బీఆర్ఎస్​ది కమీషన్ల ప్రభుత్వం.. మాజీ మంత్రి షబ్బీర్​అలీ

కామారెడ్డి , వెలుగు: బీఆర్ఎస్​ ప్రభుత్వం కమీషన్ల  కోసమే పనిచేస్తోందని మాజీ మంత్రి, కాంగ్రెస్​నేత షబ్బీర్​అలీ విమర్శించారు. 1200 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే, దశాబ్ది ఉత్సవాల పేరిట సంబురాలు జరపడం ఏమిటని ప్రశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు 22వ ప్యాకేజీలోని సదాశివనగర్​మండలం భూంపల్లి రిజర్వాయర్​వద్ద కాంగ్రెస్​ఆధ్వర్యంలో గురువారం ధర్నా చేశారు. షబ్బీర్​అలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో రూ.1,446 కోట్లతో 22వ ప్యాకేజీ పనులు చేపట్టినట్లు గుర్తు చేశారు. 

సిరిసిల్ల, సిద్దిపేట,  గజ్వేల్​నియోజక వర్గాలకే సాగునీరు అందిస్తూ, మిగతా నియోజకవర్గాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతుంటే, పరపతి కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లి డబ్బులు పంచుతున్నారని వాపోయారు. టీపీసీసీ జనరల్ సెక్రెటరీ వడ్డేపల్లి సుభాష్​రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్​కైలాస్​శ్రీనివాస్​రావు, లీడర్లు జనార్ధన్​రెడ్డి, చంద్రకాంత్​రెడ్డి, ఇంద్రాకరణ్​రెడ్డి, గూడెం శ్రీనివాస్​రెడ్డి, పండ్ల రాజు పాల్గొన్నారు.