బీఆర్‌‌ఎస్ పదేళ్ల పాలనలో.. హైదరాబాద్లో అమ్మేసిన.. ప్రభుత్వ భూముల చిట్టా ఇది..

బీఆర్‌‌ఎస్ పదేళ్ల పాలనలో.. హైదరాబాద్లో అమ్మేసిన.. ప్రభుత్వ భూముల చిట్టా ఇది..

హైదరాబాద్: గత పదేండ్ల బీఆర్‌‌ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ), హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో హైదరాబాద్లో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను వేలం వేశారు. టీజీఐఐసీ ద్వారా రాయదుర్గం, ఖానామెట్, మణికొండ, నార్సింగి వంటి అత్యంత విలువైన ప్రాంతాల్లోని దాదాపు 500 ఎకరాల భూమిని, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో కోకాపేట్​, ఖానామెట్​, రాజేంద్రనగర్​, బుద్వేల్​, బాచుపల్లి, తొర్రూర్​, బహదూర్​పల్లి, కుర్మల్​గూడ, తుర్కయాంజల్​, మేడిపల్లి, కవాడిపల్లి, షాబాద్​, ఉప్పల్ ​భగాయత్లలో మరో 500 ఎకరాలకు పైగా భూములను  అమ్మేశారు. 

2021లో కోకాపేటలో 65 ఎకరాల భూమికి వేలం పాటలో రూ.2,729 కోట్లు వచ్చాయి. ఖానామెట్లో 24 ఎకరాల భూమిని వేలం వేసి రూ.వెయ్యి కోట్లకు పైగా సమకూర్చుకున్నారు. బుద్వేల్, రాజేంద్రనగర్​లో 100 ఎకరాలతో రూ.3,625 కోట్లు , కోకాపేట్​ నియోపోలిస్​లో 45.33 ఎకరాలతో రూ. 3,319.60 కోట్లు, బాచుపల్లి లో రూ. 111 కోట్లు, తొర్రూర్​లో రూ.400 కోట్లు మేర వచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 

►ALSO READ | హైదరాబాద్ సిటీలో ..కుప్పలు తెప్పలుగా రేషన్ కార్డు అప్లికేషన్లు

కోకాపేటలోనే ఎకరం రూ.100 కోట్లు పలకడం అప్పట్లో  సంచలనం సృష్టించింది. ఈ స్థాయిలో ప్రభుత్వ భూములను అమ్మిన కేసీఆర్​ సర్కారుపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ‘పడావుపడ్డ భూములను అమ్మి సంక్షేమ పథకాలు అమలుచేయడంలో తప్పేముంది?’ అని నాటి సీఎం కేసీఆర్​పలుమార్లు కౌంటర్​ఇచ్చారు. తీరా ఇప్పుడు కోర్టు ద్వారా న్యాయంగా దక్కిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని కూడా బీఆర్ఎస్​తప్పుపట్టడంపై విస్మయం వ్యక్తమవుతున్నది. మరోవైపు నాడు వెయ్యి ఎకరాలకు పైగా భూములు అమ్ముతున్నా చోద్యం చూసిన బీజేపీ పెద్దలు ఇప్పుడు కాంగ్రెస్​సర్కారుపై మాత్రం హెచ్​సీయూ స్టూడెంట్లతో కలిసి ఏకంగా ఉద్యమమే చేస్తున్నారు.