
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇటీవల ‘కత్తి వేరొకరికి ఇచ్చి తనను యుద్ధం చేయమంటే ఎలా చేస్తాను’ అంటూ ఎదురు ప్రశ్న వేసి తన పార్టీ నాయకులకు గీతోపదేశం చేశారు. గత సంవత్సరం జరిగిన ఎన్నికలలో ఈయన చేతికి ప్రజలు ఇచ్చింది కర్ర కత్తి, కీలుగుర్రం మాత్రమే అని గ్రహించాలి. కొందరిని కొన్నిసార్లు మోసం చేయవచ్చు కానీ అందరినీ అన్ని కాలాల్లో మోసం చేయలేరు. మీకూ మీ పార్టీకీ మిగిలేది ఇప్పట్లో ఏమీ లేదు.
దుర్బిణి వేసి చూసినా రాజకీయ విశ్లేషకులకు బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు మరింత ఊగిసలాటకు లోనుకానున్నట్టు తెలుస్తుంది. దీపం కింద చీకటి పెట్టుకొని మీరు ఎంత మాట్లాడినా ఇక రాష్ట్రంలో చెల్లే అవకాశం కనిపించడంలేదు.
ఏ కుటుంబం అధికారం కోసం గోతికాడ
కూర్చున్న గుంట నక్కలా వ్యవహరించిందో అప్పుడు వారి అధినాయకుడు తనకు తానే శభాష్ అని భుజం చరుచుకున్నాడు. రాజకీయ చతురుడిని అని కితాబు ఇచ్చుకున్నాడు. తాను చెప్పే కాకమ్మ కథలకు ప్రజలు ప్రతిసారి బోల్తాపడతారనుకోవడం అతిశయం. దీంతో పెరగడం విరగడం కోసమే అనే సామెత తరహాలో ప్రజలు తమశైలిలో తీర్పు చెప్పిఉన్నారు. సమయం, సందర్భం చూసి ప్రజలు ఆయన మాటల్లోనే వాత పెట్టారు.
తెలంగాణను ముంచి పంచుకుందెవరో, ఏ కుటుంబం ఎవరి ప్రాణత్యాగాల మీది నుంచి నడిచి వచ్చి అధికారాన్ని ఎలా చేపట్టిందో, అనంతరం ప్రజలను ఎలా మోసం చేసిందో తెలంగాణ సమాజానికి తెలిసిన విషయమే. చర్విత చరణంగా చెప్పాల్సిన అవసరం లేదు.
దొంగే.. దొంగా దొంగా అన్నట్టు
చచ్చిపోయిన బర్రె బుడ్డెడు పాలు ఇచ్చింది, మా తాతలు నేతులు తాగారు మా మూతి మీసాల వాసన చూడండ్రి అన్నట్టు.. తామేమో మూడు పువ్వులు ఆరు కాయలుగా పాలన అందించినట్టు ప్రగల్బాలు పలుకుతున్నారు. ఇప్పుడు ఏదో అన్యాయం, అవినీతి ఆశ్రితపక్షపాతం రాజ్యపాలన చేస్తున్నట్టు గగ్గోలు పెడుతుంటే ప్రజలు నోట్లో వేలు పెట్టుకొని చూస్తున్నారనుకుంటున్నారు. వెంట పెంపుడు సోషల్ మీడియాను తోడు తెచ్చుకుంటారు. ఆ పార్టీ నేతలు శాసనసభలో ప్రవర్తించిన తీరుచూస్తే దొంగే.. దొంగా దొంగా అని అరచినట్టు ఉంది.
అప్పుడొకలా.. ఇప్పుడొకలా..!
తెల్లారిలేస్తే అవినీతి, స్కాములు అంటూ ఆరోపణలు చేయడంతప్ప మరొకటి కనిపించదు. ఎందుకంటే వీరు పాలించిన పదేళ్లు నిర్వాకం అంతా అదే కదా! లక్ష రూపాయల రైతు రుణమాఫీని 4 విడతలుగా ఇస్తే అందులో మిత్తి కిందే ఎంత పోయిందో అసలు ఎంతపోయిందో వీరికి తెలుసా తెలువదా, తెలిసి నిశ్శబ్దంగా ఉంటున్నారో చెప్పాలి.
ఒకేసారి రెండు లక్షల రుణమాఫీని రైతు ఖాతాలలో జమ చేస్తే వీరికి కనిపించడం ఆటుంచి ఈ ప్రభుత్వం ఏదో రైతులకు అన్యాయం చేసినట్టు గాయికి ఎత్తుకుంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగ అధికార పక్షంలో ఉన్నప్పుడు మరో విధంగా అన్నీ మరిచిపోయి ప్రవర్తించడం గర్హనీయం. ప్రజాస్వామ్యం స్ఫూర్తి ఇంతేనా అని తెలంగాణ మేధావులు, ఆలోచనాపరులు ఆశ్చర్యపడడమే కాకుండా మన రాజకీయ నాయకుల అద్వితీయ వ్యక్తిత్వాలకు ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు.
చింత చచ్చినా పొగరు చావలె!
ఎగిరెగిరి దంచినా గదే కూలి, ఎగరకుండా దంచినా గదే కూలి గిడుతుంది తప్ప మిగిలేది ఏమీ ఉండదు. చింత చచ్చినా పొగరు చావలేదు. వాపును చూసి బలుపు అని అధినాయకుడు భావిస్తున్నారు. తమను తాము సమీక్షించుకోకుండా ప్రజాభిప్రాయాన్ని తక్కువ చేసి చూపేందుకు తమను ఓడించి జనం తప్పు చేశారని పొంకనాలు పోతున్నారు. చెరువు మీద అలిగితే ఎమవుతుందో అందరికీ తెలిసినదే. గత పది ఏళ్ల పాలనలో ప్రజల కోరికలకు అనుకూలంగా పాలన చేసినట్టు భుజాలు చరుచుకుంటున్నారు.
33 శాతం తేడాను మరిపిస్తున్నడు!
ప్రజాస్వామ్యంలో ప్రజలలో ఉన్న అసంతృప్తి అవకాశం వచ్చినప్పుడు ఓట్ల రూపంలో వెల్లడవుతుంది. 2024 డిసెంబర్లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలు అందుకు నిదర్శనంగా పేర్కొనవచ్చు. గతంలో పురపాలక, ఐటీ మంత్రిగా పని చేసిన ఒక అహంకార వ్యక్తిత్వం కలిగిన నాయకుడు.. మీకు మాకు తేడా రెండున్నర శాతం ఓట్ల మాత్రమే అని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో 33శాతం తేడాను ఎందుకు మరిపిస్తున్నారో? ప్రజాస్వామ్యం ముసుగులో ఉన్న ఆ బ్రహ్మజ్ఞానికి తండ్రి లేకుంటే ఎవ్వరికి కానరావు అనే సత్యాన్ని గ్రహించి కనీసం కనువిప్పు కలుగుతుందేమో చూడాలి.
లొట్టిమీది కాకిలా ప్రచారం
నీళ్లల్లో మాముల్ రూపాయల కట్టలేరుకున్న మాజీ మంత్రి ఏదో లెక్కలు చేసి బొక్కలు విరిగిపోయినట్టు ఇది చేయలేదు అది చేయలేదు అని మాట్లాడుతుంటాడు. వీరి కుటుంబ సభ్యులంతా టోకున సత్య హరిశ్చంద్రుని తమ్ముళ్లలా నీతిపరులైనట్టు మాట్లాడుతుంటారు. సామాజిక మాధ్యమాల ద్వారా మేనేజ్ చేసుకుంటూ లొట్టి మీది కాకిలా ప్రచారానికి లంకించుకుంటారు. వీరు తెలంగాణ నియోజకవర్గాలలో అప్పటినుంచి ఇప్పటివరకూ సోషల్ మీడియా సెంటర్లను నడుపుతున్నారు. తలనొప్పి లేసింది నెత్తికి రోకలి కట్టమన్నట్టుగా ఉంటుంది వీరి వ్యవహారం.
15 నెలలకే కొంప మునిగిపోయిందట!
బీఆర్ఎస్కు అధికారం ఇచ్చి పదేళ్లపాటు తెలంగాణ సమాజం వేచి చూసింది. ప్రతిపక్షంలో కూర్చోబెట్టి 14 నెలలకే ఏదో కొంప మునిగినట్టు గోలెత్తడం, మింగుడు పడకపోవడం చూస్తే ఆ పార్టీ నాయకులను, అధినాయకుడి తీరును చూస్తే ఇప్పట్లో ఎవరూ వారిని రక్షించలేరు. ఇది ఇలా ఉంటే ఫామ్ హౌస్లో ఉంటున్న మాజీ ముఖ్యమంత్రిని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కోరుతున్నట్టు, ఉడుకు నీళ్లుపోసి లేపుతున్నట్టు ప్రజల పేరిట తన అనివార్యతను తానే సృష్టించుకుంటున్నాడు.
ఆయన, వారి కుటుంబ సభ్యులు తమ పదేళ్ల పాలన అంతా ధర్మం నాలుగు పాదాల మీద నడిచినట్టు ఏమాత్రం జంకు గొంకూ లేకుండా ఇంకా నిస్సిగ్గుగా ప్రవర్తిస్తున్నారు. చేసిన అవినీతి తప్పులు వారికి ఏమాత్రం కనిపించకపోవడం తెలంగాణకు శాపమా? తెలంగాణ ప్రజలు చేసుకున్న పాపమా?
-జూకంటి జగన్నాథం,కవి, రచయిత-