- స్థలాలు లేవని, రేట్లు ఎక్కువున్నాయని తప్పించుకుంటున్న ప్రభుత్వం
- ఇండస్ట్రియల్ పార్క్‌ల ఏర్పాటులోనూ హ్యాండిచ్చిన సర్కార్
జనగామ, వెలుగు : హైదరాబాద్ – వరంగల్ మధ్యలో ఉన్న జనగామను ఇండస్ట్రియల్ కారిడార్‌గా డెవలప్ చేస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఏళ్లు గడుస్తున్నా అమలుకు నోచుకోవడం లేదు. ఎలక్షన్లు రాగానే ఇదే హామీని తెరపైకి తీసుకొస్తున్న లీడర్లు ఆ తర్వాత మళ్లీ పట్టించుకోవడం లేదు. కారిడార్ సంగతి అటుంచితే కనీసం ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసేందుకు కూడా చర్యలు చేపట్టడం లేదు. తాజాగా రాష్ట్రంలో 18 జిల్లాల పరిధిలో 70 ఇండస్ట్రీయల్ పార్క్‌ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం అందులో జనగామకు చోటివ్వలేదు. దీంతో నిరుద్యోగులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్థలాలు లేవంటూ...
హైదరాబాద్‌కు కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న జనగామను ఇండస్ట్రియల్ కారిడార్‌గా డెవలప్ చేస్తామని 2014 ఎన్నికల టైంలోనే హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లోనూ మరోమారు ఇదే హామీని తెరపైకి తీసుకొచ్చారు. కానీ కారిడార్ ఏర్పాటుకు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా జనగామ జిల్లాలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు అడ్డంకులు ఉన్నాయని చెబుతున్నారు. నేషనల్ హైవేకు కిలోమీటర్ విస్తీర్ణంలో సర్కారు స్థలాలు అందుబాటులో లేవని, హైవే పక్కన భూముల ధరలు చాలా ఎక్కువగా ఉండడంతో కారిడార్ ఏర్పాటు కష్టమని ఆఫీసర్లుతేల్చేస్తున్నారు.
ఇండస్ట్రియల్ పార్క్‌ల ఏర్పాటులోనూ మొండిచెయ్యే
కారిడార్ ఏర్పాటులో ఇబ్బందులు ఎదురైతే కనీసం ఇండస్ట్రియల్ పార్క్‌ల ఏర్పాటుకైనా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేయడం లేదు. జిల్లాలో భూముల లభ్యత ఎక్కడ ఉంటే అక్కడ ఇండస్ట్రియల్ పార్క్‌లు ఏర్పాటు చేసుకోవచ్చు. రాష్ర్టంలో 70 ఇండస్ట్రీయల్ పార్క్‌ల ఏర్పాటుకు సర్కారు ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ప్రపోజల్స్‌ను సైతం సిద్ధం చేశారు. అయితే జనగామ జిల్లాకు ఆనుకొని ఉన్న సిద్దిపేటలో 6, యాదాద్రిలో 4 ఇండస్ట్రియల్ పార్క్‌ల ఏర్పాటుకు చర్యలు చేపట్టిన ప్రభుత్వం జనగామకు మాత్రం మొండి చెయ్యి చూపింది. జనగామ జిల్లాలోని దేవరుప్పుల మండలం మన్‌పహాడ్ సమీపంలో 145 ఎకరాలను టీఎస్‌ఐఐసీ సేకరించింది. దీనికి తోడు స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నష్కల్‌లోనూ సుమారు 96 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఈ రెండు చోట్ల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు జరుగనుందని పాలకులు, ఆఫీసర్లు కొంతకాలంగా ఊరిస్తూ వచ్చారు. కానీ సర్కారు తాజా ప్రకటనలో జనగామ జిల్లాకు చోటు దక్కకపోవడం నిరాశ మిగిల్చింది. మరోవైపు యేండ్ల తరబడి సాగుతున్న కళ్లెం టెక్స్‌టైల్ పార్క్ ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.
ALSO READ :ఎన్నికలప్పుడే గుర్తొస్తమా? సొంత ఇలాకాలో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ
నిరాశలో నిరుద్యోగులు
జనగామ జిల్లా కేంద్రం రవాణాపరంగా అనుకూలంగా ఉంటుంది. హైదరాబాద్, వరంగల్, సూర్యాపేట, సిద్దిపేట మధ్య జంక్షన్‌లా ఉండడంతో పాటు జిల్లా కేంద్రానికి రైల్వే సౌకర్యం కూడా ఉంది. దీంతో ఇండస్ట్రీల ఏర్పాటుకు అత్యంత అనుకూల ప్రాంతంగా మారింది. కానీ ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు జరగకపోవడంతో యువత నిరాశ చెందుతున్నారు. జనగామ జిల్లా నుంచి వేలాది మంది ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటారు. అన్ని సౌకర్యాలు ఉన్న జనగామ ప్రాంతంలో ఇండస్ట్రీలు ఏర్పాటైతే నిరుద్యోగ సమస్య తీరుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
జనగామపై వివక్ష
జనగామపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోంది. ఇక్కడి నుంచి వందలాది మంది బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు పోతున్నరు. స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటైతే నిరుద్యోగులకు కొంత మేలు జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కాక, ప్రైవేటు ఉపాధి మార్గాలు లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మహంకాళి హరిశ్చంద్ర గుప్త, జనగామ