దర్జాగా కబ్జా.. అక్రమంగా బీఆర్​ఎస్ జిల్లా పార్టీ ఆఫీస్ నిర్మాణం

  • సర్కారు ఎకరం ఇస్తే కట్టింది ఎకరన్నర పైనే..
  • గజానికి రూ.100కే కొట్టేసిన్రు 
  • బిల్డింగ్ నిర్మాణానికీ నో పర్మిషన్​ 
  • పట్టించుకోని ఆఫీసర్లు

జనగామ, వెలుగు: అధికారం చేతిలో ఉందని గత సర్కారు అడ్డగోలుగా భూ కబ్జాలకు పాల్పడింది. జనగామలో కోట్ల విలువ చేసే భూమిని అప్పనంగా కొట్టేసింది. పేదోడికి 80 గజాల ఇంటి స్థలం ఇచ్చేందుకు తిప్పలు పెట్టిన కేసీఆర్ తన పార్టీ ఆఫీస్​ల కోసం మాత్రం ఎకరాలకు ఎకరాలు వశపర్చుకున్నారు. అధికారికంగా ఎకరమైతే అనధికారికంగా మరో ఎకరం వరకు కాజేశారు. అడిగేవారు లేక జనగామ జిల్లా పార్టీ ఆఫీస్ కోసం దర్జాగా సర్కారు భూమిని ఆక్రమించారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించారు.  

కోట్ల విలువ భూమికి గజం వందే.. 

సామాన్యుడి గూడు కోసం చుక్కలు చూపించిన కేసీఆర్ తన వరకు వచ్చేసరికి రూల్స్ మార్చేసుకున్నారు. ఎక్కడా లేనివిధంగా కోట్ల విలువ చేసే భూములను కేవలం చదరపు గజానికి వంద రూపాయలు చెల్లించి, పార్టీ ఆఫీస్​ కు స్థలాన్ని కొట్టేశారు. బీఆర్​ఎస్ జనగామ జిల్లా ఆఫీస్ నిర్మాణానికి యశ్వంతా పూర్ భూమిని అప్పటి సర్కారు కట్టబెట్టింది. వరంగల్–హైదరాబాద్ నేషనల్ హైవేపై అత్యంత విలువ చేసే 82/15/1, 82/16/1, 82/17/1 అనే మూడు సర్వే నంబర్లలోని ఎకరం భూమిని ఇచ్చింది. ఇక్కడ అప్పట్లో ఎకరం కోటి విలువ చేయగా, ఇప్పుడు రెండు కోట్ల వరకు డిమాండ్ ఉంది.

కాగా, అప్పట్లో గజానికి కేవలం వంద చొప్పున మొత్తంగా రూ.4 లక్షల 84లకు అందించింది. అంతకుముందు 2018 ఆగస్టు 16న ఇదే జిల్లా పార్టీ ఆఫీస్​ కోసమని సిద్దిపేట రోడ్డులోని పసరమడ్ల శివారులోని 114/4 సర్వే నెంబర్​లో ఎకరం భూమిని కేటాయించారు. కానీ అధికార దర్పంతో దీనిని క్యాన్సిల్ చేయించి, రెండో సారి ప్రపోజల్స్​ పెట్టుకుని యశ్వంతాపూర్ హైవే పై తీసుకున్నారు. 2019 జూన్ 21న స్థల కేటాయింపు జరుగగా, కేవలం మూడు రోజుల వ్యవధిలో అదే నెల 24న అప్పటి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. నిర్మాణం పూర్తయ్యాక 2022 ఫిబ్రవరి 11న అప్పటి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆఫీస్ ఓపెనింగ్ చేయించి వాడుకలోకి తెచ్చారు. 

ఎకరం పైగా కబ్జా..

అధికార దుర్వినియోగం చేసి రాయించుకున్నది చాలదన్నట్లు అప్పటి గులాబీ ప్రజాప్రతినిధులు మరో అర ఎకరానికి ఎసరు పెట్టారు. పార్టీ అవసరాలకు కావాలని అధికారుల పై ఒత్తిడి తెచ్చారు. దీంతో అరెకరం కోసం రెవెన్యూ ఆఫీసర్లు ప్రభుత్వానికి అప్పట్లో మళ్లీ ప్రపోజల్స్ పంపించినా అధికారికంగా కేటాయింపు జరుగలేదు. కానీ, అధికారంలో ఉన్నాం.., అడ్డేముంది అన్నట్లు సుమారు ఎకరం కబ్జా పెట్టేశారు. అధికారికంగా కేటాయించిన ఎకరం స్థలంలో ఆఫీస్​ బిల్డింగ్​లు నిర్మించగా, ముందు ఉన్న సుమారు ఎకరం వరకు భూమిని ఆక్రమించి ప్రహరీ నిర్మించారు.

కాగా, ఆక్రమించిన భూమిలో కొంత మేర అప్పట్లో టీఎన్​జీవోవో సంఘానికి కేటాయింపు జరిగి ఉండగా, వారిని బెదిరించి తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. మరోచోట స్థలం తీసుకోవాలని హెచ్చరించినట్లు ఉద్యోగ వర్గాలు వాపోతున్నాయి. పార్టీ ఆఫీస్ కట్టిన ఏరియా మొత్తం పక్కాగా కొలతలు చేపడితే ఎంత మేర ఆక్రమించారనేది స్పష్టత రానుంది. కాగా, ఈ బిల్డింగ్ నిర్మాణానికి నేటికీ పర్మిషన్లు లేవని స్థానిక పంచాయతీ స్టాఫ్​ చెబుతోంది. ప్రస్తుత కాంగ్రెస్​ సర్కార్​ స్పందించి ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.