విద్యార్థులపై బకాయిల భారం..గత సర్కారు పాపమే!

విద్యార్థులపై బకాయిల భారం..గత సర్కారు పాపమే!

అట్టడుగు వర్గాలు అభివృద్ధి చెందాలంటే వారికి ఉన్న ఏకైక ఆయుధం విద్య ఒక్కటే అని రాజ్యాంగ నిర్మాత  డా. బీ.ఆర్ అంబేద్కర్ అన్నారు.  వ్యక్తి  నిర్మాణానికి,  మానవ  వికాసానికి,  సమాజ పురోగతికి విద్య  కీలక సాధనంగా పనిచేస్తుంది.  దేశంలో  ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా  విద్యావ్యవస్థను  బలోపేతం చేయడం  అత్యంత ఆవశ్యకం.  ఇది  ప్రభుత్వాల ప్రధాన బాధ్యత.  దేశంలో  నాణ్యమైన  విద్య  అందిస్తే  మానవ వనరుల నాణ్యత కూడా పెరుగుతుంది.   దేశ ప్రగతిలో,   పునర్నిర్మాణంలో  మానవ వనరులు  కీలక భూమిక పోషిస్తాయి.  కానీ,  తెలంగాణలో  గడిచిన  పదేండ్లు  కేసీఆర్  ప్రభుత్వం అవలంబించిన నిరంకుశ  విధానాలతో  విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.  పదేండ్లు  సంక్షోభంలో  ఉన్న విద్యావ్యవస్థను గాడిన పెట్టడమే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్.  

రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, మెడిసిన్, మేనేజ్​మెంట్, డిగ్రీ,  పీజీ, ఇతర వృత్తి విద్యాకోర్సులు చదువుతున్న  ఎస్సీ,  ఎస్టీ,  బీసీ,  మైనార్టీ,  ఈడబ్ల్యూఎస్‌  వర్గాల  విద్యార్థులందరికీ  ఫీజు రీయింబర్స్​మెంట్‌, ఉపకార వేతనాలు గడిచిన నాలుగేండ్లుగా నయా పైసా విడుదల కాలేదు.  దీంతో  పేద విద్యార్థులు ఆర్థికంగా సతమతమవుతున్నారు. ట్యూషన్  ఫీజుల కోసం  ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యం ఒరిజినల్ ధ్రువపత్రాలు ఇవ్వకపోవడంతో  లక్షలాదిమంది  పేద విద్యార్థులు  ఉన్నత చదువులకు, ఉద్యోగులకు దరఖాస్తు చేసేందుకు అవకాశం లేక అవస్థలు పడుతున్నారు.  బోధన రుసుములు, ఉపకార వేతనాలు  విడుదల ఆలస్యమవడంతో  ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు యాజమాన్యాలు  నిరాకరిస్తున్నాయి. 

ఏటా 12.5 లక్షల మంది దరఖాస్తు

రాష్ట్రంలో ప్రతి విద్యా సంవత్సరం  సుమారు 12.5 లక్షల మంది  ఎస్సీ, ఎస్టీ, బీసీ ,మైనారిటీ విద్యార్థులు స్కాలర్​షిప్, ఫీజు రీయింబర్స్​మెంట్ కోసం  దరఖాస్తు చేసుకుంటున్నారు.  ఇందుకు ప్రభుత్వం  ప్రతి ఏటా  సుమారు రూ.2,400 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా.  గడిచిన  నాలుగేండ్లుగా  రాష్ట్రంలో ఫీజు  రీయింబర్స్​మెంట్‌,  ఉపకార వేతనాలకు  దరఖాస్తు  చేసుకున్న లక్షలాది మంది పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్​మెంట్‌, ఉపకార వేతనాలు మంజూరు చేస్తూ ప్రభుత్వం  టోకెన్లు  జారీ చేసింది.  కానీ,  ప్రైవేట్ కళాశాల యజమాన్యాలకు బోధన ఫీజులు,  విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేయలేదు. దీంతో  లక్షలాదిమంది పేద, మధ్య తరగతి విద్యార్థులు తీవ్ర  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యా వ్యవస్థపై  గత  కేసీఆర్  ప్రభుత్వం అవలంబించిన తీరుకు ఇది పరాకాష్ఠ.

కేసీఆర్ పాలనలో ప్రభుత్వ విద్యాసంస్థలపై నిర్లక్ష్యం 

ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత  పేద విద్యార్థులందరికీ  నాణ్యమైన  సర్కారు విద్య  అందుబాటులోకి వస్తుందని ఆశించినా.... పదేండ్ల  కేసీఆర్ పాలనలో అవేమీ జరగలేదు.  పైగా ఉమ్మడి రాష్ట్రంలో కంటే  తెలంగాణ  విద్యా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది.  కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్  గడిచిన పదేండ్లు  విద్యారంగానికి బడ్జెట్ లో  సరిపడ  నిధులు కేటాయించలేదు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో  నియామకాలు చేపట్టకుండా,  మౌలిక వసతులు కల్పించకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పాపానికి తెలంగాణలో విద్యావ్యవస్థ  పాతాళానికి  నెట్టబడిందని విద్యాశాఖ గణాంకాలు తెలుపుతున్నాయి.  దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి.  ఢిల్లీ  ప్రభుత్వం బడ్జెట్ లో విద్యకు 23.5% అత్యధికంగా నిధులు ఖర్చు చేస్తుంటే,  అస్సాం 20.1%,  హిమాచల్ ప్రదేశ్ 18.9%,   బిహార్  కూడా తెలంగాణ కంటే ఎక్కువగా తన బడ్జెట్ లో 18.4%  నిధులు కేటాయించింది. కానీ, ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014-–15 బడ్జెట్​లో  10.89%  నిధులు కేటాయించిన కేసీఆర్ చివరకు  ఆ నిధులను 6.24 శాతానికి తగ్గించి విద్యా రంగానికి తీరని ద్రోహం చేశారు.  దేశంలోని  ఇతర  రాష్ట్రాల్లో  విద్యారంగానికి బడ్జెట్​లో  సగటున 14.8%  నిధులు కేటాయింపులు జరుగుతున్నాయి. అయితే,  కేసీఆర్ బంగారు (భ్రమల) తెలంగాణలో  విద్యా రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేశారు.  బీఆర్​ఎస్​ ప్రభుత్వం  బాధ్యతారహిత   వైఖరితో   విద్యను  నాశనం  చేయాలని  నిర్ణయించుకుందన్నది స్పష్టంగా అర్థమవుతోంది. 

గత కేసీఆర్​ సర్కారు పాపం

ప్రభుత్వ,  పైవేట్ విద్యాసంస్థల్లో  పేద విద్యార్థులను  విద్యాపరంగా  ప్రోత్సహించేందుకు ఎన్నో ఏండ్లుగా  ప్రభుత్వం బోధన రుసుములు, ఉపకార వేతనాలు మంజూరు చేస్తోంది.  కానీ,  గత  సీఎం  కేసీఆర్  నిర్వాకం వల్ల నాలుగేండ్లుగా  విద్యార్థులకు  సకాలంలో  బోధన  రుసుములు,  ఉపకార వేతనాలు అందలేదు.   సకాలంలో  ప్రైవేట్  కళాశాలలకు  విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్​మెంట్‌ నిధులు విడుదల చేయకపోవడంతో ఆయా విద్యాసంస్థల్లో  ఇంజినీరింగ్, మెడిసిన్, ఫార్మసీ,  మేనేజ్ మెంట్ డిగ్రీ,  పీజీ ఉత్తీర్ణులైన  విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు,  ఉద్యోగం సాధించేందుకు  ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థులకు కన్సాలిడేటెడ్ మెమోతో పాటు, బోనఫైడ్  సర్టిఫికెట్,  ట్రాన్స్​ఫర్​ సర్టిఫికెట్ వంటి ఒరిజినల్ ధృవపత్రాలు ఇచ్చేందుకు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. 

 సొంతంగా  ప్రైవేటు కళాశాల యజమానులకు  ఫీజు డబ్బులు చెల్లించలేని విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.  విద్యార్థులు బకాయిలు చెల్లిస్తేనే సర్టిఫికెట్ ఇస్తామని ఇటీవల ఆర్జీయూకేటీ  త్రిబుల్ ఐటీ అధికారులు చెప్పడంతో ఇటీవల ఓ విద్యార్థి ఒకరు హైకోర్టును ఆశ్రయించాడు.  పిటిషన్లు విచారించిన న్యాయస్థానం విద్యార్థులకు అనుకూలంగా తీర్పు ఇచ్చి సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులకు ఇబ్బంది పెట్టడం సరికాదని పేర్కొంది.  కోర్సు పూర్తయిన విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లు జారీ చేయాలని వర్సిటీ అధికారులను ఆదేశించిందంటే విద్యార్థులు ఎదుర్కొంటున్న  సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.  పెండింగ్ బకాయిలను ప్రస్తుత ప్రభుత్వం విడతలవారీగా ఎప్పుడు చెల్లిస్తారో ఇంకా ఓ నిర్ణయం తీసుకోకపోవడం లక్షలాది మంది  పేద విద్యార్థులను కలవరపరుస్తోంది.

సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి 

కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ‘విద్యా భరోసా స్కీమ్’  ద్వారా  రూ.5లక్షలు ఆర్థిక  సహాయాన్ని  విద్యార్థులకు అందజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.  విద్యా హక్కు చట్టం,  ఫీజు నియంత్రణ చట్టం కఠినంగా అమలు చేయాలి.  పేద విద్యార్థుల  చదువుకు ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  విద్యాశాఖ  కమిషన్  చైర్మన్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి.  వచ్చే బడ్జెట్‌లో  విద్యారంగానికి  30 శాతం నిధులు కేటాయించి, ప్రభుత్వ విద్యావ్యవస్థను  బలోపేతం చేయాలి.  ఫీజు రీయింబర్స్​మెంట్‌,  ఉపకార వేతనాల పాత బకాయిలు విడతల వారీగా విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలి.   విద్యా వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ సంస్థలపై తగిన చర్యలు తీసుకోవాలి. పెరిగిన మార్కెట్ ధరలకు అనుగుణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ  గురుకులాలతో పాటు,  సంక్షేమ శాఖ వసతి గృహాల విద్యార్థులకు  మెస్, కాస్మొటిక్ చార్జీలను పెంచాలి.

మొత్తం పెండింగ్ బకాయిలు రూ. 5,900 కోట్లు

ప్రస్తుత విద్యా సంవత్సరం (2024–-25)కు సంబంధించి ఉపకార వేతనాలు, బోధన ఫీజుల బకాయిలకు దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. డిసెంబర్ 31,  2024 వరకు గడువు ఉంది. ఈ విద్యా సంవత్సరం వచ్చిన దరఖాస్తులతో కలిపి  సుమారు రూ. 2,450 కోట్లను  పరిగణనలోకి  తీసుకుంటే..  విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం  బకాయిలు రూ.8,350 కోట్లకు చేరుతాయని అంచనా. 

ఉపకార వేతనాలు, బోధన ఫీజుల బకాయిలు 

విద్యా సంవత్సరం    రూ.కోట్లలో
2020–21    200
2021–22    900
2022–23    2,350
2023–24    2,450

- డా. చెట్టుపల్లి మల్లికార్జున్, పొలిటికల్​ ఎనలిస్ట్​