని గంభీరమైన ప్రకటనలు చేసి... కేంద్రంలో టీఆర్ఎస్ చక్రం తిప్పబోతుందని ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నించిన కేసీఆర్ కు తెలంగాణ సమాజం కర్రు కాల్చి వాత పెట్టింది పార్లమెంట్ ఎన్నికల్లో. ‘కారు -సారూ  పదహారు’ నినాదంతో ఎన్నికల కదనరంగంలోకి దూకిన టీఆర్ఎస్ ను ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించి బీజేపీకి 4 పార్లమెంట్ స్థానాలు ఇచ్చారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలు, హైదరాబాద్, వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బలు తగిలాయి. 

దర్యాప్తు సంస్థల భయం..

గతంలో చంద్రబాబు కూడా ఎన్డీయే కూటమికి ఎదురెళ్లి ఎదో చేయాలని ఎలా చావుదెబ్బ తిన్నారో దేశమంతా చూసింది. ఇప్పుడు కేసీఆర్ కూడా గురువు బాటలోనే నడుస్తున్నట్టుగా.. అలాంటి ఫలితాన్ని అనుభవించేలా ఉన్నారు. కానీ ఏ పనినైనా ఘనంగా మొదలు పెట్టి మధ్యలో ఆపడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. ఆఖరికి తెలంగాణ ఉద్యమంలో ఆమరణ నిరాహార దీక్షను కూడా ఆయన మధ్యలోనే వదిలేశారు. ఇప్పుడు కూడా ఫెడరల్ ఫ్రంట్ పేరు మార్చుకొని బీఆర్ఎస్ గా ముందుకు వస్తున్నప్పటికీ కేసీఆర్ ను ఎవరూ నమ్మేలా లేరు. ప్రజల దృష్టిని తనవైపు తిప్పుకునేందుకే ఆయన బీఆర్ఎస్​అనే కొత్త పల్లవి అందుకున్నారు. కేసీఆర్​ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు త్వరలో సంచలనం జరగబోతుందని ప్రకటించారు. కానీ అక్కడ ఎవరూ ఆయన మాటలను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో పర్యటనను మధ్యలోనే ముగించుకొని తెలంగాణకు వచ్చి మళ్లీ కర్నాటకకు వెళ్లారు. అక్కడ అతిథి మర్యాదలు స్వీకరించి భోజనం చేసి ప్రెస్ మీట్ పెట్టి 2,3 నెలల్లో సంచలనం వింటారని ప్రకటించారు. అది వస్తుందో రాదో తెలియని పరిస్థితి. నిజానికి బీఆర్ఎస్ తో కేసీఆర్ కు వీఆర్ఎస్ అని ఆయనతో సహా పార్టీలోని కీలక నేతలకు తెలుసు. కానీ సొంతంగా రాజకీయ నిష్క్రమణ చేస్తే.. అపప్రద మోయాల్సి వస్తుందని భావించే ఇలాంటి పనికిమాలిన ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఏ క్షణం ఎటు వైపు నుంచి దర్యాప్తు సంస్థలు తన అక్రమాస్తులపై విరుచుకుపడతాయో తెలియని పరిస్థితుల్లో కేసీఆర్ కుటుంబం భయంతో వణుకుతోంది. అందుకే రాజ్యాంగబద్ధమైన దర్యాప్తు సంస్థలకు పార్టీల రంగు పులిమే ప్రయత్నం చేస్తూ.. రాబోయే ముప్పు నుంచి సానుభూతి పొందే వ్యూహంలో భాగంగా రాజకీయ డ్రామాలకు తెరలేపారు. జాగ్రత్తగా రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ తన కుటుంబాన్ని, అక్రమ ఆస్తులను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో జనాల్లోకి తప్పుడు సందేశం తీసుకేళ్లెందుకే బీఆర్ఎస్ ను ముందుకు తెచ్చారు. రాజ్యాంగబద్ధంగా తన అవినీతి చిట్టా బయటపడి కటకటాల పాలైతే.. జాతీయ పార్టీ పెట్టాను కాబట్టి ఇలా జరిగిందని చెప్పుకోవచ్చనేది ఆయన ప్లాన్. 

వృథా పర్యటనలు..

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతా అని ఊరిస్తున్న కేసీఆర్.. బీఆర్ఎస్ పేరుతో ఓ ప్లాట్ ఫాం రెడీ చేసుకోవాలని విఫలయత్నం చేస్తున్నారు. గత అనుభవాలతో కేసీఆర్ ను దేశంలోని ప్రాంతీయ పార్టీల అధినేతలు ఎవరూ విశ్వసించే అవకాశం లేదు. ఇల్లు చొచ్చుకొని వచ్చాడని అతిథి మర్యాదలు చేస్తున్నారు తప్ప ఆయనతో రాజకీయ వేదికలను పంచుకోవడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. మొన్నామధ్య జార్ఖండ్ వెళ్లి శింబుసోరెన్, హేమంత్ తో భేటీ అయ్యారు. ఓసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు అపాయింట్​మెంట్ కూడా ఇవ్వని కేజ్రీవాల్ తర్వాత కండిషన్ లు పెట్టి కరుణించారు. అఖిలేశ్ యాదవ్, ఉద్ధవ్ థాక్రేతో పర్పస్ లేని పర్యటనలు చేశారు. కర్నాటక వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ, జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామిలను కలిశారు. టీ.. టిఫిన్ చేసి వచ్చామా..? అన్నట్లుగా పర్యటన కనిపించింది కానీ సీన్ లో ఎలాంటి విశేషం లేదు. తాజాగా ఉండవల్లితో భేటీ అయి.. ఏపీలోనూ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఉండవల్లి ఏ పార్టీలో ఉన్నాడో..? ఎవరికి మద్దతుగా ఉన్నాడో ఆయనకే తెలియాలి. అలాంటిది ఆయనతో ప్రకటనలు ఇప్పిస్తే ఏపీ ప్రజలు కేసీఆర్ ను విశ్వసిస్తారా?

- ఏనుగుల రాకేష్ రెడ్డి
రాష్ట్ర అధికార ప్రతినిధి, బీజేపీ