తెలంగాణ రాష్ట్రంలోని సామాజిక సమూహాలలో నూటికి తొంభై శాతం మంది బీసీలు, దళితులు, గిరిజనులు మైనారిటీలు ఉన్నారు. వీరు ఇప్పుడిపుడే ఉన్నత విద్య లోకి ప్రవేశిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఉన్నత విద్యారంగం కుదేలు కావడం అంత యాదృచ్చికం ఏమీ కాదు! ఒక వైపు పుట్టగొడుగుల్లా ప్రైవేటు కాలేజీలు, యూనివర్సిటీ లు ఏర్పాటు కావడం వలన ఈ వర్గాలను ఉన్నత చదువులకు దూరం చేయడమే అవుతుంది.
తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే 2022 ప్రకారం ఉన్నత విద్యలో 3712 జూనియర్ కాలేజీలు, 1086 డిగ్రీ కాలేజీలు, 1410 ప్రొఫెషనల్ కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీలలో 70 శాతం ప్రైవేట్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఉన్నత విద్యలో ఒక వైపు అణగారిన విద్యార్థుల నమోదు శాతం పెరుగుతుంటే మరొక వైపు ప్రభుత్వ ఉన్నత విద్యలో మౌలిక సదుపాయాలు కొరవడటం ఒక విచిత్రం!
శాశ్వత అధ్యాపకులేరి?
ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో కాంట్రాక్టు, పార్ట్ టైం ఉద్యోగులతో నెట్టుకొస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదకొండు యూనివర్సిటీల్లో ప్రభుత్వ పరంగా మంజూరు అయిన పోస్టులు 2,825 కాగా, ఇందులో 1977 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అన్ని వర్సిటీలలో కలిపి కేవలం 848 మంది శాశ్వత అధ్యాపకులు మాత్రమే ఉన్నారు. దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యను ఎంతగా నిర్లక్ష్యం చేస్తుందో తెలిసిపోతుంది. వర్సిటీల్లో శాశ్వత అధ్యాపకుల పోస్టులను సకాలంలో భర్తీ చేయకపోవడం వలన గత తొమ్మిది సంవత్సరాలుగా చాలా మంది అధ్యాపకులు పదవీ విరమణ పొందారు. వర్సిటీలలో ఖాళీ అయిన ఉద్యోగాలను ఎప్పటికప్పుడు భర్తీ చేయవసిన ప్రభుత్వం మొద్దు నిద్దరపోయింది. అందువలన ఉన్నత విద్యలో బోధన, పరిశోధనలో విద్యా ప్రమాణాలు ఘోరంగా దెబ్బతిన్నాయి.
ALSO READ :ఏసీసీతో అవినీతిని ఆపొచ్చు : ఆకునూరి మురళి
వర్సిటీలకు న్యాక్ గుర్తింపు ఇక కష్టమే...
తెలంగాణ లోని అన్ని వర్సిటీలు అధ్యాపకుల కొరత వల్ల న్యాక్ గుర్తింపును కోల్పోయే ప్రమాదంలో ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో అతి పెద్దదైన ఉస్మానియా యూనివర్సిటీకి 2017 సంవత్సరంలో న్యాక్ A + గ్రేడ్ మాత్రమే వచ్చింది. ఇప్పడు అధ్యాపకుల తీవ్ర కొరత వలన వచ్చే సంవత్సరం నాటికి మరలా న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ కూడా రెన్యువల్ కావడం కష్టమే. వర్సిటీలకు న్యాక్ ఏ++ గుర్తింపు ఉంటే మన డిగ్రీలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. అంతేకాకుండా విదేశీ విద్యార్థులను ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. అలాగే, కేంద్రం, వివిధ పరిశోధన సంస్థల నుండి వర్సిటీలకు పెద్ద మొత్తంలో నిధులు విరివిగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే తెలంగాణలో శాతవాహన, జెఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ వంటి వాటికి న్యాక్ గుర్తిపులు లేవు. ఇప్పటికైనా ఉమ్మడి రిక్రూట్ మెంట్ బోర్డు ప్రతిపాదిత బిల్లును ప్రభుత్వం పక్కన పెట్టి, వర్సిటీల్లో పాత పద్ధతిలోనే యుద్ధ ప్రతిపాదికన ఉద్యోగాల భర్తీ చేపట్టాలి. లేనియెడల వర్సిటీలు ఈ విధంగానే కొనసాగితే చాలా వర్సిటీలు న్యాక్ గుర్తింపును కోల్పోయే ప్రమాదం ఉంది. న్యాక్ గుర్తింపు లేకపోతే వర్సిటీలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇచ్చే ర్యాంకింగ్స్ ను అందుకోలేవు. దాంతో వాటిలో చదివే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుంది.
ర్యాంకింగ్లో వర్సిటీల తడబాటు
దేశంలో జాతీయ స్థాయిలో కేంద్ర ఉన్నత విద్యాశాఖ కు అనుబందంగా పనిచేసే నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ ఈ ఏడాది విడుదల చేసిన ఆలిండియా యూనివర్సిటీల ర్యాంకింగు జాబితాలో మొత్తం 100 ర్యాంకుల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి కేవలం 4 వర్సిటీలు మాత్రమే ఉన్నాయి. అందులో ఐఐటీ హెచ్ 14, హెచ్సీయూ 20, నిట్ వరంగల్ 53, ఓయూ 64వ స్థానం పొందాయి. వీటిలో ఓయూ మునుపటి కంటే 18 స్థానాలు దిగజారడం శోచనీయం.
అంకితభావం లేనివారి చేతుల్లో వర్సిటీలు
వర్సిటీల వీసీలు ప్రభుత్వంతో అంటకాగుతూ వర్సిటీల ప్రయోజనాలను కాలరాస్తున్నారు. తమ వ్యక్తిగత ప్రయోజనాలే ఎజెండాగా పాలన సాగిస్తున్నారు. అందుకే నేడు విశ్వవిద్యాలయలు విజ్ఞాన కేంద్రాలుగా కాకుండా అధికార ఆవాసాలుగా మారిపోయాయి. అందువల్ల ఇప్పడు తెలంగాణ వర్సిటీలకు కావాల్సింది పాలనలో పారదర్శకంగా వ్యవహరించే వైస్ ఛాన్సులర్లు. కావాలి. అంతిమంగా ప్రభుత్వం వర్సిటీలకు సరిపడా బ్లాక్ గ్రాంట్ నిధులు విడుదల చేయాలి.
నిధులు, సౌలత్లు లేక..
తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం సరిపడా బ్లాక్ గ్రాంట్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల మౌలిక సదుపాయాల లేమితో అవి విలవిలలాడుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఏటా ఖర్చు రూ.752 కోట్లు. కానీ ప్రభుత్వం ఇచ్చిన బ్లాక్ గ్రాంట్స్ నిధులు రూ.418 కోట్లు మాత్రమే. అంటే ఇంకా 334 కోట్ల బ్లాక్ గ్రాంట్ నిధులను ప్రభుత్వం ఇవ్వడం లేదు. అందువల్ల ఈ లోటును పూడ్చడానికి వీసీలు దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా ఫీజులను పెంచుతున్నారు. ఇవి ప్రైవేటు యూనివర్సిటీల్లో ఉన్న ఫీజులతో సమానంగా ఉన్నాయి. అందువల్ల చాలా మంది పేద, మధ్య తరగతి విద్యార్థులు ఈ ఫీజులను కట్టలేక మధ్యలోనే తమ చదువులను వదిలేస్తున్నారు. తెలంగాణ స్వరాష్ట్రంలో ప్రభుత్వ వర్సిటీలలో ఉన్నత విద్యను కొనుక్కునే దుస్థితికి తీసుకువచ్చిన ఘనత మాత్రం ఇప్పుడున్న ప్రభుత్వానికే దక్కుతుంది.
- డా.పెంట కృష్ణ, సోషల్ ఎనలిస్ట్