మంచిర్యాల, వెలుగు : గత బీఆర్ఎస్ సర్కారు చేసిన తప్పులతో మంచిర్యాల జిల్లాలో పోడు భూముల వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులందరికీ అటవీ హక్కు పత్రాలు ఇస్తామని చెప్పిన గత ప్రభుత్వం కొందరికే ఇచ్చింది.వాస్తవంగా కాస్తులో ఉన్న దానికంటే కంటే తక్కువ విస్తీర్ణానికే పట్టాలు జారీ చేసింది. మరోవైపు తాతలు, తండ్రుల కాలం నుంచి సాగు చేసుకుంటున్న పలువురికి హక్కు పత్రాలు రాకపోడంతో వారిని ఫారెస్ట్ ఆఫీసర్లు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. హక్కు పత్రాలు లేనివారు పోడు భూముల్లో అడుగుపెట్టడానికి వీల్లేదంటూ బెదిరిస్తున్నారు. రైతులు దున్నిన భూముల్లో తుమ్మ విత్తనాలు చల్లుతున్నారు. భూముల్లోకి వెళ్తే 1967 ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం కేసులు పెడుతామంటూ నోటీసులు జారీ చేశారు. దీంతో జిల్లాలోని పోడు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
5 వేల ఎకరాలకే పట్టాలు
జిల్లాలో పోడు సమస్య కొన్ని దశాబ్దాలుగా రగులుతోంది. ఈ నేపథ్యంలో గత బీఆర్ఎస్ సర్కారు పోడు చేసుకుంటున్న గిరిజన రైతులందరికీ పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఎట్టకేలకు నిరుడు జూన్ నుంచి దశలవారీగా పట్టాలు జారీ చేసింది. మంచిర్యాల జిల్లావ్యాప్తంగా దాదాపు13వేల మంది రైతులు 33 వేల ఎకరాలకు హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గ్రామాల వారీగా ఫారెస్ట్ రివ్యూ కమిటీ (ఎఫ్ఆర్సీ)ల ద్వారా విచారణ జరిపి, చివరకు జిల్లాలో 2,403 మంది రైతులకు 5,024 ఎకరాలకు మాత్రమే పట్టాలిచ్చారు. అప్పటి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల కనుసన్నల్లోనే ఇదంతా జరిగింది. ఫలితంగా బీఆర్ఎస్ కార్యకర్తలకు, లీడర్ల అనుచరులకే పట్టాలు దక్కాయన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే, రైతులు కాస్తులో ఉన్నదానికంటే తక్కువ విస్తీర్ణంలో పట్టాలు ఇచ్చారన్న విమర్శలు వచ్చాయి. ఉదాహరణకు ఒక రైతు ఐదెకరాల్లో సాగులో ఉంటే అతనికి మూడు ఎకరాలకే హక్కు పత్రం ఇచ్చారు. మిగతా రెండెకరాల్లో సాగు చేయడానికి వీల్లేదని అడ్డుకుంటున్నారు. కన్నెపల్లి మండలం కొత్తపల్లి శివారులోని 88, 89 సర్వేనంబర్లలోని ప్రభుత్వ భూమిని గ్రామానికి చెందిన గిరిజన రైతులు చాలా ఏండ్లుగా సాగు చేసుకుంటున్నారు. 89 సర్వే నంబర్లో 34 మంది కాస్తులో ఉండగా, 16 మందికి మాత్రమే అటవీ హక్కు పత్రాలు ఇచ్చారు. జూన్ 7న ఆర్డీవో, ఎఫ్ఆర్వోలు మోఖాపై విచారణ చేసినప్పటికీ 12 మంది పేర్లను రికార్డుల్లో చూపడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నోటీసులు..కేసులు..
గత బీఆర్ఎస్ సర్కారు ఇచ్చిన హక్కు పత్రాలు మినహా అంతకుముందు ఉమ్మడి రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన పట్టాలను ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఆ పత్రాలతో భూములు దున్నుకుంటున్న రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. కోటపల్లి మండలంలోని చాలా గ్రామాల్లో ఉమ్మడి రాష్ర్టంలో కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన పట్టాలు రైతుల దగ్గర ఉన్నప్పటికీ వారిని సాగు చేయకుండా అడ్డుకుంటున్నారు. పోడు రైతుల గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఏవైనా పత్రాలు ఉంటే ఫారెస్ట్ ఆఫీసులో అందజేయాలని గత నెలలో నోటీసులు జారీ చేశారు. ‘నీవు రక్షిత అటవీ భూమిని అక్రమంగా ఆక్రమించి సాగు చేస్తున్నావని తేలింది. రక్షిత అటవీ భూమిని అక్రమించడం, దున్ని సాగు చేయడం ఫారెస్ట్ యాక్ట్ 1697 సెక్షన్ 20(1) (C) (VII) ప్రకారం చట్టరీత్యా నేరం. ఈ భూమి నీకు సంబంధించినది అని తెలిపే ఏవైనా ప్రభుత్వ అనుమతి పత్రం/పట్టా ఉంటే ఏడు రోజుల్లోగా అందజేయాలి. లేకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకోబడును’ అంటూ నోటీసులు ఇవ్వడంతో పోడు రైతులు ఆందోళన చెందుతున్నారు.
రైతులపై దాడులు... ట్రాక్టర్లు సీజ్
పోడు రైతులపై దాడులు చేయవద్దని ప్రభుత్వం చెప్తున్నా క్షేత్రస్థాయిలో ఫారెస్ట్ ఆఫీసర్ల ధోరణి మారలేదు. ట్రాక్టర్లను సీజ్ చేయడం, నాగళ్లను తీసుకెళ్లడం, రైతులను ఆఫీసుల్లో నిర్బంధించడం వంటి సంఘటనలు జిల్లాలో జరుగుతున్నాయి. జన్నారం మండలం తపాల్పూర్కు చెందిన ఆత్రం రాజును అక్రమ కేసులో ఇరికించి జైలుకు పంపారని, కోటపల్లి మండలం లింగన్నపేటకు చెందిన బాగాల చంద్రయ్య, బాగాల రవి భూమి దున్నుండగా ఫారెస్ట్ ఆఫీసర్లు వారిని అదుపులోకి తీసుకుని రెండు రోజులు ఆఫీసులో బంధించారని, సూపాకలో హక్కుపత్రాలు ఇచ్చిన భూములను దున్నుతుండగా ఏడు నాగళ్లను స్వాధీనం చేసుకున్నారని గిరిజన సంఘాల లీడర్లు తెలిపారు. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్‌లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఫారెస్ట్ అధికారుల తీరుపై ఫైర్ అయ్యారు. గత కాంగ్రెస్ సర్కారు జారీ చేసిన పత్రాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. రైతులపై దాడులు చేయడం, పంటలు ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడితే రైతుల నుంచి ప్రతిచర్యలు కూడా అదే రీతిలో ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. అయినా ఫారెస్ట్ఆఫీసర్లు బేఖాతరు చేస్తున్నారని ఆయన విమర్శిస్తున్నారు. పోడు రైతులపై ఫారెస్ట్ అధికారుల దాడులను ఆపాలని, సాగుదారులకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత నెల 18న తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లాలోని పోడు రైతులు కలెక్టరేట్‌ను కూడా ముట్టడించారు.
చెన్నూర్ ఎఫ్‌డీవో ఆఫీస్ ఎదుట ధర్నా
చెన్నూర్: చెన్నూర్మండలం ఆస్నాద గ్రామానికి చెందిన రైతులు సోమవారం స్థానిక ఎఫ్‌డీవో ఆఫీస్ఎదుట ధర్నా చేశారు. గ్రామ శివారులోని 582,730,732 సర్వేనంబర్లలోని 500 ఎకరాల్లో 60 ఏండ్లుగా సాగు చేసుకుంటున్నామని, ఈసారి ఫారెస్ట్ఆఫీసర్లు అడ్డుకుంటున్నారని గ్రామ రైతులు ఉదయం జరిగిన గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సమస్యను పరిష్కరించాలని కలెక్టర్కుమార్దీపక్ఎఫ్డీవోను ఆదేశించారు. దీంతో 150 మంది రైతులు ఫారెస్ట్ ఆఫీసుకు చేరుకుని ఎఫ్‌డీవో రమేశ్‌కు సమస్యను వివరించారు. ఆయన పంటలు వేయొద్దని తేల్చి చెప్పడంతో రైతులు రోడ్డెక్కారు. చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రాసి పంపిన లెటర్‌ను కూడా ఎఫ్‌డీవో లెక్కలోకి తీసుకోలేదని ఫైర్అయ్యారు. గత ఏడాది అటవీ అధికారులు13 మందిపై అక్రమ కేసులు పెట్టారన్నారు. రైతుబంధు, రుణమాఫీ, రైతుబీమా తీసుకుంటున్నప్పటికీ తమకు భూమిపై హక్కులేదని, ఈ సీజన్లో విత్తనాలు వేయొద్దని ఎఫ్‌డీవో హుకుం జారీ చేశారని, భూముల దగ్గరికి వస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని వాపోయారు.