సీజన్​  పోవట్టే.. చేప పిల్లలు రాకపాయే..

  •     టెండర్లు పూర్తయినా ప్రాసెస్​ స్టార్ట్​ కాలే
  •     గతేడాది నామమాత్రంగా పంపిణీ  

పెద్దపల్లి, వెలుగు : చేప పిల్లల పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ఇప్పటికే టెండర్లు పూర్తయినా  సప్లై ఆలస్యమవుతోంది. అధికారులు మాత్రం ఈ నెలాఖరు వరకు పంపిణీ పూర్తి చేస్తామంటున్నారు. కానీ పరిస్థితులు మాత్రం వేరేలా ఉన్నాయి.  గత సంవత్సరం సర్కార్ ఉచిత చేప పిల్లలను పంపిణీ చేసినప్పటికీ చేప పిల్లల సైజు విషయంలో మత్స్యకారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యాపారుల వద్ద చేప పిల్లలను కొని చెరువుల్లో వేశారు. లేట్​గా వేయడంతో సరైన టైంకు చేతికి రాకపోగా చాలావరకు చనిపోయాయి. దీంతో  తాము తీవ్రంగా నష్టపోయామని, ఈ సారైనా  టైంకు చేప పిల్లలను పంపిణీ చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు.

ప్రశ్నార్థకంగా చేప పిల్లల పంపిణీ..

ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. గత ఏడాది టెండర్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో అరకొరగా పంపిణీ చేశారు. ఈ సారైనా చేప పిల్లలను  ఇన్​టైంకు పంపిణీ చేస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, పార్వతి బ్యారేజ్,​1013 చెరువులు ఉన్నాయి. వీటిపై 133 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు చెందిన 9,003 కుటుంబాలు, 38 మహిళా సొసైటీలపై 1,279 కుటుంబాలు, 7 మత్య్స పారిశ్రామిక మార్కెటింగ్​ సంఘాల ద్వారా 360 కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నారు. వీరికి ప్రభుత్వం లైసెన్సులు జారీ చేసి ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తోంది.  ప్రతి యేటా చేప పిల్లల పంపిణీని జులైలోనే కంప్లీట్​ చేసేవారు.

దీని కోసం మే నెల నుంచే సర్కార్​ ఏర్పాట్లు చేసేది. చేప పిల్లల సప్లయ్​కోసం టెండర్లను ఆహ్వానించేది.   ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో పెంచేందుకు 80 నుంచి 100 ఎంఎం సైజు చేప పిల్లలు, చెరువులు, కుంటల్లో పెంచేందుకు 35 నుంచి 40 ఎంఎం సైజులో ఉండే చేప పిల్లలను పంపిణీ చేసేవారు. గత ఏడాది టెండర్ల ప్రక్రియలో గోల్​మాల్​ జరిగిందన్న ఆరోపణలతో చేప పిల్లల పంపిణీ లేటయింది. ఈ యేడు కూడా సమయం దాటి పోతున్నా సర్కార్​ నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.

సర్కార్​ కావాలనే లేట్​ చేస్తోందా..

ఉచిత చేప పిల్లల పంపిణీని పక్కన పెట్టాలనే ఉద్దేశ్యంతోనే సర్కార్​ కావాలనే లేట్​ చేస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి.  గత సంవత్సరం మాదిరిగానే  ఈసారి కూడా ఎవరి దారి వారు చూసుకోవాలనే ఆలోచనలో సర్కార్ ఉన్నట్లు కన్పిస్తోంది. జిల్లాలో ఉన్న నీటి వనరులకు చేప పిల్లలను పెంచేందుకు దాదాపు కోటి 60 లక్షల చేప పిల్లలు , 30 లక్షల రొయ్య పిల్లలు అవసరమని మత్స్య శాఖ అధికారులు చెప్తున్నారు. గత ఏడాదిని దృష్టిలో పెట్టుకొని, ఈ యేడాది పంపిణీకి  సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి ఇప్పటికే పంపించినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. పోయినేడు కూడా కావాల్సిన చేప పిల్లల కోసం ప్రతిపాదనలు పంపించినా చేప పిల్లలు ఇన్​టైంలో పంపిణీ చేయలేదు. గత టెండర్లలో చేపపిల్లల ఫాంలు లేనివారు కూడా టెండర్లు వేశారని, అలాగే తక్కువ సైజు చేప పిల్లలను పంపిణీ చేశారని ఫిర్యాదు చేశారు.  

అప్పటికే మత్స్యకారులు ప్రైవేటు ఫాంలలో చేప పిల్లలను అధిక ధరలకు కొని చెరువులు, కుంటల్లో పోశారు. దీంతో చేపలు ఎదుగడం లేట్ అయింది.  ఎండాకాలం రావడంతో చెరువులు, కుంటలు ఎండిపోవడంతో  పెరగని చేపలను పట్టుకొని అమ్ముకోవాల్సి వచ్చిందని  చెప్తున్నారు. దీంతో తీవ్ర నష్టం వచ్చిందని వాపోతున్నారు. ఈ ఏడాది అసలు చేప పిల్లలను అనుకున్న  టైంలోపు  పంపిణీ చేస్తుందా లేదా అనే డైలమాలో మత్స్యకారులు ఉన్నారు. ఇప్పటికైనా వీలైనంత త్వరగా చేప పిల్లలు చెరవుల్లో పోసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.

ఈ నెలాఖరులోగా పంపిణీ చేస్తాం

చేప పిల్లల పంపిణీకి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఈనెలాఖరు లోగా పంపిణీ పూర్తి చేస్తాం. గతేడాది వివిధ కారణాల వల్ల చేప పిల్లలను అనుకున్న సమయానికి అందించ లేకపోయాం. ఈ సారి అలాంటి పరిస్థితి ఉండదు. 

- భాస్కర్​, డీఎఫ్​ఓ, పెద్దపల్లి జిల్లా

క్వాలిటీ, క్వాంటిటీ ఉంటలేవు

టెండర్ల వల్ల చేపలు క్వాలిటీ, క్వాంటిటీ ఉంటలేవు, గ్రామాల్లోని సొసైటీలకే  సీడ్స్​ కొని వేసుకునే వెసులు బాటు సర్కార్​ కల్పిస్తే నాణ్యమైన చేప పిల్లలను సరైన టైంలో చెరువుల్లో  పోయేవచ్చు. ఇప్పటికైనా చేప పిల్లలను చెరువుల్లో వేసే ప్రక్రియ స్టార్ట్​ చేయాలే. లేట్​ చేస్తే చేపలు ఎదుగయి. దాంతో మత్స్యకారులు నష్టపోయే చాన్స్​ ఉంటది.  

- బల్ల సత్తయ్య, ముదిరాజ్​ సంఘం జిల్లా అధ్యక్షుడు, పెద్దపల్లి