- గుంటిమడుగు డీపీఆర్ పూర్తయినా పనులు స్టార్ట్కాలే
- ఈ రిజర్వాయర్కోసం రూ.300కోట్లతో ప్రపోజల్స్
- పోతారం లిఫ్ట్ కోసం రైతుల ఎదురుచూపులు
- గుండారం కెపాసిటీ పెంచాలని డిమాండ్
- ఈ ప్రాజెక్టులతో పెద్దపల్లి జిల్లాలో వేల ఎకరాలకు సాగునీరు
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో పాత ప్రాజెక్టులను సర్కార్ పక్కన పెట్టినట్లే కనిపిస్తోంది. డీపీఆర్ పూర్తయిన ప్రాజెక్టు నిర్మాణం కూడా స్టార్ట్ కాలేదు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గుంటిమడుగు రిజర్వాయర్, మంథని మండలంలోని పోతారం లిఫ్టులను సర్కార్ పక్కన పెట్టినట్లే కన్పిస్తోంది. కాల్వశ్రీరాంపూర్ మండలంలో మానేరుపై రూ.300కోట్లతో బ్యారేజీ నిర్మించి నీరు నిల్వ చేసేందుకు కొన్నేండ్ల కింద రాష్ట్ర సర్కార్ నిర్ణయించి.. డీపీఆర్ కూడా ఆమోదించింది. కానీ అప్పటినుంచి ఒక్క అడుగు ముందుకు పడలేదు. వీటితోపాటు కమాన్‌పూర్ మండలంలోని గుండారం రిజర్వాయర్సామర్థ్యం 0.5టీఎంసీలు ఉండగా దానిని 2టీఎంసీలకు పెంచాలన్న డిమాండ్ ఉంది. ఈ మూడు ప్రాజెక్టులు పూర్తయితే పెద్దపల్లి జిల్లాలో 50 నుంచి 60వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
బ్యారేజీతో టెయిల్ ఎండ్ వరకు సాగునీరు
మానేరుపై 5టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించాలని నాటి సర్కార్ నిర్ణయించింది. ఎలాంటి ముంపు లేకుండానే రెండు గుట్టల మధ్య 400 మీటర్ల పొడవున బ్యారేజీ నిర్మిస్తే మానేరులో దాదాపు 9 కి.మీ, హుస్సేన్‌మియా వాగులో మరో 9 కి.మీ పొడవునా నీరు నిల్వ చేసుకోవచ్చు. దీనివల్ల ఎస్ఆర్‌ఎస్‌పీ టెయిల్ ఎండ్ ప్రాంతాలైన శ్రీరాంపూర్, ఓదెల, మంథని, ముత్తారం మండలాలతో పాటు కరీంనగర్ జిల్లా జమ్మికుంట, హుజూరాబాద్, జయశంకర్భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చాలా గ్రామాలకు సాగునీరందుతుంది. దీంతోపాటు ఏటా మానేరు నుంచి గోదావరిలో కలుస్తున్న నీటిని వినియోగంలోకి తీసుకురావచ్చు. కాగా ఎస్సారెస్పీ డి83, డి86 కాలువల కింద పెద్దపల్లి జిల్లాలో 62 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా ఎప్పడూ పూర్తిస్థాయిలో నీరందలేదు. పక్కనే కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నా ఇప్పటికీ ఆయకట్టు రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.
ALSO READ: బీఆర్ఎస్ లీడర్ల కమీషన్లపై హైకోర్టుకు వెళ్తా: కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
గుండారం 2 టీఎంసీలకు పెంచాలె
గుండారం రిజర్వాయర్ కెపాసిటీ 0.5 టీఎంసీలుండగా 2 టీఎంసీలకు పెంచాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెపాసిటీ పెంచడం వల్ల మంథని, రామగిరి, ముత్తారం, కమాన్‌పూర్ మండలాలకు ఆయకట్టుకు ఎస్సారెస్పీ కాలువ ద్వారా సాగునీరు అందించవచ్చు. పక్కనే కాళేశ్వరం బ్యారేజీల్లో ఏడాది పొడవునా నీరున్నా మంథనికి చుక్క నీరు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోతారం లిఫ్ట్ కోసం రైతుల ఎదురుచూపు
పోతారం లిఫ్ట్స్కీం నిర్మించాలని దశాబ్దాలుగా ఇక్కడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. సర్కార్ మాత్రం లిఫ్టులపై ఎలాంటి నిర్ణయం ప్రకటించడం లేదు. పక్కనే గోదారి, దానిపై కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మూడు బ్యారేజీలున్నాయి. అయినా మంథని, ముత్తారం, రామగిరి మండలాల్లోని 20 టేల్ఎండ్ గ్రామాలకు సాగునీరు అందడం లేదు. తెలంగాణ ఏర్పాటు కాకముందే మంథని మండల పరిధిలోని గోదావరి మీద పోతారం లిఫ్టుకు నాటి సర్కార్ ఆమోదం తెలిపింది. అనంతరం రాష్ట్రం ఏర్పాటయ్యాక బీఆర్ఎస్ సర్కార్ ఈ ప్రాజెక్టును పక్కకు పెట్టింది. గోదావరిపై మంథని మండలం పోతారం వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి సాగునీరు అందించాలని రైతులు 9 ఏండ్లుగా పోరాటం చేస్తున్నారు.