సర్కారు మాటల్లో ..ఏది నిజం?.. కాళేశ్వరం కింద లక్ష ఎకరాలు కూడా దాటలే

  • కాళేశ్వరం వచ్చినంక కోటి ఎకరాలకు సాగునీళ్లు ఇస్తున్నామని గొప్పలు
  • 9 ఏండ్లలో 8.46 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చామని విద్యుత్​శాఖ రిపోర్టులు
  • మరి ప్రాజెక్టులతో నీళ్లు ఇస్తుంటే.. ఏటేటా వ్యవసాయ బోర్లు ఎందుకు పెరుగుతున్నయ్?
  • రాష్ట్రంలో మొత్తం 27.5 లక్షల బోర్లు, బావుల కింద 68 లక్షల ఎకరాల సాగు
  • అన్ని ప్రాజెక్టుల కింద నీళ్లు ఇస్తున్నది 40 లక్షల ఎకరాల్లోపే
  • కాళేశ్వరం కింద లక్ష ఎకరాలు కూడా దాటలే

నెట్​వర్క్/జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు:  సాగునీటిపై రాష్ట్ర సర్కారు చెప్తున్న మాటలకు.. వాస్తవ పరిస్థితులకు పొంతన ఉంటలేదు. ‘‘కాళేశ్వరం వల్లే మండుటెండల్లోనూ చెరువులు మత్తళ్లు దుంకుతున్నయ్.. కాళేశ్వరం వల్లే కోటి ఎకరాల్లో భూమికి బరువయ్యే పంటలు పండుతున్నయ్’’ అంటూ ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్తున్నారు. కానీ విద్యుత్ శాఖ మాత్రం.. తెలంగాణ వచ్చిన కొత్తలో19.03 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా.. ఇప్పుడు 27.49 లక్షలకు పెంచినట్లు దశాబ్ది ఉత్సవాల్లో ఘనంగా ప్రకటించుకున్నది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి 8.46 లక్షలకు పైగా కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినట్లు చెప్పుకున్నది. మరి సర్కారు చెప్తున్నట్లుగా కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల నుంచి తెలంగాణలో ఇంచుఇంచుకూ కాలువ ద్వారా నీళ్లిస్తుంటే, రాష్ట్రవ్యాప్తంగా ఈ తొమ్మిదేండ్లలో కొత్తగా లక్షలాది బోర్లు, బావులు తవ్వుకొని, వాటికి విద్యుత్ కనెక్షన్లు తీసుకోవాల్సిన అవసరం రైతులకు ఎందుకు వచ్చింది? ఒకవేళ విద్యుత్​శాఖ చెప్పిన లెక్కలే నిజమైతే.. సీఎం కేసీఆర్ ​సహా మంత్రులు ఇన్నాళ్లుగా చెప్తున్నవన్నీ అబద్ధాలేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఏడాదికి సగటున లక్ష కనెక్షన్లు

తెలంగాణ ఏర్పడిన 2014లో రాష్ట్రవ్యాప్తంగా19.03 లక్షల వ్యవసాయ విద్యుత్‌‌‌‌ కనెక్షన్లు ఉండేవి. సగటున రెండున్నర ఎకరాల చొప్పున వీటి కింద సుమారు 47 లక్షల ఎకరాల భూమి సాగయ్యేది. గడిచిన తొమ్మిదేండ్లలో సగటున ఏడాదికి లక్ష చొప్పున కొత్తగా 8.46 లక్షల కనెక్షన్లకు పర్మిషన్‌‌‌‌ ఇచ్చినట్లు విద్యుత్​ దినోత్సవం సందర్భంగా ఆ శాఖ విడుదల చేసిన రిపోర్టుల ద్వారా తెలుస్తున్నది.  దీంతో కొత్తగా తవ్విన బోర్లు, బావుల కిందే అదనంగా మరో 21 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగినట్లు స్పష్టమవుతున్నది. మొత్తంగా చూస్తే రాష్ట్రవ్యాప్తంగా 68 లక్షల ఎకరాల భూమి బోర్లు, బావుల కిందే సాగవుతున్నట్లు క్లారిటీ వచ్చింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత బోర్లు, బావుల సంఖ్య పెరగడం వల్లే వ్యవసాయ విద్యుత్​వినియోగం కూడా పెరుగుతున్నది. 

2014 జూన్​6న రాష్ట్ర రోజువారీ విద్యుత్ వినియోగం 128 మిలియన్ యూనిట్లు కాగా, ఈ ఏడాది వేసవిలో సగటు వినియోగం 230 మిలియన్ యూనిట్లకు చేరింది. వ్యవసాయ విద్యుత్ వినియోగం పీక్స్​కు చేరుకోవడంతో ఈ ఏడాది మార్చి 14న 297.89 మిలియన్​యూనిట్ల డిమాండ్ నమోదైంది. వ్యవసాయ సగటు విద్యుత్ వినియోగం తెలంగాణ వచ్చిన కొత్తలో సుమారు 51 మిలియన్ యూనిట్లు కాగా, ప్రస్తుతం 119 మిలియన్ యూనిట్లకు పెరిగినట్లు స్పష్టమవుతున్నది. అంటే కాళేశ్వరం సహా వివిధ ప్రాజెక్టుల ద్వారా కోటి ఎకరాలకు సాగు నీరిస్తున్నామంటూ సర్కారు చెప్తున్న మాటలన్నీ తాజాగా విద్యుత్​శాఖ ఇచ్చిన రిపోర్టులతో అబద్ధమని తేలిపోయాయి. సర్కారు చెప్పిన కోటి ఎకరాల్లోంచి బోర్లు, బావుల కింద సాగవుతున్న 68 లక్షల ఎకరాలు తీసేస్తే ప్రాజెక్టుల కింద సాగవుతున్నది 40 లక్షల ఎకరాల్లోపేనని స్పష్టమవుతున్నది. 

కాళేశ్వరం నుంచి గతేడాది ఖరీఫ్‌‌లో 74,200 ఎకరాలకే!

కాళేశ్వరం సహా వివిధ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి కోటి ఎకరాలకు నీళ్లిస్తున్నామని సర్కారు చెప్తున్నా.. అందులో నిజం లేదని ఏటా సాగునీటి కేటాయింపులకు సంబంధించి రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న శివమ్ కమిటీ మీటింగుల్లో తేలుతున్నది. గతేడాది డిసెంబర్‌‌‌‌లో జరిగిన శివమ్​కమిటీ మీటింగ్‌‌లోనూ, ఈ ఏడాది జనవరిలో రిలీజ్ చేసిన తెలంగాణ స్టాటిస్టికల్​అబ్​స్ట్రాక్ట్​–2022 రిపోర్టులోనూ ఈ విషయం బయటపడింది. గతేడాది ఖరీఫ్‌‌లో వివిధ ప్రాజెక్టుల కింద 40 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వగా, ఈ యాసంగిలో 36 లక్షల ఎకరాలకే పరిమితం చేశారు. ఇందులో కాళేశ్వరం కింద ఇచ్చింది  కేవలం 74,200 ఎకరాలకే! టీఎస్ఏ రిపోర్టులో మాత్రం కాళేశ్వరం కింద 1.16 లక్షల ఎకరాలకు ఇచ్చినట్లు చూపారు. దీన్ని బట్టి రైతులకు ఇస్తున్న సాగునీటిలో కాళేశ్వరం వాటా అత్యల్పం కాగా, ఈ యాసంగిలో అత్యధికంగా ఎస్సారెస్పీ కింద 8 లక్షల ఎకరాలకు, సాగర్ కింద 6 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చారు. సర్కారు చెప్పినట్లు కాళేశ్వరం కింద 20 లక్షల ఎకరాలకు, మొత్తం సాగునీటి ప్రాజెక్టుల కింద కోటి ఎకరాలకు నీరిస్తే ఆ మేరకు వ్యవసాయ విద్యుత్​ వినియోగం గణనీయంగా తగ్గాలి. 

తద్వారా ఏటా డిస్కమ్​లకు ఇచ్చే సబ్సిడీ కూడా తగ్గి ప్రభుత్వానికి వేల కోట్ల ఉపశమనం కలగాలి. కానీ 2014 నుంచి వ్యవసాయ కనెక్షన్లు పెరుగుతుండటం వల్ల సర్కారు చెల్లిస్తున్న సబ్సిడీ కూడా పెరుగుతున్నది. 2017-–18 ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీ కింద బడ్జెట్​లో 7,406 కోట్లు చెల్లిస్తే, 2023–-24లో ఏకంగా రూ.12,727 కోట్లు చెల్లించడం గమనార్హం. ఇలా కేటాయించిన నిధులు చాలక సర్కారు డిస్కంలకు వ్యవసాయ సబ్సిడీల కింద ఏకంగా 25 వేల కోట్లు బకాయి పడింది. శివమ్ కమిటీ మినిట్స్ తోపాటు ఇతర రిపోర్టులేవీ సాధారణ ప్రజలకు తెలియకపోవడంతో కోటి ఎకరాలకు సాగునీరిస్తున్నామంటూ సర్కారు మభ్యపెడుతున్నదని, తాజాగా విద్యుత్​శాఖ ఊరూవాడా వేసిన పోస్టర్లతో జనం నిజం తెలుసుకుంటున్నారని ఎక్స్‌‌పర్టులు అంటున్నారు.

బంగారం కుదవబెట్టి  బోరు వేసుకున్న

నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. పత్తి సాగు చేసుకుంటూ బతుకుతున్నం. గతేడాది మా తమ్ముడి బోరుతో పారిచ్చుకున్నం. ఈసారి వాళ్ల బోరులో నీళ్లు అడుగంటడంతో మా ఇంటామె మీది బంగారం బ్యాంక్ లో కుదువ పెట్టి బోరు వేసుకున్నం. దగ్గర్లోనే కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నా.. బాగా లోతు పోయినంకనే నీళ్లు పడ్డయ్. బోరు వల్ల లక్షా 85 వేల ఖర్చు వచ్చింది. కాళేశ్వరం కట్టినా మా లాంటి రైతులకు ఎలాంటి ఫాయిదా లేకపాయె.
- కొలుగూరి మల్లయ్య, ఒడిపిలవంచ, కాటారం మండలం, భూపాలపల్లి జిల్లా

బోర్ల తిప్పలు తప్పుత లేవు

కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి పచ్చని సాగు భూములను ఇచ్చినం. మేడిగడ్డ బ్యారేజీ కింద భూములు కోల్పోయినం. ప్రాజెక్ట్‌‌‌‌ కంప్లీట్‌‌‌‌ అయినంక ఇక్కడి రైతన్నల సాగునీటి గోస తీరుస్తమన్నరు. కానీ ప్రాజెక్ట్‌‌‌‌ స్టార్టయి మూడేండ్లు దాటింది. అయినా మా చేన్లలోకి సుక్క నీళ్లు వస్తలేవు. దీంతో మా భూముల్లో పంటలు పండించుకోవడానికి లక్షలు ఖర్చు పెట్టి బోర్లు వేసుకుంటున్నం. ఈ మధ్యే రూ.2 లక్షలు ఖర్చు పెట్టి బోరు బావి ఏసిన. కానీ సర్కారు ఇసుక తవ్వకాలకు పర్మిషన్ ఇవ్వడంతో అది కూడా ఎండిపోయింది. సర్కారు వల్ల రెండు విధాలుగా నష్టపోయినం.
- ములకల రాజబాబు,  సూరారం, మహాదేవ్‌‌‌‌పూర్‌‌‌‌ మండలం, భూపాలపల్లి జిల్లా