- పొంగులేటి, తుమ్మల, భట్టికి చెక్ పెట్టేలా వ్యూహం
- సత్తుపల్లి నియోజకవర్గంలో 100% అమలు వెనుక అసలు కారణాలు ఇవే..
- మధిరలో గెలుపే లక్ష్యంగా బోనకల్ మండలంలో అమలు
ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తమ క్యాడర్లో జోష్ పెంచేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి దళితబంధు అస్త్రాన్ని బయటికి తీసింది. రెండు నెలల వ్యవధిలో బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోపాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ఒకేసారి చెక్ పెట్టేలా వ్యూహ్యాన్ని అమలు చేస్తోంది. ఇప్పటివరకు కేవలం హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రమే వంద శాతం దళితబంధు పథకాన్ని అమలుచేసింది. తాజాగా సత్తుపల్లి నియోజకవర్గం ఆ జాబితాలో చేరింది. మధిర నియోజకవర్గం చింతకాని మండలంలో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా దళితబంధును అమలు చేశారు.
ఇప్పుడు అదే నియోజకవర్గానికి చెందిన బోనకల్మండలంలోని దళిత కుటుంబాలకు పథకాన్ని వర్తింపజేస్తున్నారు. మంత్రి కేటీఆర్జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో సత్తుపల్లి నియోజకవర్గంలో పూర్తిగా, బోనకల్ మండలంలో దళితబంధు అమలు చేస్తామని ప్రకటించగా, ఆ తర్వాత కొన్ని గంటల్లోనే జీఓ విడుదలైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టు సాధించేందుకే అధికార పార్టీ ఈ ఎత్తుగడ వేసిందనే చర్చ జరుగుతోంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైన బీఆర్ఎస్ ఈసారి ఎలాగైనా మెరుగైన సీట్లు సాధించాలనే ప్లాన్‌తో దళితబంధు పథకాన్ని ప్రకటించారని చెప్పుకుంటున్నారు.
28 వేల దళిత కుటుంబాలకు లబ్ధి
ఉమ్మడి జిల్లాలోని కీలక నేతలైన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు రెండు నెలల గ్యాప్‌లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. వీరిద్దరికీ సత్తుపల్లి నియోజకవర్గంలో గట్టి పట్టుంది. పొంగులేటి సొంతూరు కల్లూరు మండలం నారాయణపురం ఇందులోనే ఉంది. తుమ్మల స్వస్థలం గండుగులపాడు కాగా నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఇది కూడా సత్తుపల్లిలోనే ఉండేది. ఇక పొంగులేటితోపాటు కాంగ్రెస్‌లో చేరిన మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు సత్తుపల్లికి చెందినవారే. వీళ్లంతా గత ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ లో ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ సపోర్టుతో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సండ్ర వెంకట వీరయ్య వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్విజయం సాధించారు.
కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. బీఆర్ఎస్అభ్యర్థిగా సండ్ర పోటీ చేస్తుండగా, మిగిలిన నేతలంతా కాంగ్రెస్‌లో ఉన్నారు. వారి ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఉండకుండా చూసేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. సత్తుపల్లికి చెందిన ఫార్మా వ్యాపారవేత్త పార్థసారథిరెడ్డి బీఆర్ఎస్నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయనకే సత్తుపల్లి ఎన్నికల ఇన్చార్జ్బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎంపీ పార్థసారథిరెడ్డి రిక్వెస్ట్ మేరకు సత్తుపల్లి నియోజకవర్గంలో 100 శాతం దళితబంధు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గంపగుత్తగా దళితుల ఓట్లను దక్కించేందుకు బీఆర్ఎస్ప్లాన్చేస్తోంది. కాగా నియోజకవర్గ వ్యాప్తంగా 28 వేల దళిత కుటుంబాలకు లబ్ధి చేకూరే అవకాశముంది.
భట్టిపైనా ఎఫెక్ట్
ఉమ్మడి ఖమ్మంలో మూడు జనరల్, ఐదు ఎస్టీ రిజర్వుడ్నియోజకవర్గాలు ఉన్నాయి. సత్తుపల్లి, మధిర మాత్రమే ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలు. ఇందులో సత్తుపల్లిలో 100 శాతం దళితబంధు అమలు చేస్తుండగా, మధిర నియోజకవర్గంలోని బోనకల్ మండలంలోనూ అమలు చేయాలని ప్రభుత్వం ప్లాన్చేసింది. మధిర పరిధిలోని చింతకాని మండలంలో గతంలోనే పైలట్ ప్రాజెక్టుగా దళితబంధును అమలు చేసింది. 3,462 మంది లబ్ధిదారులకు ఇప్పటికే యూనిట్లు అందజేశారు.
ఇప్పుడు బోనకల్ మండలంలో మరో 4 వేల మందికి దళితబంధు దక్కనుంది. వచ్చే ఎన్నికల్లో మధిరలో ప్రస్తుత జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు బీఆర్ఎస్తరఫున పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో ఆయనే భట్టి మీద పోటీ చేసి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి చింతకాని, బోనకల్ లో దళితబంధు అమలు చేయడం తమకు కలిసి వస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది.
అమలు సాధ్యమేనా!
గత నెల 30న ఖమ్మం జిల్లాలో కేటీఆర్ పర్యటన సందర్భంగా దళితబంధును ప్రకటించగా, అదే రోజు రాత్రి జీఓ ఎంఎస్‌నం.16 రిలీజైంది. అయితే వారం రోజుల్లో ఎప్పుడైనా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆ వెంటనే నోటిఫికేషన్ రానుంది. చింతకాని మండలంలో దళితబంధు పూర్తిస్థాయిలో అమలు కావడానికి దాదాపు ఆరు నెలలు పట్టింది. గ్రామానికి ఒకరు చొప్పున జిల్లా స్థాయి అధికారిని స్పెషల్ఆఫీసర్గా నియమించడంతో ఇది సాధ్యమైంది. ప్రస్తుతం ఆఫీసర్లంతా ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నారు. ఈ టైంలో లబ్ధిదారులకు యూనిట్ల గ్రౌండింగ్ అసాధ్యమన్న వాదన వినిపిస్తోంది.