- బీఆర్ఎస్కు బిగ్‌షాక్.. కాంగ్రెస్ కండువా కప్పుకున్న భద్రాచలం ఎమ్మెల్యే
- సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన తెల్లం వెంకట్రావ్
- పంతం నెగ్గించుకున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి
భద్రాచలం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కు బిగ్ షాక్తగిలింది. జిల్లాలో ఒక్కగానొక్క గులాబీ ఎమ్మెల్యే కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో ‘కారు’ ఖాళీ అయింది. ఆదివారం హైదరాబాద్‌లో సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్‌లో చేరారు. ఖమ్మం జిల్లా నుంచి ఒక్కరంటే ఒక్కరినీ బీఆర్ఎస్ తరుఫున అసెంబ్లీ గేటు తాకనివ్వబోనని ఎన్నికలకు ముందు శపథం చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైనల్‌గా పంతం నెగ్గించుకున్నారు.
అనుకున్నదే.. అయ్యింది!
పొంగులేటి శిష్యుడిగా ముద్రపడిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ నుంచి గెలిచిన నాటి నుంచే కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జరిగింది. తెల్లం రాజకీయాల్లోకి వైసీపీ తరుఫున పొంగులేటి ద్వారా ఆరంగేట్రం చేశారు. తొలుత మహబూబ్‌బాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్లో చేరితే ఆయన వెంట నడిచారు. బీఆర్ఎస్నుంచి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెల్లం పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పొంగులేటికి, బీఆర్ఎస్కు మధ్య వైరం పెరిగి ఆయన కారు దిగి కాంగ్రెస్‌లో చేరారు.
అప్పుడు కూడా పొంగులేటి వెంటనే నడవాలని భావించిన తెల్లం గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కానీ భద్రాచలం టిక్కెట్ విషయంలో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, డీసీసీ ప్రెసిడెంట్ పొదెం వీరయ్యకే కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపింది. దీంతో కాంగ్రెస్‌లో చేరిన 40 రోజుల్లోనే తెల్లం తిరిగి బీఆర్ఎస్కు వెళ్లిపోయి టికెట్ దక్కించుకున్నారు.
తన రాజకీయ గురువు పొంగులేటి మాటను కాదని వెళ్లినా ఎక్కడో మూలన అనుమానం లేకపోలేదు. ఒకవేళ ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచినా కాంగ్రెస్‌కే వస్తారని ఆ రోజే పలు రకాలుగా ప్రచారం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాల్లో 9 కాంగ్రెస్ గెలిచింది. ఊహించని రీతిలో భద్రాచలంలో పొదెం వీరయ్య ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ నుంచి తెల్లం వెంకట్రావ్ గెలిచారు. ఆ నాటి నుంచే వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తంపై రోజుకో విధంగా ప్రకటనలు వచ్చాయి.
బీఆర్ఎస్ కు దూరం.. కాంగ్రెస్‌కు దగ్గర..
తెల్లం ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి పరోక్షంగా ఆయన కాంగ్రెస్‌కు దగ్గరవుతూ బీఆర్ఎస్ను దూరం పెడ్తూ వచ్చారు. జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దర్శనం కోసం వచ్చినప్పుడు ఐటీసీ గెస్ట్ హౌస్‌లో తెల్లం వెంకట్రావ్ వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. అప్పుడు చేరికపై వచ్చిన ఊహాగానాలను ఆయన ఖండించారు. బీఆర్ఎస్లోనే ఉంటానని స్పష్టం చేశారు. కానీ మార్చి 1న మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు బీఆర్ఎస్ఎమ్మెల్యేలు వెళ్తుంటే తెల్లం డుమ్మా కొట్టారు.
హైదరాబాద్‌లో పార్లమెంట్ ఎన్నికల సన్నాహాక సమావేశానికి హాజరు కాలేదు. స్వయంగా కేటీఆర్ ఆహ్వానించినా వెళ్లలేదు. ఆ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డిని కుటుంబ సమేతంగా వెంకట్రావు కలిశాడు. ఈ విషయమై వెంటనే మాజీ మంత్రి హరీశ్‌రావు ఉద్యమకారుడు, మాజీ నియోజకవర్గ ఇన్చార్జ్ మానె రామకృష్ణను పిలిపించుకుని పరిస్థితిపై ఆరా తీశారు. నియోజకవర్గ ఇన్చార్జ్ గా ఉన్న తెల్లంను తొలగించి మళ్లీ మానె రామకృష్ణకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత ఐదో గ్యారంటీ మీటింగ్‌కు జిల్లాకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డిని తెల్లం కలిసి మణుగూరు సభలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.
అనంతరం ఖమ్మం, చర్లలో జరిగిన బీఆర్ఎస్ సమావేశాలకు వెళ్లలేదు. ఎంపీ మాలోతు కవిత స్వయంగా వెళ్లి తన గెలుపునకు కృషి చేయాలని కోరినా పట్టించుకోలేదు. తాజాగా ఇల్లెందులో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో కలిసి వెంకట్రావు హాజరయ్యారు. క్యాంపు కార్యాలయానికి ఉన్న బీఆర్ఎస్ ఫ్లెక్సీలు తొలగించినప్పుడే ఆయన పార్టీ మారుతారని స్పష్టమైంది. తుక్కుగూడలో శనివారం జరిగిన రాహుల్ గాంధీ సమావేశంలోనూ తెల్లం పాల్గొన్నారు. ఫైనల్‌గా ఆదివారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
అభివృద్ధే ఎజెండా : తెల్లం
నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరిన్నట్లు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రకటించారు. ఆదివారం పార్టీలో చేరిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నియోజకవర్గం అభివృద్ధి కోసం పోటీ చేస్తున్నట్లుగా ప్రజలకు హామీ ఇచ్చానని చెప్పారు. వారి హామీ నెరవేర్చాలంటే అధికార పార్టీలో ఉంటేనే సాధ్యమవుతుందని, అందుకే కాంగ్రెస్ లో చేరానని తెలిపారు. తనకు ఎవరితోనూ విభేదాలు లేవని, కేవలం అభివృద్ధే తన ఎజెండా అన్నారు.