నిన్న కలిసి పనిచేసిన్రు.. నేడు కత్తులు దూస్తున్రు..!

  • రాజకీయ ప్రత్యర్థులుగా మారిన గులాబీ దోస్తులు 
  • వరంగల్‍ ఎంపీ అభ్యర్థులంతా మొన్నటివరకు కారు పార్టీలోనే.. 
  • ఇప్పుడు ప్రధాన పార్టీల నుంచి పోటీ

వరంగల్‍, వెలుగు: ఎంపీ ఎన్నికల్లో వరంగల్ స్థానం రసవత్తరంగా మారింది. నిన్నమొన్నటి వరకు ఒకే పార్టీలో కలిసి పనిచేసిన దోస్తులంతా ఇప్పుడు ప్రత్యర్థులుగా మారారు. నాలుగు నెలల కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదుటి పార్టీలను తిట్టిన లీడర్లే, ఇప్పుడు అవే పార్టీల నుంచి బరిలో నిలిచారు. రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలకు భిన్నంగా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‍, బీజేపీ, బీఆర్‍ఎస్‍ క్యాండిడేట్లు ముగ్గురూ ఇప్పుడు దోస్తానా మరిచి పొలిటికల్‍ దుష్మన్లు అయ్యారు. దీంతో ఆయా పార్టీల మధ్య పోటీ ఆసక్తిగా మారింది. 

పార్టీలు మారిన్రు.. దుష్మన్‍ అయిన్రు..

వరంగల్‍ పార్లమెంట్‍ నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్‍ కావడంతో ప్రధాన పార్టీలన్నీ బలమైన అభ్యర్థి కోసం వేటకు దిగాయి. బీఆర్‍ఎస్‍ లో దళిత లీడర్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వారి మధ్య తీవ్ర పోటీ నడిచింది. ఈ క్రమంలో తమ పార్టీకి ఎదురేలేదని గులాబీ పెద్దలు భావించగా రెండు, మూడు వారాల్లోనే సీన్‍ రివర్స్​అయింది. వరంగల్‍ సిట్టింగ్‍ ఎంపీగా పసునూరి దయాకర్‍ మరోసారి టికెట్ ఆశించారు. అదే స్థానంలో బడా కాంట్రాక్టర్‍, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‍, తన బిడ్డ డాక్టర్‍ కావ్య కోసం కడియం శ్రీహరి, స్టేషన్‍ ఘన్‍పూర్‍ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎవరికివారుగా హైకమాండ్‍ వద్ద ప్రయత్నాలు చేశారు. 

టిక్కెట్‍ రాదని భావించిన రాజయ్య ఫస్టే గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో కడియం, ఆరూరి, పసునూరి మధ్య పోటీ నెలకొనగా, పార్టీ పెద్దలు కడియం బిడ్డ కావ్య వైపు మొగ్గుచూపడంతో పసునూరి దయాకర్‍ బీఆర్‍ఎస్‍ వీడి కాంగ్రెస్‍లో చేరారు. ఏదేమైనా ఎంపీ ఎలక్షన్లో నిలబడాలనే ఉద్దేశంతో ఉన్న ఆరూరి రమేశ్‍ బీజేపీలో చేరి వరంగల్‍ టిక్కెట్‍ ఓకే చేసుకున్నారు. 

బీఆర్‍ఎస్‍ స్థానం కావ్యకు ఇవ్వగా, పార్టీలో లుకలుకలు గమనించిన కడియం శ్రీహరి తన కూతురుతో సహా ఎవరూ ఊహించని రీతిలో టిక్కెట్‍ వచ్చాక, కాంగ్రెస్‍ కండువా కప్పుకోగా, ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య హస్తం పార్టీ నుంచి బరిలో నిలిచారు. బీఆర్​ఎస్​లో కొత్తగా వచ్చేవారు లేకపోవడంతో పార్టీ పెద్దలు చివరకు హనుమకొండ జడ్పీచైర్మన్‍ డాక్టర్‍ మారపెల్లి సుధీర్‍ కుమార్‍ పేరును ఫైనల్​చేశారు. దీంతో నిన్నమొన్నటి వరకు గులాబీ పార్టీలో దోస్తులుగా ఉన్న ఆరూరి, కడియం, మారపెల్లి మధ్య పొలిటికల్‍ ఫైట్‍ తప్పట్లేదు. 

ఢీ అంటే ఢీ..

వరంగల్‍ బీఆర్‍ఎస్‍ రాజకీయాలు హైకమాండ్‍ను కుంగదీశాయి. 20 ఏండ్లుగా పార్టీలో ఉన్నోళ్లు, 10 ఏండ్లు అధికారం అనుభవించినోళ్లు నెల గ్యాప్‍లో పార్టీకి గుడ్‍ బై చెప్పారు. మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్‍, తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరి, సిట్టింగ్‍ ఎంపీ పసునూరి దయాకర్‍ ఒక్కొక్కరుగా కారు దిగడంతో పార్టీ తరఫున బరిలో నిలిచేందుకు బలమైన నేత కోసం వేట తప్పలేదు. తామే ముందు అభ్యర్థిని ప్రకటించామని చెప్పుకున్న బీఆర్‍ఎస్‍ పెద్దలు, సీన్‍ రివర్స్ తో లేటుగా అభ్యర్థి పేరు ప్రకటించాల్సి వచ్చింది. 

కాంగ్రెస్‍ తరఫున కడియం, బీజేపీ తరఫున ఆరూరి బలమైన నేతలుగా ఉండటంతో తెరమీదకు పెద్ది స్వప్న, తాటికొండ రాజయ్య, ఉద్యమ నేతలుగా జోరిక రమేశ్‍ పేర్లు వినిపించాయి. కానీ పార్టీ పెద్దలు మాత్రం బయటినుంచి బలమైన నేతలేవరైనా రాకపోతారా అన్నట్లు ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. దీంతో జడ్పీచైర్మన్‍ సుధీర్‍ కుమార్‍ను తమ అభ్యర్థిగా ఓకే చేశారు. మొత్తంగా ఒకే పార్టీలో కలిసి పనిచేసిన ఆరూరి రమేశ్‍, కడియం శ్రీహరి, మారపెల్లి సుధీర్‍ కుమార్​ ఇప్పుడు విజయం కోసం దోస్తానా పక్కనబెట్టి ఢీ అంటే ఢీ అంటున్నారు.