కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు.. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, అంబేద్కర్ విగ్రహం, కలెక్టరేట్లు, సెక్రటేరియెట్ నిర్మాణం దాకా అన్నిట్లో గత బీఆర్ఎస్ సర్కార్ మొదట తక్కువ ధరకు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి ఆ తర్వాత అమాంతం అంచనా వ్యయాన్ని పెంచేసినట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. దాదాపు అన్నిట్లో నాసిరకం పనులు జరిగినట్లు నిర్ధారణకు వచ్చింది. ఇట్ల లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని గత పాలకులు వృథా చేశారని, ఈ వ్యవహారాలన్నింటిపై విచారణ చేపట్టేందుకు రెడీ అవుతున్నది.
రాష్ట్ర పరిపాలన భవనమైన సెక్రటేరియెట్, జిల్లా పరిపాలన భవనాలైన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల విషయంలోనూ గత ప్రభుత్వం లెక్కాపత్రం లేకుండా అంచనా పెంచింది. అయినా నాసిరకం పనులతో ఇప్పటికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సెక్రటేరియెట్‌లోని కొన్ని రూమ్స్‌లో వర్షపు నీరు లీక్ అవుతున్నది. కొన్నిచోట్ల పెచ్చులు ఊడుతున్నాయి. మొదట సెక్రటేరియెట్ నిర్మాణ ఖర్చు రూ.400 కోట్లని అంచనా వేసి బడ్జెట్లో చూపించారు. టెండర్లు ఖరారయ్యాక రూ. 619 కోట్లు ఖర్చవుతుందన్నారు. ఆ తర్వాత ధరలు పెరిగాయని, నిర్మాణ ఖర్చు రూ. 800 కోట్లు అవుతుందన్నారు. అది మళ్లీ వెయ్యి కోట్లకు చేరింది. పనులు పూర్తయినా కూడా లెక్కలపై క్లారిటీ లేదు. దీనిపై ప్రస్తుత ప్రభుత్వం ఎంక్వైరీ చేయిస్తున్నది.
ALSO READ : కేసీఆర్ ట్యాపింగ్ తంత్రం.?
అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సెక్రటేరియెట్నిర్మాణానికి సంబంధించి 2020 అక్టోబర్‌లో షాపూర్జీ పల్లోంజీ సంస్థ టెండర్లు దక్కించుకుంది. కానీ, దీంట్లోనూ కొన్ని సబ్ కాంట్రాక్టులు బీఆర్ఎస్ ముఖ్య లీడర్లకు చెందిన వాళ్లకే ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేవలం సెక్రటేరియెట్ నిర్మాణ టైంలో వీడియో తీసేందుకే దాదాపు కోటి రూపాయలు కేటాయించినట్లు ప్రస్తుత ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వాస్తవానికి ఏడాదిలో పూర్తి కావాల్సిన పనులు ఆలస్యం కావడంతో అంతకంతకూ ఖర్చు పెంచుతూ పోయారు. జిల్లా సమీకృత కలెక్టరేట్లలోనూ ఇదే వ్యవహారం నడిచింది. జిల్లాల్లో అయితే ఇష్టమొచ్చినట్లు అప్పడు జిల్లా ఇన్చార్జ్ మంత్రులుగా ఉన్నవాళ్లు తమ దగ్గరివాళ్లకు సబ్ కాంట్రాక్టులు ఇప్పించుకున్నట్లు ప్రస్తుత ప్రభుత్వం దృష్టికి వచ్చింది. సమీకృత కలెక్టరేట్లకు ముందుగా రూ. 1,500 కోట్లు అంచనా వేయగా.. అవి రూ.1,850 కోట్లు దాటాయి.