అవినీతిపై దర్యాప్తు జరగాలె..నిర్దోషులని తేల్చుకుంటే మంచిది

ప్రపంచం నివ్వెర పోయే స్థాయిలో పరిపాలన చేస్తానని మాట ఇచ్చి అధికారానికి వచ్చింది బీఆర్​ఎస్​ ప్రభుత్వం.  కానీ  ప్రజల నుంచి వస్తున్న విమర్శలు,  ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఆరోపణలు, సామాన్య ప్రజానీకం తమలోనే దాచుకున్న అనేక సందేహాలకు ప్రభుత్వం సమాధానం చెప్పవలసిన అవసరం మాత్రం ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని పాలకులు  సేవకులని తరచుగా చెబుతూ ఉంటాం. అధికారాన్ని శాశ్వతం చేసుకునే క్రమంలో ఈనాటి ప్రభుత్వాలు ఎంతకైనా దిగజారుతున్న సందర్భంలో జరుగుతున్న తెలంగాణ ఉత్సవాలలో ప్రజలు తమ సందేహాలకు సమాధానాలను ఆశిస్తున్నారు. 

సంపద కొద్ది మంది చేతుల్లో అక్రమంగా  పోగుపడిన సందర్భంగా అవినీతి ఆరోపణలతో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని మంత్రులను అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులను ప్రతిరోజు విమర్శ చేస్తూనే ఉన్నా తగిన చర్య తీసుకున్నది లేదు. దర్యాప్తుకు ఆదేశించినది లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న నిఘా సంస్థలకు పని కల్పించినది కూడా లేదు. కొన్ని విషయాలలో ముఖ్యమంత్రి చొరవ తీసుకొని తమ నిజాయితీని, నిబద్ధతను, చిత్తశుద్ధిని రుజువు చేసుకోవడానికి  అక్రమార్కులపై  తగు చర్యలు తీసుకునే  అవకాశం ఎప్పుడూ ఉంటది. రాష్ట్రంలో ఉన్న అవినీతి నిరోధక శాఖకు మరిన్ని అధికారాలను కట్టబెట్టి ప్రజలు మెచ్చే పాలనను అందించే అవకాశమూ ఉంటది. దశాబ్ది సందర్భాన్ని ప్రభుత్వం అవకాశంగా తీసుకొని చర్యలు తీసుకుంటే ఉత్సవాలకు సార్థకత దక్కుతుంది.  కేవలం పాలాభిషేకాలు, పతాక ఆవిష్కరణలు,  రోజుకో ఉత్సవం పేరున మొక్కుబడి కార్యక్రమాలు  జరిపితే  దానివల్ల సామాన్యుడికి ఒరిగేది ఏమీ లేదు.   

ఆరోపణల మాటేమిటి?

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో  వేల కోట్ల అవినీతి జరిగినదని ప్రతిపక్షాలు అనేక సందర్భాలలో  సవాల్ విసిరినా  ప్రభుత్వం స్వీకరించడంలేదు, స్పందించడంలేదు. ఇప్పటికైనా ఆ విషయం పైన పెదవి విప్పాలి. తగిన  దర్యాప్తు జరిపించాలి. నిర్దోషులని తేల్చుకుంటే మంచిది.  ఇటీవల కాంగ్రెస్  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పైన,  ప్రభుత్వ భూముల అమ్మకాలపైన ,అక్రమార్కులకు ఉచితంగా ప్రభుత్వ భూములను కట్టబెట్టి రియల్ ఎస్టేట్ దందాకు సహకరిస్తున్నారన్న  ఆరోపణల పైన  ఎందుకు సమాధానం చెప్పలేదు. దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించి దోషులైన వారిపై  చర్యలు తీసుకోవాలి. అక్రమంగా పోగు పడిన సొమ్మును తిరిగి ప్రభుత్వ ఖాతాకు జమ చేయించాలి.సుమారు 54 లక్షల మంది రైతులకు పంపిణీ చేస్తున్నటువంటి రైతుబంధులో క్షేత్రస్థాయిలో నిజంగా పనిచేస్తున్నటువంటి 40 శాతంగా ఉన్న కౌలు రైతులకు ఏమాత్రం ప్రయోజనం కలగకపోగా  పంటలు పండించని గుట్టలు రాళ్లు రప్పలు, ఇండ్ల స్థలాలకు  రైతుబంధు పేరుతో కోట్లాది రూపాయలు  కట్టబెట్టి అక్రమార్కుల జేబులు నింపుతున్నారు.  దీనిపై ఈ ఉత్సవాలలో సమాధానం చెప్పాలి.  తప్పును అంగీకరించాలి. 

 
విద్య, వైద్యం కరువైంది

పరిపాలన అంటే వివిధ పథకాల పేరున ప్రజలకు డబ్బును పంపిణీ చేయడం కాదు.పేదరికం నిర్మూలించి, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి,  నిరుద్యోగ సమస్యను పరిష్కరించి, సమానత్వాన్ని సాధించడం, సమసమాజాన్ని స్థాపించడం. ఆ వైపుగా ఏ మేరకు  కృషి జరిగిందో ఈ ఉత్సవాల సందర్భంగా  తెలపాలి. విద్య, వైద్యం పూర్తిగా ప్రైవేటుపరం అయిపోయింది వాటిపైన ప్రభుత్వానికి అదుపు లేని కారణంగా పేద మధ్యతరగతి కుటుంబాలు తమ కొనుగోలు శక్తిని కోల్పోయినాయి. ఇప్పటికీ ప్రైవేటు వైద్యశాలలే పేద వర్గాలకు దిక్కు అనే దుస్థితిలో  రాష్ట్రం ఉంది. ఉత్సవాల సందర్భంగా విద్య వైద్యం ఉచితంగా అందిస్తామని ప్రకటన చేస్తే ప్రజలు సంతోషిస్తారు. విద్యా రంగానికి 6 శాతం మాత్రమే నిధులు కేటాయిస్తే  ఏ రకంగా పురోగతి సాధ్యమవుతుంది? కామన్ స్కూల్ విధానాన్ని అమలు చేసి,  కేజీ టు పీజీ ఇచ్చిన హామీని  నెరవేర్చి,  కొఠారి కమిషన్ ప్రకారంగా 30% నిధులను  బడ్జెట్లో కేటాయించి తన చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలి.  

అవినీతి రహితంపై హామీ ఇవ్వాలి

రాష్ట్ర ప్రభుత్వం  పెట్రోలు డీజిల్ పై పన్ను తగ్గించుకోవాలి. వంటగ్యాస్ ధరలను  కర్ణాటక ప్రభుత్వం మాదిరిగా తగ్గించి తన చిత్తశుద్ధిని చాటుకోవాలి. పాలాభిషేకాలకు  పాతర వేయాలి. ఎన్నికలు సభలు సమావేశాల సందర్భంగా మద్యం డబ్బు పంపిణీ చట్టబద్ధంగా నిర్మూలించాలి. అధికార పార్టీ  స్వచ్ఛందంగా అవినీతికి తావు లేకుండా వ్యవహరించడానికి హామీ ఇవ్వాలి. రాష్ట్రంలో ప్రతిపక్షాలను బ్రతికించుకుంటేనే పరిపాలన మరింత సారవంతంగా ఉంటుంది.  పార్టీ ఫిరాయించిన వారికి బహిరంగ శిక్షలు విధించడం ద్వారా  చేర్చుకున్న పార్టీలను  ప్రజలు బహిష్కరించడం ద్వారా గుణపాఠం చెప్పాలి. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో అవినీతి, ప్రభుత్వ భూములు రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ రాజకీయ నాయకులు ఆక్రమించుకున్నట్లుగా పత్రికా వార్తలు వస్తున్నాయి.

జవాబుదారీతనం ఏది?

దేశంలోనే రాష్ట్ర ప్రభుత్వ శాసనసభ్యులు మంత్రులకు అధిక వేతనాలు పెంచుకున్న నేపథ్యంలో వాస్తవాన్ని బయటపెట్టాలి. భవనాల నిర్మాణాలకు ఇచ్చిన స్థాయిలో ప్రాధాన్యత ఉద్యోగాల భర్తీకి, మౌలిక సదుపాయాలకు ఇవ్వడం లేదు. ఇటీవల నిర్మించిన సచివాలయ భవనం లోపభూయిష్టంగా నాణ్యత లేకుండా ఉన్నది అనే ఆరోపణలు, యాదాద్రిలో జరిగిన నిర్మాణంలో నాణ్యత లోపంతో  వెల్లువెత్తిన నిరసనలు, వంగిన వాటర్ ట్యాంకులు, కూలిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,  తెగిపోయిన కాలువలు ఇంకా ఎన్నో మరెన్నో ఇవన్ని టికి బాధ్యులు ఎవరు ?  బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల సబ్ ప్లాన్ నిధులు  పక్కదారి పట్టినాయనే ఆరోపణ బలంగా ఉంది.  

ఉప ఎన్నికలు ఇతరత్రా  సభలు సమావేశాల సందర్భంగా నెలల తరబడి మంత్రులు, శాసనసభ్యులు  ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే వాళ్లు  విధి నిర్వహణలో ఉన్నట్లా?  లేక సెలవు పెట్టినట్లా? సెలవు పెట్టినట్లయితే వారి వేతనాలలో కోత విధించాలి కదా? రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై ప్రజలు ప్రజాస్వామికవాదులు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఇతరుల నుండి సామాన్య ప్రజల నుండి వస్తున్న ఆరోపణలు ప్రశ్నలు విమర్శలకు ప్రభుత్వం బహిరంగ ప్రకటన చేయాలి. అవినీతిపై దర్యాప్తు జరిపించాలి. వచ్చిన ఆరోపణలు నిరాధారమని రుజువు చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాన్ని అంగీకరించడానికి, విశ్వసించడానికి ఆమోదించడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారని గుర్తిస్తే మంచిది.  

‑ వడ్డేపల్లి మల్లేశం,  పొలిటికల్​ ఎనలిస్ట్​