- రాష్ట్ర ముస్లిం ఆర్గనైజేషన్ జేఏసీ స్టేట్కో కన్వీనర్
- మందమర్రిలో ముస్లిం డిక్లరేషన్ విడుదల
కోల్బెల్ట్, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా 40 నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపే ముస్లింల అభ్యున్నతిని పాలకులు పట్టించుకోవడం లేదని తెలంగాణ ముస్లిం ఆర్గనైజేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ కో కన్వీనర్, రచయిత ఎస్ కే యూసుఫ్బాబా అన్నారు. రాష్ట్రంలో 13 శాతం ఓటర్లు ఉన్న ముస్లింలను కొన్ని పార్టీలు ఓటు బ్యాంకుగా చూస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఆదివారం మందమర్రిలో నిర్వహించిన తెలంగాణ ముస్లిం డిక్లరేషన్ సభలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలోని ముస్లింలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని జస్టిస్ సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిషన్, సుధీర్ కమిషన్ చెప్పాయన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి అసెంబ్లీలో మొక్కుబడిగా బిల్లు తీర్మానం చేసి కేంద్రానికి పంపారని ఆయన ఫైర్ అయ్యారు. ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేయకుండా బీఆర్ఎస్ సర్కారు మోసం చేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ముస్లింల సంక్షేమం, అభివృద్ధి, విద్య, ఉపాధి, రిజర్వేషన్లపై ఎలాంటి భరోసా ఇవ్వలేదన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ముస్లింల ఎదుగుదలకు సర్కారుచొరవ తీసుకోలేదని యూసుఫ్ బాబా అన్నారు. ఈ సందర్భంగా 22 అంశాలతో కూడిన ముస్లిం డిక్లరేషన్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో లీడర్లు అబ్దుల్ అజీజ్, ఎండీ ఇషాక్, షరీఫ్ పాల్గొన్నారు.