పోడు భూముల కోసం పోరాడినోళ్లను పక్కన పెట్టిన రాష్ట్ర సర్కారు

  • ఆసిఫాబాద్ జిల్లా సార్సాలలో నాలుగేండ్ల కిందట మొదలైన పోడు పోరు
  • ఫారెస్ట్ ఆఫీసర్లపై దాడి కేసులో ఒకే తండా నుంచి 38 మంది జైలుపాలు
  • అప్పట్నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్న రైతులు
  • లబ్ధిదారుల లిస్టులో నుంచి సార్సాల గిరిజనుల పేర్లను ఎగరగొట్టిన ప్రభుత్వం
  • రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి.. కేసులున్నోళ్లను పక్కన పెట్టిన వైనం
  • పోరాడినందుకే గిరిజనులపై సర్కారు కక్ష కట్టిందనే ఆరోపణలు
  • కేసులు ఎత్తేసి, తమ భూములను ఇవ్వాలంటున్న బాధిత రైతులు

ఆసిఫాబాద్ / కాగజ్‌నగర్ / నెట్‌వర్క్, వెలుగు:  పోడు పట్టాల పంపిణీని శుక్రవారం ప్రారంభిస్తున్న రాష్ట్ర సర్కారు.. ఆ పోడు భూముల పోరాటానికి ఆద్యులైన సార్సాల గిరిజనులను మాత్రం పక్కనపెట్టింది. 30 ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూముల్లో ఫారెస్ట్ ఆఫీసర్లు మొక్కలు నాటుతుంటే తిరగబడినందుకు నాలుగేండ్లుగా కేసులు, జైళ్లు, కోర్టులంటూ 38 మంది గిరిజనులను వేధిస్తూ.. ఇప్పుడు పట్టాల పంపిణీలో షాక్ ఇచ్చింది. లబ్ధిదారుల లిస్టులో నుంచి సార్సాల గిరిజనుల పేర్లను ఎగరగొట్టింది. ఇది కేవలం సార్సాలకే పరిమితం కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా పోడు భూముల కోసం ఫారెస్ట్ ఆఫీసర్లపై పోరాడిన గిరిజనుల్లో చాలా మందికి పట్టాలు రాకపోవడం ఒక ప్లాన్ ప్రకారం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

తమ పోరాటాల వల్లే పట్టాలు ఇస్తున్న సర్కారు.. తమ పేర్లను తొలగించడం, ఇప్పటికీ తమపై పెట్టిన కేసులను ఎత్తివేయకపోవడం అన్యాయమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నాలుగేళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నరు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని మారుమూల గ్రామం సార్సాల పేరు నాలుగేండ్ల కింద రాష్ట్రమంతా మారుమోగింది. సార్సాల పంచాయతీ పరిధిలోని కొత్త సార్సాలకు చెందిన సుమారు 20 గిరిజన కుటుంబాలు గ్రామ శివారులోని కాగజ్​నగర్ రేంజ్ రాస్​పల్లి బీట్ పరిధిలో 30 ఏండ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్నాయి. సాఫీగా సాగిపోతున్న తరుణంలో కాళేశ్వరం ప్రాజెక్టు వీరి బతుకుల్లో చిచ్చు పెట్టింది. కాళేశ్వరం కింద కోల్పోయిన ఫారెస్ట్​ భూములకు ప్రతిగా కాగజ్ నగర్ రేంజ్ రాస్​పల్లి బీట్ కంపార్ట్​మెంట్ 133, 136 పరిధిలోని 20 హెక్టార్ల (50 ఎకరాల) భూమిని రెవెన్యూశాఖ ద్వారా అటవీశాఖకు ప్రభుత్వం బదిలీ చేసింది. 

దీంతో 2019 జూన్ 30న ఈ భూమిలో మొక్కలు నాటేందుకు ఫారెస్ట్ ఆఫీసర్లు, పోలీసులతో కలిసి సుమారు 50 మంది దాకా వెళ్లారు. 30 ఏండ్లుగా సాగుచేసుకుంటున్న వ్యవసాయ భూముల్లో మొక్కలు నాటేందుకు ప్రయత్నించడంతో.. భూములు తమకు దక్కకుండా పోతాయోననే ఆందోళనలో గిరిజనులు ఎదురుతిరిగారు. స్థానిక గిరిజనులు, వారి కుటుంబాలతోపాటు రైతులకు మద్దతుగా జడ్పీ వైఎస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, చుట్టుపక్క గ్రామాల నుంచి గిరిజన, గిరిజనేతర రైతులు తరలివచ్చారు. మొదట పోడు రైతులకు, ఫారెస్ట్​ఆఫీసర్లు, సిబ్బంది, పోలీసులకు నడుమ మొదలైన తోపులాట ఒక దశలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఓ గిరిజన మహిళను సిబ్బంది ఈడ్చుకెళ్తుంటే చీర జారిపోవడంతో గిరిజనులు ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. 

ఆవేశంతో కర్రలతో ఫారెస్ట్ ఆఫీసర్లు, సిబ్బంది, పోలీసులపై దాడి చేశారు. ఇరువైపులా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీన్ని సీరియస్​గా తీసుకున్న సర్కారు.. ఈ ఘటనకు సంబంధించి 38 మంది గిరిజన, గిరిజనేతర రైతులపై నాన్​బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపింది. ఇది రాష్ట్రంలో పోడు భూములకు సంబంధించిన మొదటి తిరుగుబాటు. ఈ కేసులో ఇరుక్కున్న వాళ్లు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. తర్వాత 200 మందిదాకా ఫారెస్ట్ ఆఫీసర్లు, పోలీసులు కలిసివచ్చి ఇక్కడ 20 హెక్టార్లలో 22,220 మొక్కలు నాటించారు. మూడు నెలల పాటు సిబ్బందిని కాపలా పెట్టిమరీ ఫెన్సింగ్ వేయించారు. పోడు భూముల కోసం నాడు ప్రాణాలకు తెగించిన పోరాడిన సార్సాల గిరిజనులు తమపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని నాలుగేండ్లుగా ప్రజాప్రతినిధులు, ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నా కనికరించడం లేదు. తాజాగా పోడు పట్టాలు కూడా తిరస్కరించడంతో కన్నీరుమున్నీరవుతున్నారు.

కొత్తగూడెం జిల్లాలో 3 వేల మందిపై కేసులు

ఏటా వానాకాలం సీజన్‌‌లో హరితహారం పేరిట పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు వస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్లకు, ఆ భూముల్లో దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న గిరిజనులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తమ విధులను అడ్డుకున్నారని, దాడి చేశారని ఆరోపిస్తూ ఫారెస్ట్​ఆఫీసర్లు రాష్ట్రవ్యాప్తంగా వేలాది మందిపై కేసులు పెడ్తున్నారు. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2019 నుంచి 2021 మధ్య సుమారు 3 వేల మందిపై కేసులు పెట్టారు. ఇల్లెందు, గుండాల, చండ్రుగొండ, ముల్కలపల్లి, టేకులపల్లి, అశ్వారావుపేట తదితర మండలాల్లోని పోడు రైతులు కేసులపాలై కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా తమలో చాలామందికి పోడుపట్టాలు రాలేదని బాధిత గిరిజనులు చెప్తున్నారు. పినపాక మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 70 మందిపై, పాల్వంచ మండలం సత్యనారాయణపురం పార్కలగండికి చెందిన 40 మందిపై ఫారెస్ట్​ఆఫీసర్లు కేసులు పెట్టి జైలుకు పంపారు. బెయిల్​పై బయటకు వచ్చిన వీరంతా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

 యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని తూంబాయి తండా, కడిలబాయి తండా, అల్లాపురం తదితర గ్రామాల్లో మూడేండ్ల కింద పోడు రైతులపై కేసులు నమోదయ్యాయి. భూములు దున్నడానికి వెళ్లిన రైతుల ట్రాక్టర్లు, బోరు వేసేందుకు వచ్చిన బోరు బండ్లను ఫారెస్ట్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ  భూముల్లో ఫారెస్ట్​అధికారులు జేసీబీలతో గుంతలు తీస్తుంటే అడ్డుకున్న 30 మంది రైతులపై కేసు పెట్టారు. మహబూబాబాద్ జిల్లాలోని గంగారం మండలం మడ గూడెంలో రెండేండ్ల కింద పోడు సాగును అడ్డుకున్న డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ కర్ణన్ పై ఆదివాసులు దాడి చేశారు. దీంతో 8 మందిపై  కేసులు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంపోడులో పోడు భూముల కోసం కొట్లాడిన 42 మంది గిరిజన రైతులపై కేసులు నమోదు చేయగా, 75 రోజుల పాటు జైలు జీవితం గడిపారు. 

గ్రామంలోని 540 సర్వే నంబర్ లో నాగార్జున సాగర్ ముంపు బాధితులకు  కేటాయించిన1,876 ఎకరాలను కొందరు అక్రమంగా తమ పేర్ల మీదకు మార్చుకున్నారు. తమ నుంచి లాక్కున్న భూములకు తిరిగి తమకే ఇవ్వాలంటూ రైతులు 20 ఏండ్లుగా పోరాడుతున్నారు. ఈ క్రమంలో 42 మంది గిరిజన రైతులపై 2019 జూన్ లో కేసులు పెట్టారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది పోడు రైతులు, అటు భూములు కోల్పోయి, ఇటు కేసులపాలై కూలినాలి చేసుకుంటూ దుర్భర జీవితం గడుపుతున్నారు. తాజాగా పోడు పట్టాలు పంపిణీ చేస్తున్న సర్కారు, ఇప్పటికైనా తమపై పెట్టిన కేసులు ఎత్తివేసి, తమకు కూడా భూములు దక్కేలా చూడాలని బాధితులు రిక్వెస్ట్​ చేస్తున్నారు.

పోడు భూముల కోసం ప్రాణాలిడిసిన్రు

2021 జులైలో నాగర్​కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామానికి చెందిన ఉడుతనూరి నిరంజన్, లింగమ్మ అనే చెంచు దంపతులు పోడుభూమి దున్నుతుంటే ఫారెస్ట్ సిబ్బంది అడ్డుకున్నారు. వీరిద్దరితోపాటు ఉడతనూరి మల్లయ్య, ఉడుతనూరి పార్వతమ్మ, కాట్రాజు అనిత.. ఫారెస్ట్ ఆఫీసర్లను బెదిరించడానికి బాటిళ్లలో పెట్రోల్ తెచ్చి తమపై చల్లుకున్నారు. కానీ డ్యూటీలో ఉన్న ఫారెస్ట్​ సిబ్బందిపై పెట్రోల్ చల్లి హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ ఐదుగురిపై కేసుపెట్టి జైలుకు పంపించారు. 15 రోజుల తర్వాత జైలు నుంచి రిలీజైన లింగమ్మ పురుగుల మందు తాగి ఆత్యహత్య చేసుకుంది. కొద్దిరోజులకే ఆమె భర్త నిరంజన్​ కూడా పురుగుల మందు తాగి చనిపోయాడు. కోర్టు చుట్టూ తిరగడానికి రూ.2 లక్షలకుపైగా ఖర్చయ్యిందని, ఈ కష్టాలకన్నా చావే నయమనిపిస్తోందని మల్లయ్య, కాట్రాజు అనిత వాపోతున్నారు. 40 ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూమి దక్కనివ్వకుండా తమ అమ్మానాన్నల ప్రాణాలు తీసుకున్నారని నిరంజన్, లింగమ్మ కొడుకు సైదులు కన్నీళ్లు పెట్టుకున్నాడు. పని దొరక్క బిచ్చమెత్తుకుని బతుకుతున్నట్టు వాపోయాడు.

భూమి పోయింది.. కేసు మిగిలింది..

ఫారెస్ట్, రెవెన్యూ ఆఫీసర్లు జాయింట్​సర్వే చేసి సార్సాల శివారులో మాకు ఐదెకరాల భూమి ఇచ్చిన్రు. నేను పుట్టక ముందు నుంచే మా తల్లిదండ్రులు ఈ భూమి దున్నుకుంటున్నరు. కానీ కాళేశ్వరం కింద పోయిన భూములకు బదులు మా భూములను ఫారెస్టోళ్లకు సర్కారు ఇచ్చిందట. మా భూమిలో విత్తనాలు వేసేందుకు మేము వెళ్తే, మొక్కలు పెట్టేందుకు ఫారెస్టోళ్లు వచ్చిన్రు. అప్పుడు జరిగిన గొడవలో మాపై కేసులు పెట్టిన్రు. ముగ్గురం జైలుకు పోయొచ్చినం. ఇప్పుడు పేషీ కోసం ఆదిలాబాద్ కోర్టుకు పోతున్నం. పోయివచ్చిన ప్రతిసారీ ఒక్కొక్కరికి రూ.వెయ్యి ఖర్చయితంది. మా 5 ఎకరాల భూమిలో ఫారెస్ట్ ఆఫీసర్లు మొక్కలు పెట్టిన్రు. ఇప్పుడు మాకు సెంటు భూమి కూడా లేదు. కూలినాలి చేసి బతుకుతున్నం. కేసీఆర్ పెద్ద మనసుతో మాపై కేసులు ఎత్తివేసి, భూమి ఇప్పించాలి. 

- బిబ్బెర రాజేశ్, సార్సాల

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని కోయపోచుగూడ ఆదివాసులు పోడు భూమిలో నిరుడు జూన్, జులైలో విత్తనాలు వేస్తుండగా ఫారెస్ట్ ఆఫీసర్స్ అడ్డుకున్నారు. ఆ భూముల్లో వేసుకున్న గుడిసెలను తొలగించే క్రమంలో జరిగిన గొడవలో ఫారెస్ట్​ ఆఫీసర్లు, పోలీసులు ఆదివాసీలపై దాడికి దిగారు. మహిళలని చూడకుండా ఈడ్చుకుంటూ వెళ్లి 12 మందిని ఆదిలాబాద్ జైలుకు తరలించారు. మహిళలను 10 రోజుల పాటు జైల్లో పెట్టారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్​ జి.వివేక్ వెంకటస్వామి, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల తదితరులు వారి ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఇప్పుడు కోయపోచుగూడ ఆదివాసీలకు పోడు పట్టాలు ఇవ్వడం లేదు.

మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం అక్కెపెల్లిలో పోడు చేస్తున్నారంటూ 19 మంది ఆదివాసీలపై ఫారెస్ట్ ఆఫీసర్లు కేసులు పెట్టారు. దొంగచాటుగా తాపకు కొందరిని అరెస్టు చేసి జైలుకు పంపారు. గ్రామస్తులను ప్రోత్సహిస్తున్నాడంటూ పోడుతో ఎలాంటి సంబంధం లేని ఓ గవర్నమెంట్ టీచర్‌‌‌‌ను ఏ1గా చేర్చారు. ఆయన కొడుకుతో పాటు మరో నలుగురు యువకులను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇటీవల మరో ఆరుగురిని  జైలుకు పంపగా, ఈ నెల 15న బెయిల్​పై విడుదలయ్యారు.

15 నెలల జైల్లో ఉన్న..

2007లో నాపై ఫారెస్ట్​ఆఫీసర్లు ఏడు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. మొత్తం 15 నెలల పది రోజుల పాటు జైలు శిక్ష అనుభవించా. ప్రస్తుతం మూడు సెక్షన్లపై జిల్లా కోర్టులో కేసులు నడుస్తున్నాయి. వాయిదాలకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నా. పోడు పట్టాలిస్తున్నామని గొప్పగా చెప్తున్న సర్కార్​ పోడు సాగుదారులు, నాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి.

–జంగిలి వెంకటరత్నం, పోడు సాగుదారుడు, మర్రిగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

వీళ్లంతా ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్న నగర్‌‌కు చెందిన పోడు చేసుకునే గిరిజన మహిళలు. రెండేండ్ల కిందట ఫారెస్ట్ భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లిన తమపై మారణాయుధాలతో దాడి చేశారంటూ ఫారెస్ట్​ సిబ్బంది వీరిపై ఫిర్యాదు చేశారు. దీంతో 21 మంది గిరిజనులపై కొణిజర్ల పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. ఈ కేసులో బాలింతతో పాటు 11 నెలల చిన్నారిని జైలుకు పంపడం సంచలనం సృష్టించింది. విచారణ జరుగుతుండగా ఫారెస్ట్ సిబ్బంది కేస్ విత్ డ్రా చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఎల్లన్ననగర్ రైతులు 2005 తర్వాత పోడు సాగు చేస్తున్నారని, రూల్స్​ ప్రకారం పోడు పట్టాలు ఇవ్వడం కుదరదంటూ వీరి అప్లికేషన్లను పక్కనపెట్టారు.