
- నిర్మల్‌లో హరిత రిసార్ట్ నిర్మాణ పనులకు బ్రేక్
- నిధుల కొరతతో ముందుకు సాగని టూరిజం డెవలప్మెంట్
నిర్మల్, వెలుగు: అపారమైన ప్రకృతి వనరులు, చారిత్రక కట్టడాలు, పురాతన దేవాలయాలకు నెలవుగా ఉన్న నిర్మల్ జిల్లాను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం టూరిజం కారిడార్‌గా డెవలప్ చేస్తామని హామీ ఇచ్చి గాలికి వదిలేసింది. ఎక్కడా ఎలాంటి అభివృద్ధి కార్యక్ర మాలు చేపట్టలేదు. దీంతో ఆ ప్రాంతాలకు వెళ్లేందుకు పర్యాటకులు వెనుకడుగు వేస్తున్నారు.
చారిత్రక దేవాలయాలన్నింటినీ సందర్శించేలా..
టూరిజం కారిడార్ కోసం అప్పటి పర్యాటక శాఖ కమిషనర్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించి కారిడార్‌కు దాదాపు రూ.50 కోట్లతో ప్రతిపాదనలను రూపొందించారు. జిల్లాలోని అన్ని పర్యాటక ప్రదేశాలను కలుపుతూ రూట్ మ్యాప్‌ను సైతం సిద్ధం చేశారు. రైల్వే సౌకర్యం ఉన్న బాసర నుంచి ఇటు కవ్వాల్ అభయారణ్యం, కుంటాల వాటర్ ఫాల్స్ వరకు ఈ రూట్ మ్యాప్‌ను తయారు చేశారు. నిర్మల్ టౌన్‌ను కేంద్రంగా చేసుకొని మూడు వైపులా ఈ టూరిజం కారిడార్ ను అనుసంధానం చేయాలని భావించి.. ఇందులో భాగంగానే బాసర సరస్వతి ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు.
దీనికి అనుగుణంగా ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలనుకున్నారు. చారిత్రక దేవాలయాలన్నింటినీ సందర్శించేలా టెంపుల్ కారిడార్ ను రూపొందించిన అధికారులు బాసర ఆలయం నుంచి మొదలుకొని మార్గమధ్యంలోని కదిలి పాపహరేశ్వరాలయం, కాల్వ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు మామడ మండలంలోని చారిత్రక బూరుగుపల్లి రాజరాజేశ్వరాలయాన్ని లింకప్ చేశారు. నిర్మల్ టౌన్‌లోని గండి రామన్న సాయిబాబా మందిరం, మల్లన్న గుట్ట హరిహర క్షేత్రాన్ని ఈ కారిడార్ పరిధిలోకి చేర్చారు.
కాగితాలకే పరిమితమైన నివేదికలు
సహజ సిద్ధమైన ప్రకృతి వనరులు, కోటలు, బురుజులను కూడా కలుపుతూ కారిడార్ ను విస్తరించారు. నిర్మల్ టౌన్‌లోని శ్యామ్ గఢ్, బత్తీస్ గఢ్‌లను అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకట్టుకోవాలని భావించారు. ఇందుకోసం ఈ రెండు హోటళ్ల వద్ద కొంతమేర పనులు కూడా చేపట్టారు. ముఖ్యంగా శ్యామ్ గఢ్ వద్ద ఆకర్షణీయమైన లైటింగ్‌ను ఏర్పాటు చేశారు. కోట లోపల కూడా కొన్ని అభివృద్ధి పనులు చేశారు.
ఈ కోట వద్ద పర్యాటక శాఖ ఓ టూరిస్ట్ ప్లాజాను కూడా నిర్మించింది. కానీ పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టలేదు. ఇక్కడ నుంచి ఎస్సారెస్పీ ప్రాజెక్టు, సోన్ గోదావరి పాత బ్రిడ్జి, కడెం ప్రాజెక్టులను కూడా ఈ కోటలకు లింక్ చేశారు. కడెం ప్రాజెక్టు సందర్శన తర్వాత కవ్వాల్ అభయారణ్యాన్ని సందర్శించేలా టూరిజం కారిడార్‌లో ప్రతిపాదిం చారు. నిర్మల్ సమీపంలోని కుంటాల వాటర్ ఫాల్స్, పొచ్చెర వాటర్ ఫాల్స్‌ను కూడా కారిడార్ పరిధిలోకి తీసుకొచ్చారు.
కానీ ఇప్పటివరకు ఏ ఒక్క స్పాట్‌లోనూ సరైన అభివృద్ధి పనులు చేపట్టలేదు. టూరిజం కారిడార్ కోసం రెండేండ్ల క్రితం అధికారులు ప్రతిపాదనలు రూపొందించి, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సూచనలు జారీ చేశారు. నిధులు మంజూరు విషయమై బీఆర్ఎస్ ప్రభుత్వానికి నివేదికలు అందించారు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ ప్రతిపాదనలను కాగితాలకే పరిమితం చేసి చేతులు దులుపుకుంది. ఎక్కడ కూడా నయా పైసా విడుదల చేయకపోవడంతో ఈ ప్రతిపాదనలు నిలిచిపో యాయి. ఫలితంగా జిల్లా పర్యాటక రంగం అభివృద్ధికి నోచుకోవడంలేదు.
నిర్మల్‌లో నిలిచిపోయిన హరిత రిసార్ట్ నిర్మాణం
టూరిజం కారిడార్‌ను రూపొందించే క్రమంలో నిర్మల్ ను సెంటర్ పాయింట్ గా చేసుకోవాలని అధికారులు ప్రతిపాదించారు. ఇప్పటికే నిర్మల్‌లో అనుకూలమైన రవాణా సౌకర్యంతో పాటు లాడ్జిలు, ఇతర హోటళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. దీనికి తోడు టూరిజం శాఖ ఆధ్వర్యంలో హరిత రిసార్ట్‌ను కూడా నిర్మించే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. పర్యాటకులకు విడిది సౌకర్యంతో పాటు టూరిజం శాఖకు ఆదాయాన్ని సమకూర్చేలా హరిత రిసార్ట్‌ను డిజైన్ చేశారు. ఇందుకు రూ. 10 కోట్లతో ఇక్కడి ఐబీలో నిర్మాణ పనులు ప్రారంభించారు. కానీ ఎప్పటికప్పుడు నిధులు విడుదల కాకపోవడంతో పనులు నిలిచిపోయాయి.